జెఫ్‌ బెజోస్‌ (వ్యాపార దిగ్గజం) రాయని డైరీ | Rayani Diary Of business magnate Jeff Bezos | Sakshi
Sakshi News home page

జెఫ్‌ బెజోస్‌ (వ్యాపార దిగ్గజం) రాయని డైరీ

Feb 8 2026 2:22 AM | Updated on Feb 8 2026 2:22 AM

Rayani Diary Of business magnate Jeff Bezos

మాధవ్‌ శింగరాజు

సంతకం పెడుతున్నప్పుడు చేయి వణికిందంటే చేయకూడని పని ఏదో చేస్తున్నట్లు! లేదా, జరగవలసిన పనే ఏదో జరుగుతున్నట్లు!! ‘వాషింగ్టన్‌  పోస్ట్‌’లో ఒకేసారి 300 మంది జర్నలిస్టులను తొలగిస్తూ నేను చేసిన సంతకం... చేయక తప్పనిదా? చేసినా తప్పవనిదా? సిబ్బందిని తగ్గిస్తూ, నేను సంతకం చేస్తున్నప్పుడు నా వేలికి అంటిన ఫౌంటైన్‌  పెన్‌  ఇంకు నాకు భారంగా తోచింది. అయితే, నా గుండెను బరువెక్కించిన విషయం వేరే ఉంది. ఏ పత్రికలోని ఉద్యోగులనైతే తొలగించ టానికి నేను సంతకం చేయవలసి వచ్చిందో సరిగ్గా ఆ పత్రికే, నా తొలగింపుల సంతకపు కాగితానికి ‘ఒత్తు’గా ఉండటం నా మనసును కలవరపరిచిన కో–ఇన్సిడెన్స్‌!

తొలగింపుల జాబితాలో తమ పేరు కనిపించిన ఉద్యోగులకు కూడా నాలాగే గుండె బరువెక్కి ఉంటుంది. కాళ్ల కింద భూమి కదిలే ఉంటుంది. కానీ, చెట్టును బతికించటానికి కొమ్మలను నరికేయక తప్పని స్థితి. ఈ ఏడాది మళ్లీ మరొక 100 మిలియన్‌  డాలర్ల నష్టాల్లోకి పేపర్‌ వెళ్లబోతోంది. పోయిన సంవత్సరం వంద మిలియన్ల నష్టం! ఆ ముందు ఏడాదీ వంద మిలియన్ల నష్టం! పన్నెండేళ్ల క్రితం నేను ‘వాషింగ్టన్‌  పోస్ట్‌’ను కొన్నదే 250 మిలియన్‌  డాలర్లకు!

పేరున్న ఒక న్యూస్‌ పేపర్‌గా మాత్రమే ఆనాడు నేను ఈ 148 ఏళ్ల చరిత్ర కలిగిన ‘వాషింగ్టన్‌ పోస్ట్‌’ పత్రికను కొనలేదు. ప్రజాస్వామ్య మూలస్తంభాన్ని కొన్నట్లుగా కొన్నాను. లాభాలు చూసుకోలేదు. కానీ ఇప్పుడు నష్టాలను చూసుకోవలసి వస్తోంది. ‘వాషింగ్టన్‌  పోస్ట్‌’లో న్యూస్‌ రూమ్‌లు, న్యూస్‌ బ్యూరోలు ఎక్కువైపోయాయి. న్యూస్‌ పేపర్‌ చదివేవాళ్లు తక్కువైపోయారు. ‘న్యూయార్క్‌ టైమ్స్‌’కూ, ‘వాల్‌స్ట్రీట్‌ జర్నల్‌’కూ... ‘వాషింగ్టన్‌  పోస్ట్‌’ పోటీ ఇవ్వలేకపోతోంది.

‘‘ఏం చేద్దాం, మిస్టర్‌ మ్యాక్‌’’ అని అడిగాను ఒకరోజు. ఆయన మౌనంగా ఉండిపోయారు! మ్యాక్‌ ఎగ్జిక్యూటివ్‌ ఎడిటర్‌. ఆయన పక్కనే సీఈవో విలియం ఉన్నారు. ‘‘మీరు చెప్పండి మిస్టర్‌ విలియం’’ అన్నాను. ఆయనా మౌనంగా ఉన్నారు!! ఆ ఇద్దరి మౌనాల తర్వాత నేను తీసుకోవలసి వచ్చిన కఠినమైన నిర్ణయమే... ‘వాషింగ్టన్‌  పోస్ట్‌’లోని కొన్ని డెస్క్‌లను, కొన్ని బ్యూరోలను ఎత్తివేయటం, మూకుమ్మడిగా కొందరు జర్నలిస్టులను తొలగించటం.

270 బిలియన్‌  డాలర్ల విలువైన ఆస్తులున్న జెఫ్‌ బెజోస్‌కు 100 మిలియన్‌  డాలర్ల నష్టం ఒక లెక్కా అని ఎవరికైనా అనిపించవచ్చు. ఇది లెక్కల విషయం కాదు. నెలనెలా తన బిలియనీర్‌ యజమాని జేబు లోంచి వచ్చే డబ్బుతో ఏ సంస్థా నడవకూడదు. ‘వాషింగ్టన్‌  పోస్ట్‌’ వంటి దిగ్గజమైతే తన ఇంజిన్‌ తోనే రన్‌  అవ్వాలి. అలా నడవటమే పత్రికకు, పత్రికలోని ఉద్యోగులకు గౌరవం. 

అమెజాన్‌  ఆఫీస్‌ బిల్డింగ్‌కు నేను పెట్టుకున్న పేరు ‘డే–1’. కొత్తగా పెట్టిన కంపెనీ తొలి రోజు ఎంత ఎనర్జిటిక్‌గా ఉంటుందో, పదివేల ఏళ్ల తర్వాత కూడా ఆ కంపెనీ, తొలి రోజు ఉన్నట్లే ఉండాలన్నది ‘డే–1’ వెనుక నా ఫిలాసఫీ. కంపెనీ ‘డే–2’ లోకి వచ్చిందంటే... స్తబ్ధత, అసంబద్ధత, క్షీణత తప్ప ఇక అక్కడేం లేవని!

‘వాషింగ్టన్‌  పోస్ట్‌’ ప్రస్తుతం ‘డే–2’ లో ఉంది. తిరిగి ‘డే–1’లోకి తెచ్చేందుకే ఈ తొలగింపులు, ఎత్తివేతలు అంటే ఎవరైనా ఎందుకు సంతోషిస్తారు? ఆఖరికి మ్యాక్, విలియమ్‌ కూడా సమ్మతంగా లేరు.  18 సొంత కంపెనీలు ఉండొచ్చు, 31 కంపెనీల్లో వాటాలు ఉండవచ్చు. బిలియన్ల కొద్దీ ఆస్తులు ఉండవచ్చు. లక్షలాది మంది వర్కర్లు ఉండవచ్చు. కానీ, కొద్దిమంది ఉద్యోగులను తొలగించవలసి వచ్చినప్పుడు మాత్రం... అన్నన్ని కంపెనీలు, అన్నన్ని వాటాలు, అన్నన్ని ఆస్తులు, అంతంత మంది వర్కర్లు ఉన్న ఏ బిజినెస్‌ టైకూన్‌కైనా ఒక్క అపరాధ భావన మాత్రమే తోడుగా ఉంటుందేమో!  

Advertisement
 
Advertisement
Advertisement