సొంతగడ్డపై టీ20 ప్రపంచకప్-2026 ఆరంభ మ్యాచ్‌లో టీమిండియా స్థాయికి తగ్గట్లు ఆడలేకపోయింది. పసికూన అమెరికా పటిష్ట భారత జట్టుకు కఠిన సవాలు విసిరింది. ఇలాంటి క్లిష్ట పరిస్థితిలో కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ బ్యాట్ ఝులిపించడం.. బౌలర్లు రాణించడంతో టీమిండియా ఊపిరి పీల్చుకుంది.
సూర్యకుమార్ ధనాధన్
ముంబైలోని ప్రఖ్యాత వాంఖడే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ ఓడిన భారత్ తొలుత బ్యాటింగ్ చేసింది. ఓపెనర్లలో ఇషాన్ కిషన్ (20) ఫర్వాలేదనిపించగా.. అభిషేక్ శర్మ అనూహ్య రీతిలో గోల్డెన్ డక్‌గా వెనుదిరిగాడు. మిగిలిన వారిలో తిలక్ వర్మ (25) ఫర్వాలేదనిపించగా.. సూర్యకుమార్ యాదవ్ మెరుపు ఇన్నింగ్స్ (49 బంతుల్లో 84 నాటౌట్)తో జట్టును ఆదుకున్నాడు.
ఫలితంగా నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 161 పరుగులు చేసింది టీమిండియా. లక్ష్య ఛేదనలో భారత బౌలర్లు ముఖ్యంగా మొహమ్మద్ సిరాజ్ ఆదిలోనే వికెట్లు తీసి అమెరికాను కష్టాలోకి నెట్టాడు. ఓపెనర్లు ఆండ్రీస్ గౌస్ (6), సాయితేజ ముక్కామల్ల (2)ల వికెట్లను సిరాజ్ పడగొట్టగా.. కెప్టెన్ మోనాంక్ పటేల్ (0)ను అర్ష్‌దీప్ సింగ్ డకౌట్‌గా వెనక్కి పంపాడు.
రాణించిన సిరాజ్
మొత్తంగా సిరాజ్ మూడు, అర్ష్‌దీప్ సింగ్, అక్షర్ పటేల్ రెండేసి వికెట్లు తీయగా.. వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ పడగొట్టాడు. తద్వారా 20 ఓవర్లలో అమెరికాను 132-8 పరుగులకే పరిమితం చేసి టీమిండియా 29 పరుగుల తేడాతో గెలిచింది. ఇక రెండో మ్యాచ్‌లో గురువారం ఢిల్లీ వేదికగా నమీబియాతో టీమిండియా తలపడనుంది.
వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి
ఈ మ్యాచ్‌కు ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ అందుబాటులోకి వచ్చాడు. అయితే, అతడికి తుదిజట్టులో చోటు దక్కడం కష్టమేనని టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ అన్నాడు. అదే విధంగా ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా రాకతో సిరాజ్‌కు ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు ఉండదని అభిప్రాయపడ్డాడు.
సిరాజ్‌పై వేటు తప్పదు
కాగా హర్షిత్ రాణా గాయపడటంతో అనూహ్య రీతిలో సిరాజ్ వరల్డ్‌కప్ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇక అమెరికాతో మ్యాచ్‌కు ముందు బుమ్రా జ్వరంతో బాధపడిన కారణంగా ఏకంగా తుదిజట్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ రాగా.. మూడు వికెట్లు తీసి సత్తా చాటాడు. అయితే, బుమ్రా తిరిగి వస్తే మాత్రం సిరాజ్‌పై వేటు తప్పదని బంగర్ అన్నాడు.
నమీబియాతో మ్యాచ్ నేపథ్యంలో భారత తుదిజట్టు కూర్పు గురించి మాట్లాడుతూ.. ‘‘వాషింగ్టన్ సుందర్ పూర్తిగా కోలుకుని జట్టుతో చేరడం శుభసూచకం. అతడి నైపుణ్యాలపై టీమిండియా యాజమాన్యానికి గట్టి నమ్మకం ఉంది. టోర్నీ ఆరంభం నుంచి అందుబాటులో లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించడం ఇందుకు నిదర్శనం.
స్పిన్ బౌలింగ్ ఆల్‌రౌండర్‌గా వాషీకి ఆ ప్రాధాన్యం ఉంటుంది. అయితే, ఢిల్లీలో జరిగే మ్యాచ్‌లో వాషీ తుదిజట్టులోకి రాలేడు. ఇక బుమ్రా తిరిగి వస్తాడు కాబట్టి ఫామ్‌లో ఉన్న సిరాజ్‌ను పక్కనపెట్టక తప్పదు’’ అని సంజయ్ బంగర్ అభిప్రాయప్డాడు.
ఇదిలా ఉంటే.. ఓపెనర్‌గా సంజూ శాంసన్‌ను తప్పించిన యాజమాన్యం.. అతడి స్థానంలో ఇషాన్‌ను తీసుకువచ్చింది. మున్ముందు మ్యాచ్‌లలోనూ అతడినే ఓపెనర్‌గా కొనసాగించే అవకాశం ఉంది.
నమీబియాతో మ్యాచ్‌కు భారత తుదిజట్టు అంచనా
ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా, రింకూ సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, అర్ష్‌దీప్ సింగ్, జస్‌ప్రీత్ బుమ్రా/మొహమ్మద్ సిరాజ్.
చదవండి: భారత్‌తో మ్యాచ్‌కు అంగీకరించిన పాక్.. బీసీసీఐ రియాక్షన్ ఇదే


