పరిశోధనలు ప్రైవేటు పరమా? | This is a general budget that maintains the status quo in high tech sectors | Sakshi
Sakshi News home page

పరిశోధనలు ప్రైవేటు పరమా?

Feb 7 2026 3:43 AM | Updated on Feb 7 2026 3:43 AM

This is a general budget that maintains the status quo in high tech sectors

సాధారణంగా అందరూ అనుకునేట్టు కేంద్ర ప్రభుత్వం ఏటా ప్రవేశపెట్టే బడ్జెట్‌ కేవలం పన్నులు, ఆదాయం, ఆ యా
రంగాలకు కేటాయింపులు మాత్రమే కాదు. కీలక రంగాల విషయంలో ప్రభుత్వ ఆలోచనలు, విధానపరమైన మార్పులు ఇందులోనే వ్యక్తమవుతాయి. ప్రపంచవ్యాప్తంగా సాంకేతిక పరిజ్ఞానరంగం ఉరకలేస్తున్న తరుణంలో అంతర్జా తీయ రాజకీయ పరిణామాలనూ దృష్టిలో ఉంచుకుంటే ఈ ఏడాది బడ్జెట్‌ సరికొత్త సవాళ్లకు సమాధానాలు తెలిపేదిగా ఉంటుందని ఆశించడం సహజం. కానీ ఈ దిశలో బడ్జెట్‌ నిరాశ పరిచిందనే చెప్పాలి. ప్రభుత్వం ప్రకటించుకున్నట్టు ఇది ఫ్యూచరిస్టిక్‌ బడ్జెట్‌ కాదు. కృత్రిమ మేధ, సెమీ కండక్టర్‌ వంటి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞాన రంగాల విషయంలో ఇది యథాతథ స్థితిని కొనసాగించే సాధారణ బడ్జెట్‌. 

మార్పునకు సూచికలేనా?
ఆర్థిక శాఖ మంత్రి తన బడ్జెట్‌ ప్రసంగంలో సైన్స్, టెక్నాలజీ రంగాలకు సంబంధించి ఏం మాట్లాడారో చూద్దాం. కొత్త టెలిస్కో పులు, వేధశాలల ఏర్పాటును ప్రస్తావించారు. అరుదైన మూలకా లకు సంబంధించిన కారిడార్ల గురించి, సెమీ కండక్టర్‌ మిషన్ రెండో అధ్యాయం ప్రారంభం, బయోఫార్మా తయారీ వ్యూహాలూ ప్రసంగంలో ఉన్నాయి. ఇవన్నీ చేయాల్సిన పనులే. అయితే ఏవీ ఓ గొప్ప మార్పునకు సూచికలైతే కావు. 

‘ది ఇండియన్ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆస్ట్రోఫిజిక్స్‌’ (ఐఐఏ) 15 ఏళ్లుగా నేషనల్‌ లార్జ్‌ సోలార్‌ టెలిస్కోపు తయారీ కోసం శ్రమిస్తోంది; ఐదేళ్లుగా నేషనల్‌ లార్జ్‌ ఆప్టికల్‌ ఇన్ఫ్రారెడ్‌ టెలిస్కోపు నిర్మాణ ప్రయత్నాల్లోనూ ఉంది. ఆర్థిక మంత్రి వీటి గురించే బడ్జెట్‌లో ప్రస్తావించారు. వీటి డిజైనింగ్, స్థలంఎంపిక, పరిశోధన వేదిక పునాదులు, సిబ్బంది వంటి కీలకమైన ఏర్పాట్లు ఇప్పటికే జోరుగా సాగుతున్నాయి. స్థలం ఎంపిక కోసం ఆర్థిక మంత్రి స్వయంగా లద్దాఖ్‌ను సందర్శించారు కూడా.

సూర్యుడిపై పరిశోధనల విషయంలో భారత్‌ సామర్థ్యం గట్టిదే. ప్రతిపాదిత టెలిస్కోపు కూడా ఆదిత్య ఎల్, ఉదయ్‌పూర్‌లోని మల్టీ అప్లికేషన్ సోలార్‌ టెలిస్కోపుల ద్వారా అందుతున్న సమాచారానికి సాయంగా నిలుస్తుంది. కొత్త టెలిస్కోపు నిర్మాణ వ్యయం దాదాపు రూ.3,500 కోట్లుగా లెక్కగట్టారు. అయితే ఐఐఏకు అదనపు బడ్జెట్‌ కేటాయింపులేవీ జరగలేదు. ఐఐఏ సహా డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ సైన్్సకు అనుబంధంగా ఉన్న 25 అటానమస్‌ సంస్థలకు ఈ ఏడాది బడ్జెట్‌లో దక్కింది రూ.1,623 కోట్లు మాత్రమే.

సాధారణ ప్రక్రియలో భాగమే!
రానున్న ఐదేళ్లలో రూ.10,000 కోట్లతో బయోఫార్మా ‘శక్తి’ కార్యక్రమాన్ని కూడా ఆర్థిక మంత్రి ప్రకటించారు. ఈ ప్రాజెక్టు ద్వారా బయలాజిక్స్, బయో సిమిలర్స్‌ తయారీ చేపడతారు. అయితే మంత్రి ప్రకటించిన మొత్తం... మూడు కొత్త ‘నేషనల్‌ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ ఫార్మాస్యూటికల్‌ ఎడ్యుకేషన్ అండ్‌ రీసెర్చ్‌’ (నైపర్‌)ల నిర్మాణానికీ, వీటికి అనుబంధంగా ఉన్న వెయ్యి అక్రిడి టెడ్‌ క్లినికల్‌ ట్రయల్స్‌కూ ఖర్చు చేస్తారు. ఈ రెండూ సాధారణ ప్రక్రి యల్లో భాగమే కానీ, బయోఫార్మాకు ప్రత్యేకమైనవి ఏమీ కాదు.

‘సెంట్రల్‌ డ్రగ్స్‌ స్టాండర్డ్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్’ను బలోపేతం చేస్తామని బడ్జెట్‌లో ప్రకటించారు. ఇది అవసరమే కానీ బయో ఫార్మా వ్యూహంలో దీన్ని భాగం చేయడం ఆశ్చర్యకరం. శక్తి కార్యక్ర మంలో భాగంగా కేటాయించిన పదివేల కోట్ల రూపాయల్లో నైపర్‌ లకు ఎంత, మిగిలిన వాటికి ఎంతెంత అన్న స్పష్టత లేదు. వాస్తవా నికి, శక్తి కార్యక్రమం 2017లో వరల్డ్‌ బ్యాంక్‌ సాయంతో  నేషనల్‌ బయోఫార్మా మిషన్లో భాగంగా 25 కోట్ల డాలర్లతో చేపట్టారు. దీని ద్వారా టీకాలు, బయోసిమిలర్లు, వైద్య పరికరాల తయారీ, పరిశో ధనలు చేయాలన్నది లక్ష్యం. 

హాట్‌ టాపికే కానీ...
బడ్జెట్‌ ప్రసంగంలో సెమీ కండక్టర్లు, రేర్‌ఎర్త్‌ మినరల్స్, ఏఐ వంటి వాటి ప్రస్తావన వచ్చినప్పటికీ ఏదీ గేమ్‌ఛేంజర్‌ స్థాయికి చేరలేదు. రేర్‌ ఎర్త్‌ పర్మనెంట్‌ మ్యాగ్నెట్స్‌ తయారీ కేంద్రం ఒకదాన్ని గత ఏడాది నవంబరులో ప్రారంభించామని ప్రకటించిన మంత్రి... ఒడిశా, కేరళ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రేర్‌ ఎర్త్‌ కారిడార్ల ఏర్పాటు చేసుకునేందుకు సహకరిస్తామని తెలిపారు. గతేడాది ప్రకటించిన నేషనల్‌ క్రిటికల్‌ మినరల్స్‌ మిషన్లో ఇవన్నీ భాగం కావడం గమనార్హం. 

కొన్నేళ్లుగా బడ్జెట్‌ ప్రసంగాల్లో తరచూ వినిపించిన ఇంకో ఆలోచన ‘అనుసంధాన్‌ నేషనల్‌ రిసెర్చ్‌ ఫౌండేషన్‌’. ఈసారి దీన్ని కేవలం ప్రస్తావనకు మాత్రమే పరిమితం చేశారు. ఐదేళ్లలో రూ. 50,000 కోట్లు కేటాయిస్తామని చెప్పినా గతేడాది రూ. 2,000 కోట్లు మాత్రమే కేటాయించారు. ఈ ఏడాది కేటాయింపులు కూడా అంతే మొత్తంలో ఉండటం గమనార్హం. 

గతేడాది ప్రకటించిన రిసెర్చ్, డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌(ఆర్డీఐ) స్కీమ్‌ ద్వారా ప్రైవేట్‌రంగ డీప్‌ టెక్‌ ప్రాజెక్టులకు వచ్చే ఏడేళ్లలో రూ.లక్ష కోట్లు అందాల్సి ఉండగా గతేడాది రూ.20,000 కోట్లు దక్కాయి. ఇందులో ఖర్చ య్యింది రూ. 3,000 కోట్లు మాత్రమే. కేంద్ర కేబినెట్‌ దీన్ని గత ఏడాది జూలైలో ఆమోదించడం ఇందుకు కారణం. నియమ నిబంధనలు కాస్తా నవంబరుకు కానీ పూర్తి కాలేదు.

కేటాయింపులో ఖర్చు చేసిన మొత్తం తక్కువైనా... అమలు తీరులో ఎన్నో లోపాలున్నా ఆర్‌డీఐకి జరిపిన కేటాయింపులను బట్టి చూస్తే... ప్రభుత్వం పరిశోధనలను ప్రైవేట్‌పరం చేసేందుకు నిర్ణ యించినట్టుగా కనిపిస్తోంది. ‘అనుసంధాన్‌’కు కేవలం రూ. 2,000 కోట్లే దక్కాయి. ఆర్‌డీఐకి ఇంతకు పది రెట్లు ఎక్కువ కేటాయించారు. ప్రభుత్వ పరిశోధన సంస్థలకు కేటాయింపులు తగ్గిపోగా... ప్రైవేట్‌ రంగానికి ఎక్కువయ్యాయి. ఇదేమంత మంచి పరిణామం కాదు.

-వ్యాసకర్త సైన్స్‌ అంశాల వ్యాఖ్యాత
-దినేశ్‌ సి. శర్మ

Advertisement
 
Advertisement
Advertisement