పాకిస్తాన్‌దే పైచేయి | Pakistan beat USA by 32 runs in T20 World Cup | Sakshi
Sakshi News home page

పాకిస్తాన్‌దే పైచేయి

Feb 11 2026 3:57 AM | Updated on Feb 11 2026 8:35 AM

Pakistan beat USA by 32 runs in T20 World Cup

అమెరికాపై 32 పరుగులతో గెలుపు

రాణించిన ఫర్హాన్, తారిఖ్‌

కొలంబో: గత టి20 ప్రపంచకప్‌లో అమెరికా చేతిలో ఎదురైన అనూహ్య పరాజయానికి ఈ ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌ ప్రతీకారం తీర్చుకుంది. టోర్నీలో శనివారం నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి పోరులో కష్టమ్మీద గట్టెక్కిన  పాక్‌... అమెరికాపై మాత్రం ఎలాంటి తడబాటు లేకుండా మ్యాచ్‌ను ముగించింది. మంగళవారం జరిగిన గ్రూప్‌ ‘ఎ’ మ్యాచ్‌లో పాక్‌ 32 పరుగుల తేడాతో అమెరికాపై విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాకిస్తాన్‌ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 190 పరుగులు చేసింది. 

‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సాహిబ్‌జాదా ఫర్హాన్‌ (41 బంతుల్లో 73; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో చెలరేగగా... బాబర్‌ ఆజమ్‌ (32 బంతుల్లో 46; 4 ఫోర్లు, 1 సిక్స్‌), షాదాబ్‌ ఖాన్‌ (12 బంతుల్లో 30; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. సయీమ్‌ అయూబ్‌ (19)తో తొలి వికెట్‌కు 54 పరుగులు (31 బంతుల్లో) జోడించిన ఫర్హాన్‌... మూడో వికెట్‌కు బాబర్‌ ఆజమ్‌తో 53 బంతుల్లో 81 పరుగులు జత చేశాడు. అమెరికా బౌలర్‌ షాల్‌విక్‌ 25 పరుగులిచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. 

అనంతరం 191 పరుగుల విజయలక్ష్యంతో బరిలోకి దిగిన అమెరికా 20 ఓవర్లలో 8 వికెట్లకు 158 పరుగులే చేయగలిగింది. శుభమ్‌ రంజనే (51; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) హాఫ్‌ సెంచరీతో పాటు జహంగీర్‌ (49; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు), మిలింద్‌ కుమార్‌ (29; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ప్రదర్శన జట్టును గెలిపించేందుకు సరిపోలేదు. ఆఫ్‌ స్పిన్నర్‌ తారిఖ్‌ 27 పరుగులిచ్చి 3 వికెట్లు పడగొట్టగా, షాదాబ్‌ ఖాన్‌కు 2 వికెట్లు దక్కాయి. 1982లో తొలి అంతర్జాతీయ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇ చ్చిన సింహళీస్‌ స్పోర్ట్స్‌ క్లబ్‌లో ఫ్లడ్‌లైట్లతో ఇదే తొలి డే అండ్‌ నైట్‌ మ్యాచ్‌ కావడం విశేషం.  

టి20 ప్రపంచకప్‌లో నేడు
దక్షిణాఫ్రికా X అఫ్గానిస్తాన్‌
వేదిక: అహ్మదాబాద్‌; ఉదయం 11 గం‘‘ నుంచి
ఆ్రస్టేలియా X ఐర్లాండ్‌
వేదిక: కొలంబో; మధ్యాహ్నం 3 గం‘‘ నుంచి
ఇంగ్లండ్‌ X వెస్టిండీస్‌ 
వేదిక: ముంబై; రాత్రి 7 గంటల నుంచిస్టార్‌ స్పోర్ట్స్, హాట్‌ స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement