శుభారంభం లక్ష్యంగా... | Indian side matches in Pro League from today | Sakshi
Sakshi News home page

శుభారంభం లక్ష్యంగా...

Feb 11 2026 3:43 AM | Updated on Feb 11 2026 3:43 AM

Indian side matches in Pro League from today

నేడు బెల్జియంతో టీమిండియా ‘ఢీ’

ప్రొ లీగ్‌ భారత్‌ అంచె మ్యాచ్‌లు

రాత్రి గం. 7:30 నుంచి  జియో హాట్‌స్టార్‌లో ప్రత్యక్ష ప్రసారం

రూర్కెలా: గత ప్రొ లీగ్‌ సీజన్‌లో ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకున్న భారత పురుషుల హాకీ జట్టు ఈసారి మెరుగైన ప్రదర్శన కనబర్చాలని పట్టుదలతో ఉంది. అంతర్జాతీయ హాకీ సమాఖ్య (ఎఫ్‌ఐహెచ్‌) ప్రొ లీగ్‌లో భాగంగా నేటి నుంచి భారత అంచె మ్యాచ్‌లు జరుగుతాయి. ప్రపంచ ర్యాంకింగ్స్‌లో ఎనిమిదో స్థానంలో ఉన్న భారత జట్టుతో రెండు మ్యాచ్‌ల చొప్పున ఆడేందుకు ప్రపంచ రెండో ర్యాంకర్‌ బెల్జియం, నాలుగో ర్యాంకర్‌ అర్జెంటీనా జట్లు సిద్ధమయ్యాయి.

బుధవారం జరిగే తొలి మ్యాచ్‌లో బెల్జియంతో ఆడనున్న టీమిండియా... గురువారం ఒలింపిక్‌ మాజీ చాంపియన్‌ అర్జెంటీనాతో తలపడుతుంది. శుక్రవారం విశ్రాంతి దినం తర్వాత శనివారం బెల్జియం జట్టుతో, ఆదివారం అర్జెంటీనాతో భారత్‌ మళ్లీ ఆడుతుంది. మొత్తం తొమ్మిది జట్లు పోటీపడుతున్న ప్రొ లీగ్‌ తాజా సీజన్‌లో భారత్‌ మాత్రమే చివరి జట్టుగా తమ తొలి మ్యాచ్‌ ఆడనుంది. నెదర్లాండ్స్, ఇంగ్లండ్‌ ఎనిమిదేసి మ్యాచ్‌లు... అర్జెంటీనా, బెల్జియం, జర్మనీ నాలుగేసి మ్యాచ్‌లు... పాకిస్తాన్‌ ఐదు మ్యాచ్‌లు పూర్తి చేసుకున్నాయి. 

గత సీజన్‌లో మాదిరిగా ఈసారి కూడా హర్మన్‌ప్రీత్‌ సింగ్‌ నాయకత్వంలోనే భారత్‌ బరిలోకి దిగనుంది. సీనియర్‌ స్టార్‌ మిడ్‌ఫీల్డర్‌ మన్‌ప్రీత్‌ సింగ్‌పై వేటు వేయడంతో అతని లేని లోటు తెలియకుండా తమ సత్తా చాటుకోవాలని అమన్‌దీప్‌ లాక్రా, మన్‌మీత్‌ సింగ్, రోషన్‌ కుజుర్‌ సిద్ధంగా ఉన్నారు. ముఖాముఖి పోరులో భారత్‌పై బెల్జియందే పైచేయిగా ఉంది. గత 13 ఏళ్లలో రెండు జట్లు 35 సార్లు తలపడ్డాయి. 22 మ్యాచ్‌ల్లో బెల్జియం గెలుపొందగా... 11 మ్యాచ్‌ల్లో భారత్‌ నెగ్గింది. మరో రెండు మ్యాచ్‌లు ‘డ్రా’గా ముగిశాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement