బ్యాచ్‌మేట్స్‌కే సెల్యూట్‌! | 2012 batch SIs in police department salute their batchmates: Telangana | Sakshi
Sakshi News home page

బ్యాచ్‌మేట్స్‌కే సెల్యూట్‌!

Feb 9 2026 6:24 AM | Updated on Feb 9 2026 6:24 AM

2012 batch SIs in police department salute their batchmates: Telangana

గగ్గోలు పెడుతున్న 2012 బ్యాచ్‌ ఎస్సైలు 

నిబంధనల ప్రకారం ఆరేళ్లకే పదోన్నతికి అర్హత 

14 ఏళ్లు అయినా సగం మందికి రాని వైనం 

పోస్టింగ్స్, అప్‌గ్రేడేషన్‌ పట్టించుకోని ప్రభుత్వం  

రాజధానిలోని కమిషనరేట్లలోనే ఈ సమస్య

సాక్షి, హైదరాబాద్‌/మణికొండ: పోలీసు విభాగం అంటే పక్కా క్రమశిక్షణ కలిగిన ఫోర్స్‌. పై అధికారికి కింది అధికారి కచ్చితంగా సెల్యూట్‌ కొట్టాల్సిందే. అయితే.. పై అధికారి, ఆయన కింద పని చేసే అధికారి ఒకే బ్యాచ్‌కు చెందిన వారైతే..?, 2012 బ్యాచ్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్లలో అనేక మంది పరిస్థితి ప్రస్తుతం ఇలానే ఉంది. మల్టీజోన్‌–1లో ఉన్న ఈ బ్యాచ్‌ అధికారుల్లో దాదాపు అంతా ఇప్పటికే ఇన్‌స్పెక్టర్లు అయిపోగా.. హైదరాబాద్‌లోని నాలుగు కమిషనరేట్లు ఉన్న మల్టీజోన్‌–2కు చెందిన వారికి మాత్రం ప్రమోషన్ల ప్రక్రియ నత్తనడకన నడుస్తోంది. ఈ బ్యాచ్‌లో ఇప్పటి వరకు కనీసం సగం మందికిపైగా ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతి లభించలేదు. దీంతో ఇప్పటికే పదోన్నతి పొందిన బ్యాచ్‌మేట్స్‌కు ప్రమోషన్‌ కోసం ఎదురుచూస్తున్న వారు సెల్యూట్‌ కొట్టాల్సిన పరిస్థితి ఉంది. 2004 బ్యాచ్‌కి ఆరేళ్లకు, 2007 బ్యాచ్‌కు ఏడేళ్లకు, 2009 బ్యాచ్‌కు పదేళ్లకు ప్రమోషన్లు వచ్చాయని గుర్తు చేస్తున్నారు. 

అత్యధికులు మల్టీజోన్‌–2కే.. 
ఉమ్మడి రాష్ట్రంలో 2012 బ్యాచ్‌కు సంబంధించి వెయ్యి మందికి పైగా ఎస్సైలు ఎంపికయ్యారు. 2014లో తెలంగాణ ఏర్పడిన తర్వాత ఇక్కడ ఉన్న రెండు జోన్లకు కలిపి వీరి నుంచి 582 మందిని కేటాయించారు. 2018లో జోనల్‌ వ్యవస్థను పునర్‌వ్యవస్థీకరించిన తర్వాత రాష్ట్రంలో ఉన్న ఐదు, ఆరు జోన్లు.. మల్టీజోన్‌–1, మల్టీజోన్‌–2గా మారాయి. దీని ప్రకారం సిబ్బంది పంపకాలు జరగ్గా.. 2012 బ్యాచ్‌ ఎస్సైలలో మల్టీజోన్‌–2లో 360 మంది మిగిలారు. మల్టీజోన్‌–1లో వివిధ జిల్లాలతో పాటు సిద్దిపేట, ఖమ్మం, వరంగల్, నిజామాబాద్, కరీంనగర్, రామగుండం కమిషనరేట్లు ఉన్నాయి. మల్టీజోన్‌–2 విషయానికి వచ్చేసరికి ఇక్కడ కేవలం హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్లు మాత్రమే మిగిలాయి. 

అక్కడ వేగంగా.. ఇక్కడ నత్తనడకగా.. 
పోలీసు విభాగంలో ఎస్సైగా ప్రవేశించిన అధికారి ఆరేళ్ల సర్వీసు పూర్తి చేసుకుంటే ఇన్‌స్పెక్టర్‌గా పదోన్నతి పొందడానికి అర్హుడు అవుతాడు. కాగా, 2012 బ్యాచ్‌ వారికి 14 ఏళ్ల సరీ్వసు పూర్తయినా.. ఇప్పటికీ మల్టీజోన్‌–2కు సంబంధించిన అధికారుల్లో అత్యధికులు ఎస్సైలుగానే ఉండిపోయారు. కమిషనరేట్లు ఎక్కువగా ఉండటంతో పాటు ఖాళీలను సది్వనియోగం చేసుకోవడంతో మల్టీజోన్‌–1లో ప్రమోషన్లు వేగంగా వస్తున్నాయి. అక్కడ పదోన్నతులు రావాల్సిన వాళ్లు 30 నుంచి 50 మంది వరకే ఉండగా.. ఇక్కడ మాత్రం ఆ సంఖ్య 300 వరకు ఉంది. దీంతో మల్టీజోన్‌–2కు చెందిన 2012 బ్యాచ్‌ ఎస్సైలు మల్లీజోన్‌–1లోని తమ బ్యాచ్‌ వారితో పోలిస్తే ప్రమోషన్లలో వెనకబడిపోయారు. ఇలా మొదటి పదోన్నతి దశలోనే వెనకబడిపోతే.. ఆ ప్రభావం తమ సర్వీసు మొత్తం ఉంటుందని అధికారులు వాపోతున్నారు.  

ఈ చర్యలు తీసుకుంటే.. 
ప్రస్తుతం హైదరాబాద్‌ అంటే.. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ వరకు అనే భావన ఉంది. దీని లోపల ఉన్న పోలీసుస్టేషన్లలో కొన్నింటికి ఎస్సైలు, మరికొన్నింటికి ఇన్‌స్పెక్టర్లు స్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్లుగా (ఎస్‌హెచ్‌ఓ) ఉన్నారు. సైబరాబాద్, మల్కాజ్‌గిరి, ఫ్యూచర్‌ సిటీ కమిషనరేట్లలో ఉన్న అన్ని ఠాణాలకు ఇన్‌స్పెక్టర్లే ఎస్‌హెచ్‌ఓలుగా ఉండేలా అప్‌గ్రేడ్‌ చేయాలని పాలనారంగ నిపుణులు సూచిస్తున్నారు. రోడ్‌ సేఫ్టీ విభాగంతో పాటు మరికొన్ని చోట్ల ఉన్న ఖాళీలను పదోన్నతులతో పూరించడంతో పాటు నాలుగు కమిషనరేట్లలో అవసరమైన స్థాయిలో ట్రాఫిక్‌ పోలీసుస్టేషన్లు ఏర్పాటు చేయడం, హైడ్రాకు అవసరమైన ఇన్‌స్పెక్టర్లను పదోన్నతి పద్ధతిలో కేటాయించడం చేయాలని పదోన్నతి కోసం ఎదురుచూస్తున్న 2012 బ్యాచ్‌ ఎస్సైలు కోరుతున్నారు. అలా చేస్తే సూపర్‌ న్యూమరరీ పోస్టుల ద్వారా అయినా తమకు పదోన్నతి లభిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement