జగిత్యాల : తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో రాజకీయ కరపత్రాల కలకలం చోటుచేసుకుంది. సామాన్య ఓటరు పేరుతో జగిత్యాల రాజకీయాలపై విడుదలైన ఈ కరపత్రం చర్చనీయాంశంగా నిలిచింది. గతంలో బీఆర్ఎస్‌లో ఉన్నవారికే ఇప్పుడు కాంగ్రెస్ బీ-ఫారాలు అంటూ ఆ కరపత్రంలో ఆరోపణలు గుప్పించారు. కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న 35 మంది అభ్యర్థుల గత రాజకీయ చరిత్ర అందరికీ తెలుసంటూ దానిలో వ్యాఖ్యానించారు.
2019లో బీఆర్ఎస్ తరఫున గెలిచిన వారి అవినీతితో 16 మంది మున్సిపల్ కమిషనర్ల బదిలీ అయ్యారంటూ దానిలో ఆరోపించారు. జగిత్యాలలో ఊసరవెల్లిలా రంగులు మార్చి, మాది నిజాయితీ గల కాంగ్రెస్ అని చెప్పడం సిగ్గుచేటు అని కరపత్రంలో విమర్శించారు. రంగులు మార్చే నాయకులకు ఓటు వేయవద్దంటూ ప్రజలకు ఆ కరపత్రంలో పిలుపునిచ్చారు.


