న్యూజిలాండ స్టార్ ఆల్‌రౌండర్ గ్లెన్ ఫిలిప్స్‌కు ఘోర పరాభవం ఎదురైంది. టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఓవర్‌లో అత్యధిక పరుగులిచ్చిన (27 పరుగులు) ఫుల్ మెంబర్ జట్టు బౌలర్‌గా అప్రతిష్టను మూటగట్టుకున్నాడు.
2026 ఎడిషన్‌లో భాగంగా యూఏఈతో ఇవాళ (ఫిబ్రవరి 10) జరుగుతున్న మ్యాచ్‌లో ఫిలిప్స్ ఈ అవాంఛిత రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. యూఏఈ ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో ఇది జరిగింది. ఆ ఓవర్‌లో ఫిలిప్స్ వరుసగా 1, 4, 6, 1wd, 4nb, 6, 1, 2 పరుగులు సమర్పించుకున్నాడు. ఆ ఓవర్లో యూఏఈ కెప్టెన్ ముహమ్మద్ వసీం, మయాంక్ కుమార్ ఫిలిప్స్‌ను చెడుగుడు ఆడుకున్నారు.
టీ20 ప్రపంచకప్ చరిత్రలో ఓ అసోసియేట్ దేశంపై ఓ ఫుల్ మెంబర్ జట్టు బౌలర్ ఓ ఓవర్‌లో సమర్పించుకున్న అత్యధిక పరుగులు
27 పరుగులు – గ్లెన్ ఫిలిప్స్ (NZ) vs UAE, చెన్నై, 2026
22 పరుగులు – కైల్ అబ్బాట్ (SA) vs ఆఫ్ఘనిస్తాన్, 2016
22 పరుగులు – తబ్రైజ్ షంసీ (SA) vs USA, 2024
22 పరుగులు – జోఫ్రా ఆర్చర్ (ENG) vs నేపాల్, 2026
ఇదిలా ఉంటే, యూఏఈతో మ్యాచ్‌లో ఫిలిప్ ఒక్క ఓవర్‌లో తడబడినా, ఫీల్డ్‌లో మ్యాజిక్ చేశాడు. మూడు కీలక క్యాచ్‌లు పట్టడంతో పాటు, పలు అద్భుత ఫీల్డింగ్ విన్యాసాలు చేసి యూఏఈని 200 పరుగుల మార్కును తాకకుండా కట్టడి చేశాడు. తాను బౌలింగ్ చేసిన 2 ఓవర్లలో ఓ ఓవర్‌లో 27 పరుగులిచ్చినా, మరో ఓవర్‌లో కేవలం 3 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ కూడా తీశాడు.
అసాధారణ ప్రదర్శన
ఈ మ్యాచ్‌లో యూఏఈ బ్యాటర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. పటిష్టమైన న్యూజిలాండ్ బౌలింగ్ లైనప్‌ను ఎదుర్కొని నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేశారు. టీ20 వరల్డ్‌కప్ చరిత్రలో యూఏఈకి ఇదే అత్యధిక టీమ్ స్కోర్.
కెప్టెన్ ముహమ్మద్ వసీం (66 నాటౌట్), అలీషాన్ షరాఫు (55) కలిసి యూఏఈకి ఈ రికార్డు స్కోర్ అందించారు. ఆఖర్లో మయాంక్ కుమార్ (21) మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 2 వికెట్లు తీయగా.. డఫీ, ఫెర్గూసన్, సాంట్నర్, ఫిలిప్స్ తలో వికెట్ తీశారు.


