సందర్భం
కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ చాలా రోజుల క్రితమే ‘వ్యవసాయం, రైతాంగ సంక్షేమ’ మంత్రిత్వ శాఖ అనే పేరు పెట్టుకొంది. కానీ సంక్షేమం అన్నది మారిన పేరులో తప్ప క్షేత్ర స్థాయిలో కనబడటం లేదు. 2026 –27 ఆర్థిక సంవత్సర కేంద్ర బడ్జెట్‌ను చూసినప్పుడు అతి కీలకమైన వ్యవ సాయ రంగం క్రమంగా తన ప్రాధా న్యాన్ని కోల్పోయిందన్న బాధ కలగక మానదు. బడ్జెట్‌కు ముందురోజు విడుదలైన ఆర్థిక సర్వే, వ్యవసాయ రంగ దుఃస్థితిని తేటతెల్లం చేసింది. మొత్తం జీడీపీ (దేశ స్థూలోత్పత్తి) 7.4 శాతంగా ఉంటుందని అంచనా వేశారు. కానీ, వ్యవసాయ రంగ వృద్ధిరేటు 4.6 నుంచి 3.1 శాతానికి తగ్గుతుందని తేల్చారు. సాధారణంగా వృద్ధిరేటు మందగిస్తుందని తెలిసినప్పుడు దానిని పైకి లాగే చర్యలు తీసుకోవడం సహజం. ఆశ్చర్యంగా, తాజా బడ్జెట్‌లో వ్యవసాయ, అనుబంధ రంగాలకు కలిపి మొత్తం రూ. 1.62 లక్షల కోట్లు కేటాయించారు. సవరించిన అంచనాల (2025–26 ఆర్థిక సంవత్సరంలో) కంటే ఇది 5.3 శాతం మాత్రమే ఎక్కువ. ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకొంటే, ఈ పెరుగుదల నామమాత్రం.
పరిశోధనలకు ఊతమేది?
వ్యవసాయ రంగ ఉపరితల ముఖచిత్రాన్ని చూస్తే, గొప్ప గానే ఉన్నట్టు కనిపిస్తుంది. 2024–25లో 35.7 కోట్ల మెట్రిక్ టన్నుల ఆహార ధాన్యాలు పండాయి. ఈ మొత్తం 145 కోట్ల జనాభాకు సరిపోవడమే గాక, ఎగుమతులు చేయడానికి ఆస్కారం ఉంది. పాడి, పండ్లు, కూరగాయలు, మత్స్య సంప దపై రాబడి సంతృప్తిగానే ఉంది. మరి సమస్యేమిటి? ఆర్థిక సర్వే వెల్లడించిన సమాచారం ప్రకారం – తృణ ధాన్యాలు, పప్పు ధాన్యాలు, సోయాబీన్, మొక్కజొన్న వంటి పంటల ఉత్పాదకత, ఉత్పత్తి గణనీయంగా తగ్గాయి. అంతర్జాతీయ స్థాయితో పోల్చుకుంటే మనం అట్టడుగున ఉన్నాం. దానివల్ల పంటలు గిట్టుబాటు కావడం లేదు. వారసత్వంగా సంక్రమి స్తున్న మార్కెటింగ్ సౌకర్యాల లేమి, ఇన్‌ఫుట్స్ వ్యయం గణనీ యంగా పెరగడం, చీడపీడలు, అకాల వర్షాలు, వర్షా భావం మొదలైనవి వెంటాడుతూనే ఉన్నాయి.
వ్యవసాయ ఉత్పాదకతను పెంచడం ‘మన కర్తవ్యం’ అని బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతా రామన్... ఉత్పాదకత పెంపుదలకు అవసరమైన ‘వ్యవసాయ పరిశోధన, విద్య’కు గతేడాది కేటాయించిన రూ.10,281 కోట్ల నిధులను ఈ ఆర్థిక సంవత్సరానికి రూ.9,967 కోట్లకు తగ్గించి వేయడం ఓ వైచిత్రి. వ్యవసాయ రంగంలో పరిశోధన, విద్యకు చాలా దేశాలు తమ వ్యవసాయ బడ్జెట్‌లో 1 శాతం నిధులు కేటాయిస్తున్నాయి. దీన్ని స్థిరమైన ఉత్పాదకత వృద్ధికి సంబంధించి బెంచ్‌మార్క్‌గా పేర్కొంటారు. కానీ మనం మాత్రం ఇందుకు 0.5 శాతం నిధులు మాత్రమే కేటాయిస్తున్నాం. వ్యవసాయ పరిశోధనలపై పెట్టే ప్రతి రూపాయీ అదనపు రాబడిని తెచ్చి పెడుతుందని శాస్త్రజ్ఞులు రుజువు చేసినా, మన ప్రభుత్వాలు ఎందుకనో వినవు, కనవు.
పశు సంవర్ధక, పాడి, మత్స్య పరిశ్రమలకు మేలు చేకూర్చేందుకు ఇంతకు ముందుకంటే ఈ రంగాలకు దాదాపు 27 శాతం నిధులు కేటాయించడం ఒక్కటే సానుకూల అంశం. ఈ రంగాల ద్వారా రాబడి ఆకర్షణీయంగా ఉంది. ముఖ్యంగా తీరప్రాంత రాష్ట్రాలకు మత్స్య సంపదపై వచ్చే ఆదాయాన్ని వ్యవసాయంలో కలిపేసి... వ్యవసాయ రంగంలో తమ అభివృద్ధి 10 నుంచి 15 శాతంగా ఉన్నట్లు మసిపూసి మారేడుకాయ చేసిన చందంగా చెప్పుకొంటున్నారు.
దిగుమతుల బెడద
దేశీయ రైతాంగానికి మరో పెను సవాలు పెరగనున్న వ్యవసాయ ఉత్పత్తుల దిగుమతులు. అమెరికాకు చేసే ఎగు మతులపై తాజాగా ట్రంప్ 18 శాతం మాత్రమే సుంకాలు విధిస్తామని ఓ చల్లని కబురు చెప్పిన మాట నిజమే. కానీ, అమెరికా నుంచి వచ్చే ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తులతో సహా అన్నింటిపై భారత్ ఎటువంటి సుంకాలూ విధించబోదని ట్రంప్ పేర్కొనడం పిడుగులాంటి వార్తే! ఇప్పటికే తెలుగు రాష్ట్రాలతో సహా పలు రాష్ట్రాలు ఆయిల్ పామ్ దిగుమతులపై సుంకం పెంచడం ద్వారా ఇక్కడి రైతులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాయి. నూనె గింజల దిగుమతులపై సుంకం విధించకుంటే దేశీయ నూనెగింజల రైతులు మునిగిపోతారు. కానీ, బడ్జెట్‌లో అటువంటి ప్రతిపాదనలేమీ చేయలేదు. దేశీయ వ్యవ సాయ ఉత్పత్తులకు ప్రోత్సాహం ఇవ్వకుండా దిగుమతులను ఎందుకు అనుమతిస్తున్నారు? అమెరికా ఉత్పత్తుల దిగుమతు లపై పూర్తిగా సుంకం ఎత్తివేస్తే... భారత రైతాంగం ఇకపై కొన్ని రకాల పంటల సాగును శాశ్వతంగా మానుకోవాల్సిందే.
ఇక, తెలంగాణలో ఏర్పాటు చేస్తామన్న పసుపు బోర్డుకు నిధులు కేటాయించలేదు. లక్షలాది మంది పసుపు రైతులు ఎదురుచూస్తున్న డెడికేటెడ్ ఫండ్స్ గురించి స్పష్టమైన ప్రకటన చేయలేదు. కొబ్బరి బోర్డును ఏర్పాటు చేస్తామన్న హామీ ఏమైందో తెలియదు. ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని 1.7 లక్షల కోట్లకు తగ్గించారు. గతేడాది ఇది 1.86 లక్షల కోట్లు. సబ్సిడీలు అధికంగా ఇవ్వాల్సి వస్తుందని ఎరువుల లభ్యతను కావాలనే కేంద్రం తగ్గించేసిందనే అనుమానాలు కలుగుతున్నాయి.
కనీస మద్దతు ధరకు చట్టబద్ధత ఏదీ?
అన్ని పంటలకు కనీస మద్దతు ధరలు కల్పించే అంశంలో చట్టబద్ధత కల్పించాలని ఎంతో కాలంగా రైతు సంఘాలు కోరుతున్నాయి. దాన్ని పెడచెవిన పెట్టారు. ధరల స్థిరీకరణ, మార్కెట్ సంస్కరణలపైన కూడా స్పష్టమైన దిశానిర్దేశం కొరవడింది. వ్యవసాయ పనిముట్లపై ఇంకా అధికశాతం జీఎస్టీ కొనసాగుతూనే ఉంది. కాఫీ గింజల్ని ప్రాసెస్ చేసే పరికరాల పైన కూడా కస్టమ్స్ డ్యూటీని మినహాయించాలన్న కాఫీ గింజల ఉత్పత్తిదారుల డిమాండ్‌ను పట్టించుకోలేదు. ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తామని గత రెండు, మూడేళ్లుగా చెబుతూనే ఉన్నా... దానిని అమలు చేస్తున్న రైతాంగానికి తగిన ప్రోత్సాహకాలు ఇవ్వడం లేదు.
సంప్రదాయంగా వరి పండించే తెలుగు రాష్ట్రాల రైతాంగాన్ని కొబ్బరి, జీడి, చందనం వంటి పంటలకు మళ్లమని చెప్పడం వరకు బాగానే ఉంది. కానీ, ప్రభుత్వాల పరంగా ఇవ్వాల్సిన ప్రోత్సాహకాలు ఎక్కడ? భవిష్యత్తులో వరి, గోధుమ వేసినట్లయితే నష్టపోతారని ఆర్థిక సర్వేలో చెప్పారు. వరి పండించే చిన్న సన్నకారు రైతాంగానికి తగిన అవగాహనతో పాటు నిర్దిష్టమైన ప్రోత్సాహకాలు అందిస్తేనే ఫలితం ఉంటుంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతను ఉపయోగించు కోవడానికి ‘భారత్ విస్తార్’ పథకం ద్వారా రైతులకు వారి భాష లోనే సలహాలు, సూచనలు అందించాలన్న చొరవను స్వాగతించాల్సిందే. కానీ ముందుగా మౌలికమైన మార్పులు తేవడానికీ, ముఖ్యంగా పంటల మార్పిడికి రైతాంగాన్ని సన్నద్ధం చేయడానికీ అవసరమైన నిర్దిష్టమైన కార్యాచరణ ఉండాలి.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
వ్యాసకర్త కేంద్ర మాజీ మంత్రి, ఏపీ శాసన పరిషత్ సభ్యులు


