నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌ , వీడియో వైరల్‌ | helicopter crashes while landing in Eastern Nepal at Khotang | Sakshi
Sakshi News home page

నేపాల్‌లో కుప్పకూలిన హెలికాప్టర్‌ , వీడియో వైరల్‌

Mar 18 2026 3:41 PM | Updated on Mar 18 2026 4:06 PM

helicopter crashes while landing in Eastern Nepal at Khotang

డెడ్‌ బాడీని తరలిస్తుండగా ప్రమాదం, ఒకరికి గాయాలు

సాయం కోసం బయలుదేరిన మరో హెలికాప్టర్‌ 

ఖాట్మాండు : తూర్పు నేపాల్‌లోని ఖోటాంగ్ జిల్లాలో  ఘోర  ప్రమాదం చోటు చేసుకుంది. బుధవారం హెలికాప్టర్ ల్యాండింగ్ సమయంలో హెలికాప్టర్ కూలిపోయిన ఘటన కలకలం రేపింది. ఈ ప్రమాదంలో ఒకరు గాయపడినట్టు తెలుస్తోంది. బలమైన గాలులు లేదా ల్యాండింగ్ సమయంలో పేరుకుపోయిన దుమ్ము కారణంగా ఇది కూలిపోయి ఉండవచ్చని అనుమానిస్తున్నారు.

ఈ ఘోర ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వెలుగులోకి వచ్చాయి. కొండ ప్రాంతంలో హెలికాప్టర్ ల్యాండ్ చేసేందుకు ప్రయత్నిస్తుండగా, అది అకస్మాత్తుగా బోల్తా పడింది. పల్టీలు కొడుతూ చివరకు దాని తోక భాగం ఒక పర్వత గోడను ఢీకొట్టడంతో హెలికాప్టర్ ముక్కలై పోయింది. 

ఎయిర్ డైనాస్టీకి చెందిన ఈ హెలికాప్టర్, ఖాఠ్మండు నుండి ఐదుగురు ప్రయాణికులతో కలిసి ఒక మృతదేహాన్ని తరలిస్తుండగా పొలంలో కూలి పోయిందని అధికారులు ప్రకటించారు. అయితే ఎలాంటి ప్రాణనష్టం జరగ లేదనీ,  మరిన్ని వివరాలు తెలియాల్సి ఉందని ఖోటాంగ్ జిల్లా ముఖ్య అధికారి రేఖా కండెల్ తెలిపారు.

 

హెలికాప్టర్‌లోని ఒక ప్రయాణికుడు గాయపడగా, పైలట్ సబిన్ థాపా, ఇతర ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారని హెలికాప్టర్ కంపెనీ వెల్లడించింది. గాయపడిన వ్యక్తికి సాయం చేసేందుకు అదనపు హెలికాప్టర్‌ను పంపించామని తెలిపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement