మంత్రి తుమ్మల నాగేశ్వరరావు
సాక్షి, హైదరాబాద్: యూరియా విషయంలో బీఆర్‌ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం రైతాంగాన్ని రెచ్చగొట్టే దిగజారుడు ప్రచారం చేస్తోందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఒక ప్రకటనలో ధ్వజమెత్తారు. రైతులు యూరియా కోసం క్యూ లైన్లలో నిలబడుతున్నారని బీఆర్‌ఎస్ పదే పదే చేస్తున్న ప్రచారం పూర్తిగా అసత్యమని స్పష్టం చేశారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో రైతులను ఏ విధంగా ఇబ్బందులకు గురిచేశారో రాష్ట్ర రైతాంగానికి బాగా తెలుసని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు సంవత్సరాల్లో వ్యవసాయ రంగానికి ఎంత ప్రాధాన్యత ఇస్తున్నదీ కూడా రైతులు గమనిస్తున్నారని మంత్రి తెలిపారు.
సిద్దిపేట, గజ్వేల్ ప్రాంతాల్లో యూరియా కోసం క్యూ లైన్లలో రైతులు నిలబడి ఇబ్బందులు పడిన ఘటనలు, క్యూ లైన్లలో రైతులు మరణించిన దుర్ఘటనలు కూడా బీఆర్‌ఎస్ నేతలు మర్చిపోయారని విమర్శించారు. వరి బోనస్ గురించి మాట్లాడే నైతిక హక్కు బీఆర్‌ఎస్ నేతలకు ఉందా అని ప్రశ్నిస్తూ, ‘వరి వేస్తే ఉరి’అన్న మాటలు గుర్తు చేశారు.
గత వానాకాలంలో కేంద్రం నుంచి సకాలంలో ఎరువులు అందక రైతులు ఇబ్బంది పడితే, ఆ పరిస్థితిని రాజకీయ లబ్ధికి వాడుకున్నారని, అయినప్పటికీ పంచాయతీ ఎన్నికల్లో రైతులు బీఆర్‌ఎస్‌కు తగిన గుణపాఠం చెప్పారన్నారు. పత్తి రైతుల కోసం కేంద్రం తీసుకొచ్చిన ‘కపాస్ కిసాన్ యాప్’విజయవంతమవడంతో అదే తరహాలో యూరియా యాప్‌ను అమలు చేస్తున్నామని తెలిపారు. యాప్ అమలులో ఉన్న జిల్లాల రైతులను అడిగి తెలుసుకోవాలని, అక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని తుమ్మల స్పష్టం చేశారు.


