కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం | KTR Comments at municipal election campaign meetings | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ది భస్మాసుర హస్తం

Feb 9 2026 3:55 AM | Updated on Feb 9 2026 3:55 AM

KTR Comments at municipal election campaign meetings

ఫిబ్రవరి గడుస్తున్నా రైతులకు ‘భరోసా’ లేదు 

ఆరు గ్యారంటీల అమలులో రేవంత్‌రెడ్డి విఫలం 

మున్సిపల్‌ ఎన్నికల ప్రచార సభల్లో కేటీఆర్‌  

తాండూరు/ నర్సంపేట/వర్ధన్నపేట/తొర్రూరు: ‘ముఖ్యమంత్రిని రైతు భరోసా ఇస్తా అంటివి కదా అని అడిగితే లాగులో తొండలు విడుస్తా అంటడు. మహిళలకు రూ.2 వేలు ఏమాయె అంటే గుడ్లు పీకి గోటీలు ఆడుతా అంటుండు. తులం బంగారం ఎప్పుడంటే పేగులు తీసి మెడలేసుకుంటా అంటుండు. ఇంతకు రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రా లేక బోటీ కొట్టేటోడా అర్థం కావడం లేదు. ఇక నుంచి ఆయన్ను లాగుల తొండల్‌రెడ్డి అనాలేమో’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ఎద్దేవా చేశారు. ఆదివారం మున్సిపల్‌ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉమ్మడి వరంగల్‌ జిల్లా నర్సంపేట, వర్ధన్నపేట, తొర్రూరుతోపాటు వికారాబాద్‌ జిల్లా తాండూరులో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా చోట్ల జరిగిన రోడ్‌ షో, కార్నర్‌ మీటింగ్‌లలో కేటీఆర్‌ మాట్లాడుతూ రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్‌ పార్టీది అభయ హస్తం కాదని అది భస్మాసుర హస్తమని విమర్శించారు. 

కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టి రెండేళ్లు దాటుతున్నా ఆరు గ్యారంటీలు, 420 హామీలు అమలుకు నోచుకోవడం లేదన్నారు. కామారెడ్డికి ఎన్నికల ప్రచారానికి వెళితే ఓ పెద్దమ్మ మాట్లాడుతూ.. రూ.4 వేలు పింఛన్‌ తీసుకునేవారు కాంగ్రెస్‌కు, బీఆర్‌ఎస్‌ హయాంలో రూ.2 వేలు పెన్షన్‌ తీసుకున్నోళ్లు కారు గుర్తుకు ఓటేయాలని తాండూరు ప్రజలకు చెప్పమని పంపించిందన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సోనియాగాం«దీపై ఒట్టేసి రైతులకు ఎకరాకు రూ.15 వేలు రైతు భరోసా ఇస్తామని హామీ ఇచ్చారని.. ఫిబ్రవరి వచ్చినా రైతులకు పెట్టుబడి సాయం అందలేదన్నారు. రేవంత్‌రెడ్డి పాలనలో రైతులు యూరియా కోసం చెప్పులు క్యూలో పెట్టే పరిస్థితులు ఎదుర్కొంటున్నారన్నారు.  

మున్సిపల్‌ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలి 
ఎన్నికలకు ముందు పచ్చి అబద్ధాల వాగ్దానాలు చేసి గెలిచిన తర్వాత రాష్ట్ర ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి ఇబ్బందులకు గురి చేస్తున్నాడని కేటీఆర్‌ దుయ్యబట్టారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం ఢిల్లీకి పైసలు పంపడంలో మాత్రమే సక్సెస్‌ అవుతున్నదని, రాష్ట్ర ప్రజలను అన్ని రకాలుగా మోసం చేస్తోందన్నారు. దొంగ, పోలీస్‌ కలిసి వర్ధన్నపేట ప్రజలను మోసం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి, ఎమ్మెల్యే కేఆర్‌ నాగరాజునుద్దేశించి విమర్శించారు. తెలంగాణ జాతిపిత కేసీఆర్‌పైనే కేసులు మోపుతున్నారని, నన్నేమైనా అంటే పడతానని..మా అయ్య జోలికి వస్తే మూడు భాషల్లో తిడతానన్నారు. ఎన్నికలు వచ్చినపుడు పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించవద్దన్నారు. ఆయా కార్యక్రమాల్లో మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, మాజీ ఎమ్మెల్యేలు పెద్ది సుదర్శన్‌రెడ్డి, అరూరి రమేశ్, నన్నపునేని నరేందర్, రోహిత్‌రెడ్డి, తాండూరు మున్సిపల్‌ చైర్మన్‌ అభ్యర్థి పట్లోళ్ల నర్సింలు పాల్గొన్నారు.   

Advertisement
 
Advertisement
Advertisement