మార్చి 8 వరకు దరఖాస్తుకు గడువు.. మే 3న పరీక్ష
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, బీడీఎస్ సహా ఇతర వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్(నీట్–యూజీ)– 2026 షెడ్యూల్ విడుదలైంది. ఈ షెడ్యూల్‌ను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) ఆదివారం విడుదల చేసింది. ఆదివారం నుంచే ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది. విద్యార్థులు మార్చి 8వ తేదీ రాత్రి 9 గంటల వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అదే రోజు రాత్రి 11:50 గంటల వరకు ఆన్‌లైన్‌లో ఫీజు చెల్లించవచ్చు. మార్చి 10 నుంచి 12 వరకు దరఖాస్తుల్లో దొర్లిన తప్పులను సవరించుకోవచ్చు.
జనరల్ కేటగిరీ రూ.1,700, ఈడబ్ల్యూఎస్, ఓబీసీలు రూ.1,600, ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు రూ.1,000 పరీక్ష ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. ఇక ఎన్నారైలు రూ.9,500 ఫీజుగా చెల్లించాల్సి ఉంటుందని ఎన్టీఏ వెల్లడించింది. నీట్ యూజీ పరీక్షలను మే 3న నిర్వహించనున్నట్లు తెలిపింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ పరీక్షను నిర్వహిస్తారు. https://nta.ac.in, https://neet.nta.nic.in వెబ్‌సైట్లలో దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొంది. సిటీ ఇన్ఫర్మేషన్ స్లిప్ (ఏ పట్టణంలో పరీక్ష రాయనున్నారో), అడ్మిట్‌కార్డుల డౌన్‌లోడింగ్, ఫలితాల వెల్లడి వంటి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామంది.
నీట్ పరీక్షను ఆఫ్‌లైన్‌లో పెన్, పేపర్ పద్ధతిలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. ఈ పరీక్షను ఆన్‌లైన్‌లో నిర్వహించాలన్న ప్రతిపాదనలు వచ్చినా జాతీయంగా 25 లక్షలకు పైగా విద్యార్థులు హాజరయ్యే అవకాశముండటంతో ప్రస్తుతానికి ఆఫ్‌లైన్‌లోనే నిర్వహిస్తున్నారు. దరఖాస్తు చేసే విద్యార్థుల సౌలభ్యం కోసం ఎన్టీఏ హెల్ప్‌డెస్‌్కను ఏర్పాటు చేసింది. విద్యార్థులు 011–40759000, 011–69227700 లేదా neetus2026@nta. ac.in ఈమెయిల్‌ను సంప్రదించాలని ఎన్టీఏ సూచించింది.


