చెల్పూరులో మహిళా సమాఖ్య సభ్యులకు రూ.205 కోట్ల చెక్కు అందజేస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో మంత్రులు పొంగులేటి, శ్రీధర్‌బాబు, కొండా సురేఖ, ఎంపీ కడియం కావ్య
భూపాలపల్లి జిల్లా చెల్పూరు ప్రజాపాలన–ప్రగతిబాట సభలో సీఎం రేవంత్‌రెడ్డి
జిల్లాల పునర్విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చిస్తాం
బీఆర్‌ఎస్ అంటే బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి...
ఇక నుంచి అలాగే పిలుస్తా.. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌ను అరెస్ట్ చేసే వరకూ కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావే
సింగరేణిపై బీఆర్‌ఎస్ విష ప్రచారం.. మెడికల్ బోర్డు రద్దు ఆలోచన లేదు
సాక్షి ప్రతినిధి, వరంగల్: ‘పాత జిల్లాల మార్పు..కొత్త జిల్లాల ఏర్పాటుపై కొందరు విష ప్రచారం చేస్తున్నారు. జిల్లాలను తీసివేయం.. కొత్త జిల్లాలను ఏర్పాటు చేయం.. ఒకవేళ జిల్లాల పునర్విభజన చేయాల్సి వస్తే అసెంబ్లీలో చర్చకు పెడతాం. ప్రతిపక్ష పార్టీల అభిప్రాయాలను తీసుకుంటాం’ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. అబద్ధాలతో ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్న వారిని నమ్మొద్దని, భూపాలపల్లి జిల్లా ఎటూపోదని.. జిల్లాల మార్పులపై ఎవరూ అపోహ పడొద్దని చెప్పారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఆదివారం నిర్వహించిన ప్రజాపాలన–ప్రగతిబాట కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు.
హెలికాప్టర్‌లో మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, కొండా సురేఖతో ముందుగా రేగొండ మండలం కొడవటంచ గ్రామానికి చేరుకున్న సీఎం.. శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. అక్కడ రూ.63 కోట్లతో ఆలయ పునరుద్ధరణ, గెస్ట్‌హౌస్ నిర్మాణ పనులను సురేఖ చేతుల మీదుగా ప్రారంభించారు. అనంతరం చెల్పూరులో ఏర్పాటు చేసిన ‘ప్రజాపాలన–ప్రగతి బాట’బహిరంగ సభలో రేవంత్‌రెడ్డి ప్రసంగించారు. జిల్లాల పునర్విభజనపై అందరి అభిప్రాయాలు తీసుకొని, అసెంబ్లీలో చర్చించిన తర్వాతే దీనిపైన ఆలోచిస్తామని, కుట్రలు, కుతంత్రాలతో విష ప్రచారం చేస్తున్న వారిని గమనించాలని పునరుద్ఘాటించారు.
ఆ ముగ్గురి అరెస్ట్‌కు కిషన్‌రెడ్డే అడ్డు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కల్వకుంట్ల కిషన్‌రావుగా మారి కేసీఆర్‌ను అరెస్టు చేయకుండా అడ్డుపడుతున్నాడని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావులను అరెస్ట్ చేసే వరకు కిషన్‌రెడ్డిని కల్వకుంట్ల కిషన్‌రావనే పిలుస్తానని స్పష్టం చేశారు. రూ.వేల కోట్ల ఆస్తులను పేదలకు దానం చేసిన సోనియా, రాహుల్‌గాం«దీని సీబీఐ, ఈడీ కేసుల పేరుతో వేధించి అమానించలేదా? గాంధీ కుటుంబంపైన ఈడీ, సీబీఐని ఉపయోగిస్తున్నప్పుడు కాళేశ్వరంపైన సీబీఐ విచారణకు పంపిస్తే ఎవరు అడ్డుకుంటున్నారు’అని ప్రశ్నించారు. ఫెవికాల్ బంధంతో కేసీఆర్, కేటీఆర్, హరీశ్‌రావును కిషన్‌రెడ్డి కంచె వేసి కాపాడుతున్నాడన్నారు. కేసీఆర్‌కు కేటీఆర్ సొంత కొడుకైతే.. కిషన్‌రెడ్డి దత్త పుత్రుడని చెప్పారు.
ఏప్రిల్ తర్వాత రెండో విడత ‘ఇందిరమ్మ’
ఏప్రిల్ తర్వాత రాష్ట్రంలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లను అర్హులకు అందజేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. ‘ప్రతి నియోజకవర్గానికి 3,500 ఇందిరమ్మ ఇళ్లు నిర్మించి ఇస్తున్నాం. రూ.22,500 కోట్లతో 4.5 లక్షల ఇళ్లు నిర్మిస్తున్నాం. వచ్చే బడ్జెట్‌లో రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేస్తాం’అని స్పష్టం చేశారు. ‘కేసీఆర్, మోదీని చూసి ఓటు వేయాలని బీఆర్‌ఎస్, బీజేపీ చెబుతున్నాయి. గల్లీలో మోరీలు కేసీఆర్ వచ్చి తీస్తాడా? కేసీఆర్, మోదీ బొమ్మలు చూపించి ఓట్లు అడగడానికే పనికి వస్తారు.. పెళ్లి పెద్దను చూసి పిల్లను ఇస్తే సంసారం ఆగం అవుతుంది’అని రేవంత్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్‌కు ఓటేస్తే మీ సమస్యలు పరిష్కారం అవుతాయని, ఎర్రవెల్లి పాంహౌస్‌లో బోర్లబొక్కల పడుకున్న కేసీఆర్ నిధులు ఇవ్వడని అన్నారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు రూ.17,442 కోట్లు మంజూరు చేశామని స్పష్టం చేశారు. 2027 గోదావరి పుష్కరాల సందర్భంగా బాసర నుంచి భద్రాచలం వరకు పర్యాటక ప్రాంతాన్ని రూ. 3, 4 వేల కోట్లు ఖర్చు పెట్టి అభివృద్ధి చేస్తామన్నారు.
సింగరేణిపై అపోహలు వద్దు..
సింగరేణి వారసత్వ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు రద్దు చేస్తారని విష ప్రచారం చేసే వారిని మోకాళ్లపై కూర్చొబెట్టాలని కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలకు రేవంత్ పిలుపునిచ్చారు. సింగరేణి కార్మీకులకు న్యాయం చేయడానికి ప్రభుత్వం ప్రయత్నం చేస్తోందన్నారు. ‘బీఆర్‌ఎస్‌ను ఇక నుంచి బ్లాక్‌మెయిల్ రాజకీయ సమితి అని పిలుస్త. ఫోన్ ట్యాపింగ్ ద్వారా బ్లాక్ మెయిల్ చేసి రూ. వందల కోట్లు దోచుకున్నారు. బీఆర్‌ఎస్ ఖాతాలో రూ. 1,500 కోట్లు ఎవడబ్బ సొమ్ము’అని రేవంత్ ప్రశ్నించారు.
అక్కలు దసరా రోజు పాలపిట్టల్లా ఉన్నారు..
‘మా అక్కలు దసరా పండుగ రోజు పాలపిట్టల్లా కనిపిస్తున్నారు. బతుకమ్మ చీరలను బాయికాడ పిట్టలను బెదిరించడానికి కట్టారు.. ఇందిరమ్మ చీరను సారె రూపంలో మీ తమ్ముడు పెట్టాడు.. ప్రతి ఏడాది ఇందిరమ్మ చీరను తప్పకుండా ఇస్తాం’అని రేవంత్‌రెడ్డి అన్నారు. భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు అధ్యక్షతన జరిగిన సభలో మంత్రులు ఎంపీ కడియం కావ్య, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు సిరిసిల్ల రాజయ్య, ఐత ప్రకాశ్‌రెడ్డి, జనక్‌ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


