సంగీతానికి భాషా సరిహద్దులు లేవని ప్రపంచానికి ‘పాప్ మ్యూజిక్’ చాటిచెబుతోంది. వెస్ట్రన్ మ్యూజిక్ హవా నడుస్తున్న తరుణంలో, దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు కుర్రాళ్లు ‘బీటీఎస్’ (బాంగ్తాన్ సోన్యోందన్) పేరుతో ప్రపంచ సంగీత పటాన్ని ఒక్కసారిగా మార్చేశారు. కేవలం తమ పాటలతోనే కాకుండా, తమ అద్భుతమైన డాన్స్ కొరియోగ్రఫీ, సామాజిక సందేశాలతో అందరినీ ఆకట్టుకుంటున్నారు. బీటీఎస్ ఆర్మీ పేరుతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకుని తిరుగులేని గ్లోబల్ ఫోర్స్‌గా ఎదిగారు. గ్రామీ నామినేషన్లు మొదలు ఐక్యరాజ్యసమితి వేదికల వరకు ‘కే పాప్’ స్థాయిని అమాంతం పెంచారు.
7 కోట్ల 80 లక్షల ఫాలోవర్స్
కొరియన్ పాప్ బ్యాండ్ బీటీఎస్ ప్రభంజనం అప్రతిహతంగా కొనసాగుతోంది. తాజాగా ఈ బృందం ఒకేసారి రెండు చారిత్రాత్మక విజయాలను నమోదు చేసి ప్రపంచాన్ని తెగ ఆశ్చర్యపరిచింది. హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ 2025లో ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ అవార్డును సొంతం చేసుకోవడమే కాకుండా, సోషల్ మీడియా దిగ్గజం ఇన్‌స్టాగ్రామ్‌లో 78 మిలియన్ల(7 కోట్ల 80 లక్షలు) ఫాలోవర్లను సాధించిన తొలి మ్యూజిక్ గ్రూపుగా అరుదైన మైలురాయిని చేరుకుంది.
హంటెయో అవార్డుతో గుర్తింపు
సంగీత రంగంలో అత్యంత ఉన్నత అవార్డులలో హంటెయో మ్యూజిక్ అవార్డ్స్ ఒకటి. 2025 సంవత్సరానికి గాను బీటీఎస్ ‘గ్లోబల్ పాపులర్ ఆర్టిస్ట్’ కేటగిరీలో నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఆల్బమ్ విక్రయాలు, డిజిటల్ స్ట్రీమింగ్ గణాంకాలు, అభిమానుల భాగస్వామ్యం ఆధారంగా బీటీఎస్‌ను విజేతగా ప్రకటించారు. ఈ అవార్డు వారు సృష్టించిన రికార్డులకు ఒక ఉదాహరణగా విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇన్‌స్టాగ్రామ్‌లో తిరుగులేని ఆధిపత్యం
అవార్డుల ప్రకటన వెలువడిన కాసేపటికే ఇన్‌స్టాగ్రామ్ వేదికగా మరో భారీ రికార్డు బద్దలైంది. బీటీఎస్ అధికారిక ఖాతా 78 మిలియన్ల ఫాలోవర్ల మార్కును దాటింది. ప్రపంచవ్యాప్తంగా ఏ మ్యూజికల్ బ్యాండ్ కూడా ఇప్పటివరకు ఈ స్థాయి ఫాలోయింగ్‌ను దక్కించుకోలేదు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి.. ఏకైక గ్రూపుగా బీటీఎస్ సరికొత్త రికార్డును లిఖించింది. ఇది బీటీఎస్ గ్లోబల్ క్రేజ్‌కు అద్దం పడుతోంది.
మిలిటరీ సర్వీస్ తర్వాత..
బీటీఎస్ సభ్యులైన జిన్, సుగా, జె-హోప్, ఆర్ఎమ్, జిమిన్, వీ, జంగ్‌కుక్ తమ తప్పనిసరి మిలిటరీ సేవలను పూర్తి చేసుకుని మళ్లీ ఒకే వేదికపైకి రానుండటం అభిమానులను ఆనందంలో మంచెత్తుతోంది. బీటీఎస్ సభ్యులంతా కలిసి పూర్తి స్థాయి బృందంగా తిరిగి రావడం అనేది బీటీఎస్‌లో భారీ మార్పులకు సంకేతం కానుంది. ఈ పునరాగమనం కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న సంగీత ప్రియులు వేల కళ్లతో ఎదురుచూస్తున్నారు.
మార్చి 20న ‘అరిరంగ్’ ఆల్బమ్ విడుదల
దాదాపు మూడేళ్ల నిరీక్షణ తర్వాత బీటీఎస్ తమ ఐదవ స్టూడియో ఆల్బమ్ ‘అరిరంగ్’ను 2026, మార్చి 20న విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ కొత్త ఆల్బమ్‌లో మొత్తం 14 ట్రాక్‌లు ఉండనున్నాయని సమాచారం. ఇప్పటికే ఈ ఆల్బమ్‌పై సామాజిక మాధ్యమాల్లో భారీ చర్చ నడుస్తోంది. ఈ ఆల్బమ్ ద్వారా సంగీత చార్టుల్లో పాత రికార్డులన్నీ కనుమరుగవుతాయని అభిమానులు అంటున్నారు.
ప్రపంచవ్యాప్త పర్యటనకు..
ఈ ఆల్బమ్ విడుదలైన వెంటనే ఏప్రిల్ 9 నుండి బీటీఎస్ తమ ‘వరల్డ్ టూర్ 2026-2027’ను ప్రారంభించనుంది. ఈ పర్యటనలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 34 ప్రధాన నగరాల్లో మొత్తం 81 లైవ్ షోలను నిర్వహించనున్నారు. సభ్యుల లైవ్ పెర్ఫార్మెన్స్‌ను చూసేందుకు టికెట్ల కోసం ఇప్పటికే భారీ డిమాండ్ ఏర్పడింది. ఈ బృందం భారత్‌లోని ముంబైలో పర్యటించనున్నదనే వార్త కూడా వినిపిస్తోంది
గ్లోబల్ ఐకాన్స్‌గా బీటీఎస్
సంగీతం, ఫ్యాషన్, సామాజిక అంశాలపై బీటీఎస్ చూపిస్తున్న ప్రభావం అంతకంతకూ పెరిగిపోతోంది. కేవలం ఒక పాప్ బ్యాండ్‌గా మాత్రమే కాకుండా, ఒక గ్లోబల్ బ్రాండ్‌గా వారు ఎదిగిన తీరు అమోఘమని సంగీతాభిమానులు అంటున్నారు. రాబోయే ‘అరిరంగ్’ ఆల్బమ్, వరల్డ్ టూర్‌తో 2026 ఏడాదంతా బీటీఎస్ స్మరణతో నిండిపోనున్నదని విశ్లేషకులు చెబుతున్నారు.
ఇది కూడా చదవండి: ‘అమెరికాతో యుద్ధం వచ్చినా..’..ఇరాన్ కీలక ప్రకటన


