భారత టెన్నిస్‌లో నిశ్శబ్ద చాంపియన్‌గా ఎదిగిన దక్షిణేశ్వర్
నెదర్లాండ్స్‌తో డేవిస్‌కప్ పోరులో అసాధారణ ప్రదర్శన
బరిలోకి దిగిన మూడు మ్యాచ్‌ల్లోనూ విజయం
తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయని చెన్నై ప్లేయర్
సాక్షి క్రీడా విభాగం : దక్షిణేశ్వర్ సురేశ్... గతేడాదే డేవిస్‌కప్‌లో అరంగేట్రం చేశాడు. తొలి ప్రయత్నంలోనే బోణీ కూడా కొట్టాడు. అయినా మనకెవరికీ తెలియదు. తాజాగా తెలిసింది. తెలియని వారు సైతం తెలుసుకుంటున్నారు. గూగుల్‌లో ఎవరీ దక్షిణేశ్వర్ అని సెర్చ్ చేస్తున్నారు. ఇంతలా నెటిజన్ల కంటపడుతున్న అతను ఏం చేశాడో చెప్పాల్సిన పనైతే లేదు. ఎందుకంటే అతనొక సంచలనం. డేవిస్ కప్ వరల్డ్ గ్రూప్ క్వాలిఫయర్స్–1లో నెదర్లాండ్స్ జట్టుతో భారత్ ఆడితే... తలపడింది... ఎదురుపడింది... ఎదుర్కొని గెలిపించింది మాత్రం దక్షిణేశ్వరే!
ఇందులో ఏ మాత్రం అతిశయోక్తే లేదు. పోటీ... నైపుణ్యం నిండిన ప్రస్తుత కాలంలో దక్షిణేశ్వర్ ముమ్మాటికి ఓ నిశ్శబ్ద చాంపియన్. జూనియర్ సర్క్యూట్, ఏటీపీ చాలెంజర్... ఐటీఎఫ్ ... ఇలా ఎన్నో పేర్లతో టోర్నీలు నిత్యం జరుగుతూనే ఉంటాయి. అన్నింటా ఆడుతూనే ఉన్నా... ఏ టోర్నీలోనూ కంటబడని తమిళనాడు యువతార ఏకంగా చాంపియన్‌గా బయటపడటమే పెద్ద విశేషం. ఒకప్పుడు ఆట కోసం కిట్ బ్యాగులు మోసిన భుజాలే ఇప్పుడు డేవిస్ కప్‌లో భారత బాధ్యతల్ని మోస్తున్నాయి.
ఎంతో క్రమశిక్షణతో కూడిన అతని శిక్షణ, పోటీలు, విజయాలు ఇవన్నీ కూడా గమనించిన వారికి ముచ్చటేయకుండా ఉండదు. పొద్దెక్కముందే ట్రెయినింగ్... మధ్యలో పోటీలు... పిడికిలి బిగిస్తే విజయాలు అన్నీ కూడా ఓ క్రమపద్దతిలో కష్టపడితేనే వచ్చాయి. ఓపికగా, ఒద్దికగా అన్నింటిని భరించిన దక్షిణేశ్వర్ ఈ క్రమంలో క్రీడా జర్నలిస్టుల ప్రాధాన్యంలోనూ లేడు. కానీ ఒక్కసారిగా సంచలన విజయాలతోనే అందరి కళ్లముందుకు వచ్చాడు. ఏటీపీ సింగిల్స్ ర్యాంకింగ్స్ ప్రకారమైతే డేవిస్‌కప్‌లో భారత జట్టు తరఫున నంబర్‌వన్ సుమిత్ నగాల్ తర్వాత ఆర్యన్ షా, కరణ్ సింగ్‌లలో ఒకరికి అవకాశం ఇవ్వాలి.
అయితే భారత నాలుగో ర్యాంకర్‌గా ఉన్న దక్షిణేశ్వర్ ఆటతీరుపై నమ్మకంతో భారత జట్టు నాన్‌ప్లేయింగ్ కెప్టెన్ రోహిత్ రాజ్‌పాల్ ఈ తమిళనాడు పొడగరికి ఏకంగా మూడు మ్యాచ్‌లు (సింగిల్స్, డబుల్స్, రివర్స్ సింగిల్స్) ఆడే అవకాశం ఇచ్చాడు. రోహిత్ రాజ్‌పాల్‌తోపాటు భారత టీమ్ మేనేజ్‌మెంట్ తనపై పెట్టుకున్న నమ్మకాన్ని వమ్ముచేయకుండా అంచనాలకు మించి రాణించిన దక్షిణేశ్వర్‌కు భారత్‌కు చిరస్మరణీయ విజయాన్ని కట్టబెట్టాడు.
తొలినాళ్ల ప్రయాణమిది
తమిళనాడులోని దిండిగుల్ పట్టణానికి చెందిన దక్షిణేశ్వర్ తండ్రి సురేశ్ ఎక్కా కూడా టెన్నిస్ ప్లేయరే! రాష్ట్రానికి, దేశానికి ఆడలేదు కానీ క్లబ్ లెవెల్ ఆటగాడు సురేశ్. బహుశా ఈ మూలాలే దక్షిణేశ్వర్‌ను అంతర్జాతీయ స్థాయికి తీసుకొచ్చాయేమో! చెన్నైలోని కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి శిక్షణలో ఓనమాలు, తర్వాత మెలకువలు నేర్చుకొని రాటుదేలాడు. 2010 నుంచి 2016 వరకు తన ఉండే ఊరి నుంచి 16 కిలోమీటర్లు కిట్ బ్యాగులు మోసుకొని చెన్నై వెళ్లి చక్రవర్తి ఇచ్చే రోజువారీ శిక్షణ ముగించుకొని తిరిగి బస్సులో ఇంటికి చేరేవాడు.
నిండా పదేళ్లు (9) లేకపోయినా సురపేట్ నుంచి మొగప్పాయిర్, అక్కడి నుంచి అన్నా నగర్, అటుపై లయోలా కాలేజ్ అతని టెన్నిస్ శిక్షణ సాగేదని కోచ్ చక్రవర్తి వివరించారు. ‘అదేంటో ఏమో దక్షిణేశ్వర్ బాల్యం నుంచే ఎవరితోనైనా సరే ఆడేందుకు ఇష్టపడేవాడు. కష్టపడేందుకు, నేర్చుకునే క్రమంలో ఆడిగేందుకు సిగ్గుపడడు. కానీ తన పనిమాత్రం నింపాదిగా, నిశ్శబ్దంగానే చేసుకునేవాడు.
అతనిది చాలా భిన్నమైన వ్యక్తిత్వం. పెప్సీ, కోక్‌లాంటి కూల్‌డ్రింక్స్ తాగేవాడే కాదు. కఠినమైన క్రమశిక్షణతోనే మెలిగేవాడు. అవకాశాలేమో పరిమితంగా వస్తే, ఆర్థిక సమస్యలు అపరిమితంగా చుట్టిముట్టినా కూడా క్రమశిక్షణతోనే అధిగమించాడు. 2016లో ఫ్రాన్స్‌లో శిక్షణకు వెళ్లాడు. ఆ తర్వాతే అండర్–16 జాతీయ టోర్నీలో విజేతగా నిలిచాడు’ అని 65 ఏళ్ల కోచ్ లక్ష్మణ్ చక్రవర్తి తన శిష్యుడి ప్రయాణం చెబుతూ మురిసిపోయారు.
ప్రస్తుతం అమెరికాలో...
దక్షిణేశ్వర్ ఆటలో క్రమంగా రాటుదేలుతున్నా... చదువెందుకని ఏనాడు అనుకోలేదు. ఆటలో కష్టపడ్డట్లే ఉన్నత విద్య కోసం కూడా అంతే క్రమశిక్షణతో కష్టపడుతున్నాడు. ప్రస్తుతం అమెరికాలోని ‘వేక్ ఫారెస్ట్ యూనివర్సిటీ’లో కమ్యూనికేషన్స్ విద్యను అభ్యసిస్తున్న అతని చదువు ఈ ఏడాది మే నెలలో పూర్తవనుంది.
ఆ తర్వాత పూర్తిగా టెన్నిస్‌పైనే దృష్టి సారించనున్నాడు. దీంతో మరిన్ని విజయాలతో 470వ ర్యాంకులో ఉన్న ఈ తమిళనాడు ప్లేయర్ నిలకడైన విజయాలు సాధిస్తే మరో ఏడాది తిరిగేసరికి టాప్–100 ర్యాంకింగ్స్‌లోకి వచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.

ఏడాది గడిచే సరికి...
గతేడాది డేవిస్ కప్‌లో భారత్... స్విట్జర్లాండ్‌తో ఆడింది. 3–1తో జయకేతనం ఎగురవేసింది. ఈ మ్యాచ్ ఆడిన భారత డేవిస్ బృందంలో దక్షిణేశ్వర్ ఉన్నాడు. బరిలోకి దిగి సింగిల్స్‌లో గెలిచాడు. అలా భారత్ విజయంలో దక్షిణేశ్వర్ పాత్ర ఉంది. ఏడాది తిరిగేసరికి 22 ఏళ్ల క్రితం లియాండర్ పేస్ రికార్డునే సమం చేసిన ఘనత దక్షిణేశ్వర్‌ది! 2004లో జపాన్‌పై పేస్ 3 మ్యాచ్‌లాడి పేస్ గెలిపించాడు. మళ్లీ రెండు దశాబ్దాల తర్వాత దక్షిణేశ్వర్ నెదర్లాండ్స్‌తో తొలి సింగిల్స్ ఆడి గెలిచాడు.
రెండో రోజు డబుల్స్, రివర్స్ సింగిల్స్ వరుసగా ఆడి కూడా గెలిపించాడు. పేస్ తర్వాత... దక్షిణేశ్వర్ కంటే ముందు... సోమ్‌దేవ్, విష్ణువర్ధన్, సాకేత్ మైనేని, సుమిత్ నగాల్, యూకీ బాంబ్రీ, గుణేశ్వరన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెడుంజెళియన్ ఇలా ఎంతోమంది వచ్చారు. మెరుగైన ర్యాంకింగ్స్‌లో నిలిచారు. డేవిస్ కప్ ఆడారు. కానీ దక్షిణేశ్వర్ ర్యాంకింగ్స్‌లో వెనుకబడినా... భారత్‌ను ముందుండి గెలిపించే ప్రదర్శనైతే చేయలేదు.


