‘మున్సిపల్‌ ఎన్నికలు అవగానే ఇంటి పన్ను పెంపు’ | Minister Bandi Sanjay Key Comments On Property Tax | Sakshi
Sakshi News home page

‘మున్సిపల్‌ ఎన్నికలు అవగానే ఇంటి పన్ను పెంపు’

Feb 2 2026 9:42 PM | Updated on Feb 2 2026 9:42 PM

Minister Bandi Sanjay Key Comments On Property Tax

సాక్షి, కరీంనగర్‌: కేంద్రమంత్రి బండి సంజయ్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో మున్సిపల్‌ ఎన్నికలు అయిపోగానే ఇంటి పన్ను పెంపునకు కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్లాన్‌ చేస్తోందన్నారు. ఆరు గ్యాంరటీలు అమలు చేయని కాంగ్రెస్‌కు మున్సిపల్‌ ఎన్నికల్లో ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు.

కరీంనగర్ కిసాన్ నగర్ ఎన్నికల ప్రచారంలో కేంద్రమంత్రి బండి సంజయ్ పాల్గొన్నారు. ఈ సందర్బంగా బండి సంజయ్‌ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌కు ఎందుకు ఓటు వేయాలి. రెండేళ్లలో మున్సిపాలిటీలు, కరీంనగర్ కార్పొరేషన్‌కు నయాపైసా ఇవ్వలేదు. బీఆర్ఎస్‌కు ఓటేస్తే డ్రైనేజీలో పడినట్టే. కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేని బీఆర్ఎస్ పైసలు ఎక్కడి నుండి తెస్తుంది?. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో అవినీతి, కబ్జాలతో దోచుకుతిన్నారు. పొరపాటున బీఆర్ఎస్ గెలిస్తే.. కమీషన్ల కోసం కేంద్ర నిధులను దారి మళ్లిస్తుంది.

కరీంనగర్‌లో జరిగిన అభివృద్ధి అంతా కేంద్ర నిధులతోనే జరిగింది. నేను పైసలు తీసుకొస్తే.. బీఆర్ఎస్ నేతలు సిగ్గు లేకుండా కొబ్బరికాయ కొట్టి మావేనని చెప్పుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ మేయర్ పీఠాన్ని బీజేపీకి అప్పగిస్తే మరిన్ని నిధులు తెచ్చే బాధ్యత నాది. కరీంనగర్ కోసం నేను తెచ్చిన నిధుల వివరాలు ఇవ్వడానికి నేను సిద్ధంగా ఉన్నా. గంగుల కమలాకర్‌ మూట ముల్లె సర్దుకుని కరీంనగర్ వదిలి వెళ్లిపో అని సంచలన వ్యాఖ్యలు చేశారు.

 

Advertisement
 
Advertisement
Advertisement