నిందలతో సవాళ్లు సమసిపోవు! | Sakshi Guest Column On Pakistan, Balochistan Issues | Sakshi
Sakshi News home page

నిందలతో సవాళ్లు సమసిపోవు!

Feb 12 2026 12:17 AM | Updated on Feb 12 2026 12:17 AM

Sakshi Guest Column On Pakistan, Balochistan Issues

విశ్లేషణ

పాకిస్తాన్‌ నుంచి స్వాతంత్య్రాన్ని కోరుకుంటున్న బలూచిస్తాన్‌ యోధులు జన వరి 31న బలూచిస్తాన్‌లోని వివిధ ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. దాడుల్లో 37 మంది పౌరులతో పాటు, భద్రతా దళాలకు చెందిన 17 మంది హతులయ్యారు. తామే ఈ దాడులకు పాల్పడినట్లు బలూచిస్తాన్‌ లిబరేషన్‌ ఆర్మీ (బీఎల్‌ఏ) ప్రకటించింది. బలూచ్‌ యోధులు కనీసం 12 చోట్ల ఒకే సమయంలో దాడులు చేశారు. పోలీసు స్టేషన్లు, సైనిక సదుపాయాలు, ప్రభుత్వ కార్యాలయాలను లక్ష్యంగా చేసుకున్నారు. యోధుల్లో ఆత్మాహుతి దళానికి చెందిన ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. వారిలో ఒకరిని ఆసిఫా మెంగల్‌ (24)గా బీఎల్‌ఏ ప్రకటించింది. ప్రతి దాడుల్లో ఇంతవరకు 200 మందికి పైగానే మిలిటెంట్లు చని పోయారని సైన్యం వెల్లడించింది.

‘‘వీరు మామూలు టెర్రరిస్టులు కారు’’ అని పాక్‌ దేశీయాంగ మంత్రి మొహిసిన్‌ నఖ్వీ చేసిన వ్యాఖ్య దాడుల తీవ్రతకు అద్దం పట్టింది. వీటిలో ‘ఇండియా హస్తం’ ఉందని ఆయన ఆరోపించారు. ఆధారాలు చూపకుండా, గత రెండు దశాబ్దాలుగా పాక్‌ ఈ రకమైన ఆరోపణలు చేస్తూనే ఉంది.

బుగతీ హత్యతో మరో తిరుగుబాటు
నఖ్వీ చెప్పినదాంట్లో ఒకటి మాత్రం వాస్తవం. వారు ‘మామూలు టెర్రరిస్టులు’ కారు. దేశ విభజన సమయంలో కలాత్‌ ప్రాంతం పాక్‌లో విలీనమైన అంశం వివాదాస్పదంగానే ఉంది. అప్పటి నుంచి అంటే 1948 నుంచి 2000 ప్రారంభం వరకు బలూచ్‌ తిరుగుబాటు గెరిల్లా పోరాట పంథానే అనుసరిస్తూ వచ్చింది. గ్యాస్‌ పైపులైన్లు, విద్యుత్‌ లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు వంటి వాటిని ధ్వంసం చేసిన మిలిటెంట్లు పర్వత ప్రాంతాల్లోకి పరారయ్యేవారు. సాధారణంగా వారు బుగతీ లేదా మర్రీ అనే రెండు పెద్ద బలూచ్‌ తెగలలో ఒక వర్గానికి చెందినవారై ఉండేవారు. పాక్‌ పాలనా వ్యవస్థలో భాగంగా ఉన్న గిరిజన సర్దార్లు వాటికి నేతృత్వం వహించేవారు. 

రాజకీయ నాయకుని నుంచి తిరుగుబాటుదారుగా మారిన బలూచిస్తాన్‌ మాజీ ముఖ్యమంత్రి అక్బర్‌ ఖాన్‌ బుగతీని అప్పటి పాక్‌ సైనిక పాలకుడు జనరల్‌ పర్వేజ్‌ ముషారఫ్‌ ఆదేశాల మేరకు 2006లో వేటాడి చంపారు. పాక్‌ రాజ్య వ్యవస్థకు వ్యతిరేకంగా 1970లలో వామపక్ష విప్లవంలో మర్రీ తెగ సర్దార్‌ ఖేర్‌ బకష్‌ మర్రీ నాయకత్వ పాత్ర వహించారు. పాక్‌ ప్రభుత్వం ముందు బుగతీ 14 డిమాండ్లు పెట్టారు. బలూచిస్తాన్‌కు స్వయం ప్రతిపత్తి ఇస్తూ, ఆ ప్రాంతంలోని వనరులపై అక్కడి ప్రభుత్వానికే నియంత్రణ ఉండా లన్నది వాటిలో ఒకటి. వాటిపై కనీసం చర్చలు జరిపేందుకు కూడా ముషారఫ్‌ తిరస్కరించడం పెద్ద తప్పిదం. బుగతీ హత్యతో ఐదవ తిరుగుబాటు మొదలై ఈనాటికీ కొనసాగుతోంది. 

వనరులు బలూచిస్తాన్‌వి అయినా...
అక్బర్‌ ఖాన్‌ బుగతీ లేవనెత్తిన డిమాండ్లు కొత్తవేమీ కావు. వాటిని కోరినవారిలో ఇతరులూ ఉన్నారు. బలూచిస్తాన్‌లో వన రులు పుష్కలం. అది చమురు, ఇంధన వాయువు, ఖనిజాలు, రాగి, బంగారంతోపాటు ఇతర లోహాల నిక్షేపాలకు పేరెన్నికగన్నప్రాంతం. ఫీల్డ్‌ మార్షల్‌ ఆసిమ్‌ మునీర్‌ వాటి నమూనాలనే అమెరికాలో అధ్యక్షుడు ట్రంప్‌కు చూపించారు. ఆ ప్రాంతంలో లభ్య మయ్యేవాటిని తవ్వి తీసుకుపోవడమేగానీ, బలూచీ ప్రజానీకానికి అవి అందినది స్వల్పం. సుయీ చమురు క్షేత్రాల నుంచి గ్యాస్‌ ఇతర రాష్ట్రాలకు పైపుల ద్వారా వెళ్ళేది. కానీ, బలూచిస్తాన్‌లోని చాలా ప్రాంతాలకు అది అందని మావిపండుగానే ఉండేది. 

పాక్‌ 1993 నుంచి గనుల లీజులను విదేశీ కంపెనీలకు కట్టబెడుతూ వస్తోంది. చగాయీ జిల్లాలో రేకో డిగ్‌ వద్ద స్వర్ణ, తామ్ర గనుల తవ్వకాలు సాగుతున్నాయి. గ్వాదర్‌ పోర్టును నిర్మించే కాంట్రాక్టును ప్రభుత్వం చైనాకు అప్పగించింది. చగాయీలోనే సైండక్‌ ప్రాంతం వద్ద తామ్ర, స్వర్ణ గనుల తవ్వకాలను కూడా చైనాకు మంజూరు చేశారు. మునీర్‌ ఇపుడు ట్రంప్‌కు వాటినే ఆశ చూపుతున్నారు. ఇటీవలి దాడులు అక్కడ కార్యకలాపాలు నిర్వహించడానికి వచ్చే అంతర్జాతీయ సంస్థ లను పునరాలోచనలో పడేస్తాయనడంలో సందేహం లేదు. 

మారిన పోరాట పంథా
బలూచ్‌ తిరుగుబాటు తీరుతెన్నులు కూడా మారాయి. ఇప్పటి నేతలకు గిరిజన సర్దార్‌లకు రాజకీయంగా, లేదా సామాజికంగా ఎక్కడా పోలిక లేదు. గిరిజన నాయకులు కంటకప్రాయమైన పర్వత ప్రాంత శిబిరాల్లో రోజులు గడిపి ఉండవచ్చు. కానీ, వారి రాజకీ యాలు పాక్‌కు వ్యతిరేకమైనవి కావు. సమాఖ్య వ్యవస్థ లోపలే తమకు సముచిత స్థానం కల్పించాలనీ, తమను ప్రధాన లబ్ధిదా రులు కానివ్వాలనీ వారు కోరుకున్నారు.

బీఎల్‌ఏకు 2018 నుంచి బషీర్‌ జెబ్‌ నేతృత్వం వహిస్తున్నారు. బలూచ్‌ లిబరేషన్‌ ఫ్రంట్‌కు అల్లా నాజర్‌ నాయకత్వం వహిస్తు న్నారు. మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో జెబ్‌ డిప్లొమా చేయగా, నాజర్‌ వృత్తి రీత్యా డాక్టర్‌. వీరి నేతృత్వంలో బలూచ్‌ తిరుగుబాటు మరింత హింసాయుతంగా మారింది. ఆత్మాహుతి దాడులకు శ్రీకారం చుట్టింది. చైనా వర్కర్లను, వారి ప్రయోజనాలను లక్ష్యంగా చేసుకుని 2018 నుంచి వివిధ దాడులు చేసింది. సంచలనం సృష్టించిన 2025 నాటి రైలు హైజాక్‌ ఉదంతం కూడా తమ పనేనని బీఎల్‌ఏ చెప్పుకొంది. 

నేటి సోషల్‌ మీడియా యుగంలో జెబ్, నాజర్‌ ప్రసంగాలు విస్తృతంగా పరివ్యాప్తి చెందుతున్నాయి. తమ తల్లితండ్రుల కన్నా ఎక్కువ విద్యావంతులైన నవతరం తాము చిన్నచూపునకు గురి కావడం పట్ల ఆగ్రహంతో ఉంది. మితిమీరిన సైన్యం ఆగడాలను వ్యతిరేకిస్తోంది. భద్రతా దళాల ప్రమేయంతో తమ తండ్రులు, సోదరులు, భర్తలు, కుమారులు అదృశ్యమవుతున్న ఘటనలకు వ్యతిరేకంగా గతంలోనూ బలూచ్‌ మహిళలు నిరసన ప్రదర్శనలకు దిగేవారు. కానీ, తిరుగుబాటులో మహిళలు స్వయంగా పాలుపంచు కోవడం కొత్త ధోరణి.

దాడులతో భంగపడిన సైన్యం బలూచ్‌ ప్రజానీకంపై మరింతగా విరుచుకుపడుతుంది. గత చరిత్ర దానినే సూచిస్తోంది. హింస చక్రభ్రమణంలా కొనసాగుతుంది. ఈ రక్తసిక్త ఘటనలు శ్రీలంక నుంచి భారతదేశపు కశ్మీర్, ఈశాన్య ప్రాంతం, బలూచిస్తాన్‌ వరకు మొత్తం ప్రాంతానికి ఒక పాఠం నేర్పుతున్నాయి. తమ దేశంలోని ఘటనలకు పొరుగు దేశాలను నిందించడం వల్ల దేశంలో కొందరిని రంజింపజేసినట్లు అవుతుందేమో; కానీ, సమస్యకు మూల కారణాలు ఆ యా దేశాలలోనే ఉన్నందు వల్ల వాటికి పరిష్కారాలు అవే కనుగొనాలి. ఇతరులను నిందించడం వల్ల సవాళ్లు సమసిపోవు. 

నిరుపమా సుబ్రమణియన్‌
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

Advertisement
 
Advertisement
Advertisement