వాషింగ్టన్: అమెరికా ప్రభుత్వం హెచ్-1బీ(H-1B) వీసాల విషయంలో కీలక ప్రకటన చేసింది. 2027 ఆర్థిక సంవత్సరానికి హెచ్-1బీ వీసా రిజిస్ట్రేషన్ ష్యెడూల్‌ను విడుదలైంది. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తుల రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈ ఏడాది మార్చి 4 నుంచి ప్రారంభించనున్నట్టు పేర్కొంది. ఈ ప్రక్రియ మార్చి 20 వరకు కొనసాగుతుందని తాజాగా ఓ ప్రకటనలో వెల్లడించింది.
వివరాల మేరకు.. హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తుల ప్రక్రియ మార్చి నాలుగో తేదీన మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానున్నాయి. మార్చి 19వ తేదీ మధ్యాహ్నం వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులకు అవకాశం కల్పించారు. లాటరీలో మెరిట్, అధిక వేతనం ఉన్న వారికి టాప్ ప్రయారిటీ ఇవ్వనున్నారు. నైపుణ్యం ఆధారిత వెయిటెడ్ సెలక్షన్ పద్దతిని ట్రంప్ సర్కార్ అమలు చేయనుంది. ఇదే సమయంలో మల్టిపుల్ రిజిస్ట్రేషన్ల మోసాలకు యూఎస్‌సీఐఎస్ చెక్ పెట్టే విధంగా చర్యలు తీసుకుంటున్నారు. మార్చి 31, 2026 నాటికి ఎంపికైన వారి వివరాలను వెల్లడించనున్నారు. ఈ లాటరీ ద్వారా ఎంపికైనవారు 2027 వీసా కింద అక్టోబర్ 1 నుంచి అమెరికాలో పని చేయవచ్చు. ప్రస్తుతం చాలా మంది భారతీయ ఇంజినీర్లు, ఐటీ ప్రొఫెషనల్స్ వీసా లాటరీ కోసం ఎదురుచూస్తున్నారు.
ఇదిలా ఉండగా.. హెచ్-1బీ వీసాల విషయంలో ట్రంప్ ప్రభుత్వం కీలక మార్పులు చేసింది. వీసా లాటరీ విధానంలో ఒకే వ్యక్తికి ఒకే యజమాని ద్వారా ఒక్క రిజిస్ట్రేషన్ మాత్రమే చెల్లుబాటు అవుతుంది. ఒకే యజమాని ఒక ఉద్యోగి పేరుతో అనేక రిజిస్ట్రేషన్లు చేస్తే అవన్నీ రద్దు చేస్తారు. కాగా మొత్తం H-1B వీసాలు 85,000 మాత్రమే ఉండగా.. ఇందులో 65,000 వీసాలు సాధారణ కేటగిరీకి, మరో 20,000 వీసాలు అమెరికాలో మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసిన వారికి కేటాయించారు. ఈ వీసాకు అర్హులైనవారు బ్యాచిలర్ డిగ్రీ లేదా దానికి సమానమైన అర్హత కలిగి ఉండాలి. అలాగే అమెరికాలో స్పెషలైజ్డ్ జాబ్ ఆఫర్ ఉండాలి. ఈ రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉద్యోగి కాకుండా ఉద్యోగం ఇచ్చే కంపెనీ లేదా యజమాని చేయాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఫీజు కేవలం 10 డాలర్లు మాత్రమే అయినా.. లాటరీలో సెలెక్ట్ అయితే వీసా ఫీజులు, ఇతర ఖర్చులు ఎక్కువగా ఉంటాయి.


