న్యూజిలాండ్‌ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర | T20 WC 2026: New zealand beat UAE by 10 wickets | Sakshi
Sakshi News home page

న్యూజిలాండ్‌ ఓపెనర్ల ఊచకోత.. సరికొత్త చరిత్ర

Feb 10 2026 6:42 PM | Updated on Feb 10 2026 6:54 PM

T20 WC 2026: New zealand beat UAE by 10 wickets

టీ20 వరల్డ్‌కప్‌ 2026లో న్యూజిలాండ్‌ జట్టు వరుస విజయాలతో దూసుకుపోతుంది. తొలి మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై 5 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించిన ఈ జట్టు.. తాజాగా (ఫిబ్రవరి 10) యూఏఈపై 10 వికెట్ల తేడాతో భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో యూఏఈ నిర్దేశించిన 174 పరుగుల లక్ష్యాన్ని ఓపెనర్లే ఊదేశారు. 

ఫిన్‌ అలెన్‌ (50 బంతుల్లో 84 నాటౌట్‌; 5 ఫోర్లు, 5 సిక్సర్లు), టిమ్‌ సీఫర్ట్‌ (42 బంతుల్లో 89 నాటౌట్‌; 12 ఫోర్లు, 3 సిక్సర్లు) ఊచకోత ధాటికి న్యూజిలాండ్‌ కేవలం​ 15.2 ఓవర్లలో ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ప్రపంచకప్‌ చరిత్రలో ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యంగా నిలిచింది. 

సీఫర్ట్‌-అలెన్‌ దెబ్బకు యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. వీరిద్దరు పడ్డ బంతిని పడ్డట్టు ఎడాపెడా బాదారు. అలెన్‌ కాస్త నిదానంగా ఆడినా, సీఫర్ట్‌ మాత్రం బౌండరీలు, సిక్సర్లతో చెలరేగిపోయాడు. విన్నింగ్‌ రన్స్‌ను కూడా సీఫర్ట్‌ సిక్సర్‌తోనే సాధించాడు. 

అలెన్‌ తన హాఫ్‌ సెంచరీని 27 బంతుల్లో పూర్తి చేస్తే, సీఫర్ట్‌ కేవలం 23 బంతుల్లోనే పని కానిచ్చేశాడు. ఫలితంగా ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. ఆఫ్ఘనిస్తాన్‌తో జరిగిన గత మ్యాచ్‌లోనూ సీఫర్ట్‌ ఇదే తరహా విధ్వంసం (42 బంతుల్లో 65; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) సృష్టించి ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌ అవార్డు అందుకున్నాడు. 

సీఫర్ట్‌ ధాటికి ఆ మ్యాచ్‌లో ఆఫ్ఘనిస్తాన్‌ నిర్దేశించిన 183 పరుగుల లక్ష్యాన్ని కివీస్‌ 17.5 ఓవర్లలోనే ఛేదించింది. సీఫర్ట్‌ విధ్వంసకర ఫామ్‌ చూస్తుంటే, ఈ ప్రపంచకప్‌లో న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమేమో అనిపిస్తుంది. అతనికి ఫిన్‌ అలెన్‌, గ్లెన్‌ ఫిలిప్స్‌, రచిన్‌ రవీంద్ర, డారిల్‌ మిచెల్‌, మార్క్‌ చాప్‌మన్‌ లాంటి బ్యాటర్లు తోడైతే, బ్యాటింగ్‌కు స్వర్గధామమమైన ఉపఖండపు పిచ్‌లపై న్యూజిలాండ్‌ను ఆపడం కష్టమే. 

బ్యాటింగ్‌ విషయాన్ని పక్కన పెడితే, ప్రస్తుత న్యూజిలాండ్‌ జట్టు బౌలింగ్‌లో మరింత ప్రమాదకరంగా ఉంది. ఆ జట్టులో డఫీ, హెన్రీ, ఫెర్గూసన్‌, నీషమ్‌ లాంటి ప్రమాదకర ఫాస్ట్‌ బౌలర్లు ఉన్నారు. అలాగే స్పిన్‌ విభాగంలో మిచెల్‌ సాంట్నర్‌ లాంటి టాప్‌ స్పిన్నర్‌ ఉన్నాడు. ఈ గెలుపుతో గ్రూప్‌-డి నుంచి న్యూజిలాండ్‌ సూపర్‌-8 బెర్త్‌ దాదాపుగా ఖరారైనట్లే.

అసాధారణ ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో యూఏఈ టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ ఎంచుకుంది. ఈ జట్టు బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్‌ బౌలింగ్‌ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్‌ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్‌ స్కోర్‌.

కెప్టెన్‌ ముహమ్మద్‌ వసీం (66 నాటౌట్‌), అలీషాన్‌ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్‌ అందించారు. ఆఖర్లో మయాంక్‌ కుమార్‌ (21) మెరుపు ఇన్నింగ్స్‌ ఆడాడు. న్యూజిలాండ్‌ బౌలర్లలో మ్యాట్‌ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్‌, సాంట్నర్‌, ఫిలిప్స్‌ తలో వికెట్‌ తీశారు.

బెంబేలెత్తిపోయిన యూఏఈ బౌలర్లు
174 పరుగుల లక్ష్య ఛేదనను న్యూజిలాండ్‌ ఓపెనర్లు ఆచితూచి ప్రారంభించారు. అయితే వీరిద్దరు క్రమంగా గేర్‌ మార్చి వీలు చిక్కనప్పుడల్లా యూఏఈ బౌలర్లును ఉతికి ఆరేశారు. వీరి ధాటికి రోహిద్‌ ఖాన్‌ 3.2 ఓవర్లలో 51 పరుగులు, జునైద్‌ సిద్దిఖీ 4 ఓవర్లలో 47 పరుగులు, అర్ఫాన్‌ 3 ఓవర్లలో 36 పరుగులు సమర్పించుకున్నారు. యూఏఈ బౌలర్లలో హైదర్‌ అలీ (4-0-27-0) ఒక్కడు కాస్త పొదుపుగా బౌలింగ్‌ చేశాడు. మొత్తంగా టిమ్‌ సీఫర్ట్‌, ఫిన్‌ అలెన్‌ ధాటికి యూఏఈ బౌలర్లు బెంబేలెత్తిపోయారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement