కారులోనే పద్మ మృతదేహం.. భర్త కోసం గాలింపు | Car Falls Into Nagarjuna Sagar Left Over Canal In Nalgonda | Sakshi
Sakshi News home page

కారులోనే పద్మ మృతదేహం.. భర్త కోసం గాలింపు

Feb 9 2026 8:48 AM | Updated on Feb 9 2026 8:48 AM

Car Falls Into Nagarjuna Sagar Left Over Canal In Nalgonda

నల్గొండ జిల్లా: ఎస్డీఆర్‌ఎఫ్, అగ్నిమాపక, పోలీస్‌ సిబ్బంది సుమారు 15 గంటలపాటు శ్రమించి నిడమనూరు మండలం ముకుందాపురం వద్ద శనివారం రాత్రి సాగర్‌ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లిన కారును తాళ్ల సహాయంతో ఆదివారం ఉదయం బయటకు వెలికితీశారు. కారులో తల్లం పద్మ(60) మృతదేహాన్ని గుర్తించగా.. ఆమె భర్త పుల్లయ్య ఆచూకీ లభించలేదు. పద్మ మృతదేహాన్ని మిర్యాలగూడ ఏరియా ఆస్పత్రికి తరలించారు. ఎన్డీఆర్‌ఎఫ్‌(జాతీయ విపత్తు దళం) సిబ్బంది, నిడమనూరు పోలీసులు పుల్లయ్య ఆచూకీ కోసం ముకుందాపురం బ్రిడ్జి నుంచి పెద్దదేవులపల్లి రిజర్వాయర్‌ వరకు సాగర్‌ ఎడమ కాల్వలో, తూముల వెంట వెతుకుతున్నారు. 

ప్రమాదం జరిగింది ఇలా..
త్రిపురారం మండలం కంపాసాగర్‌ గ్రామానికి చెందిన తల్లం పుల్లయ్య, అతడి భార్య పద్మ శనివారం రాత్రి మిర్యాలగూడలోని తమ చిన్న కుమారుడు తల్లం శివ నివాసం నుంచి కారులో డ్రైవర్‌ను తీసుకుని స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో నిడమనూరు మండలం ముకుందాపురం వద్దకు రాగానే డ్రైవర్‌ రసూల్‌ కాలుకు ఉన్న చెప్పు సరిచేసుకుంటుండగా.. కారు యాక్సిలేటర్‌కు చెప్పు తగలి వేగం పెరిగి కారు సాగర్‌ ఎడమ కాల్వలోకి దూసుకెళ్లింది. ఘటన జరిగిన వెంటనే స్థానికుల సహాయంతో కారు డ్రైవర్‌ కాల్వలో నుంచి సురక్షితంగా బయటపడ్డాడు. 

సమాచారం తెలుసుకున్న హాలియా సీఐ సతీష్‌రెడ్డి, నిడమనూరు ఎస్‌ఐ ఉప్పు సురేష్‌ వెంటనే ఘటన స్థలానికి చేరుకుని ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో పుల్లయ్య దంపతులను రక్షించేందుకు నాలుగు గంటలకు పైగా శ్రమించారు. కారును గుర్తించినప్పటికీ బయటకు తీయడానికి సాధ్యం కాలేదు. ఆదివారం ఉదయం కలెక్టర్, నిడమనూరు తహసీల్దార్‌ జంగాల కృష్ణయ్య, ఇతర ఉన్నతాధికారులు ఎన్‌ఎస్‌పీ అధికారులకు పరిస్థితిని వివరించి నీటి ప్రవాహాన్ని తగ్గించడంతో క్రేన్, తాళ్ల సహాయంతో కారును బయటకు వెలికితీశారు. ముకుందాపురం సర్పంచ్‌ సలికంటి పద్మాసత్యం అధికారులకు కావాలి్సన సామగ్రి, తాళ్లతో పాటు లైటింగ్, తాగునీరు వంటి సదుపాయాలు కల్పించారు. ఘటనా స్థలాన్ని కలెక్టర్‌ చంద్రశేఖర్, ఎస్పీ శరత్‌చంద్ర పవార్‌ పరిశీలించారు. బ్రిడ్జి వెంట ఎటువంటి ఇనుప కంచె, రాతి స్తంభాలు, లైటింగ్‌ లేకపోవడంతోనే ప్రమాదం జరిగిందని మృతుల బంధువులు కలెక్టర్‌కు వివరించారు.

నాన్నా.. మందులు వేసుకో
మిర్యాలగూడలోని తన ఇంటి నుంచి కారులో బయల్దేరే ముందు తన తండ్రికి ‘సకాలంలో మందులు వేసుకోండి.. బై’ అని చివరిసారిగా చెప్పానని పుల్లయ్య, పద్మ దంపతుల చిన్న కుమారుడు శివ కన్నీరు మున్నీరయ్యాడు. కాల్వలో నుంచి కారును బయటకు తీయగానే పద్మ మృతదేహం మాత్రమే కన్పించడంతో ‘మా నాన్న ఎక్కడ అని’ వారి కుమార్తె నాగసంధ్య రోదించిన తీరు స్థానికులను కలిచివేసింది. పుల్లయ్య పెద్ద కుమారుడు తల్లం శ్రీనివాస్‌ అమెరికాలో ఉంటున్నాడని, అతడికి వీసా లభించడం కూడా  కష్టమని బంధువులు వాపోతున్నారు.

సీసీ కెమెరాలతో కారును గుర్తించి..
కాల్వలో పడిపోయిన కారును గుర్తించడంలో త్రిపురారం మండలం దుగ్గేపల్లికి చెందిన బోరు మెకానిక్‌ ఎన్‌. అశోక్‌ ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బందికి సహాయం చేశారు. సీసీ కెమెరాలతో బోర్లలో ఇరుక్కుపోయిన మోటార్లను గుర్తించడంలో అశోక్‌ సిద్ధహస్తుడు కాగా.. ఘటన జరిగిన వెంటనే అధికారులు ఆయనను సంప్రదించగా, బోరు పైపులను ఉపయోగించి సీసీ కెమెరాల సాయంతో రెండు గంటలకు పైగా శ్రమించి కాల్వలో కారును గుర్తించారు. ఎస్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది నీటి అడుగులోకి వెళ్లి తాళ్లతో కారును కట్టి ఉంచారు. ఆదివారం కారును బయటకు తీశారు.

కొబ్బరి మట్ట ఇచ్చి.. డ్రైవర్‌ ప్రాణం కాపాడి..
ముకుందాపురం గ్రామానికి చెందిన ముద్దాల వెంకన్న శనివారం రాత్రి సాగర్‌ ఎడమ కాల్వకు అవతలి వైపు పొలం వద్ద మోటారు ఆఫ్‌ చేసి వస్తుండగా కారు కాల్వలోకి దూసుకెళ్లడం గమనించాడు. వెంటనే అతడు కాల్వ వద్దకు వెళ్లి చూడగా.. అప్పటికే డ్రైవర్‌ రసూల్‌ కారు కిటికీలో నుంచి బయటకు వస్తుండటం గుర్తించాడు. వెంటనే కాల్వ పక్కన ఉన్న కొబ్బరి మట్ట ఇచ్చి డ్రైవర్‌ రసూల్‌ను కాల్వలో నుంచి బయటకు లాగాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement