NTR
-
ఏపీ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఇంటర్మీడియట్ మొదటి, రెండో సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్ బోర్డు విడుదల చేసింది. ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు 2025 మార్చి 1 నుంచి ప్రారంభమవుతాయి. మార్చి 1 నుంచి మార్చి 19 వరకు ఇంటర్ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించనున్నారు.వచ్చే ఏడాది మార్చి 3 తేదీ నుంచి మార్చి 20 వరకు ఇంటర్ రెండో సంవత్సరం పరీక్షలు జరుగుతాయి. ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ఫిబ్రవరి 10 నుండి 20 వరకు నిర్వహించనున్నారు. -
ఏపీ టెన్త్ పరీక్షల షెడ్యూల్ విడుదల
సాక్షి, విజయవాడ: ఏపీలో పదో తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. ఎక్స్ వేదికగా పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ విడుదల చేశారు. వచ్చే ఏడాది మార్చి 17 నుంచి 31 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహించనున్నారు. మార్చి 17న ఫస్ట్ లాంగ్వేజ్, 19న సెకండ్ లాంగ్వేజ్, మార్చి 21న ఇంగ్లీష్, 24న గణితం, 26న ఫిజిక్స్, మార్చి 28న బయాలజీ, 29న ఒకేషనల్, మార్చి 31న సోషల్ స్టడీస్ పరీక్షలు జరపనున్నారు. -
ఏపీ పోలీసులపై హైకోర్టు సీరియస్
సాక్షి, విజయవాడ: హెల్మెట్ నిబంధన అమలు చేయకపోవడంపై ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు హెల్మెట్ ధరించక 667 మంది చనిపోయారని పిటిషనర్ పేర్కొన్నారు. హెల్మెట్ నిబంధన ఎందుకు అమలు చేయడం లేదంటూ పోలీసులను హైకోర్టు ప్రశ్నించింది.ఈ మరణాలకు ఎవరు బాధ్యత వహిస్తారంటూ హైకోర్టు సీరియస్ అయ్యింది. రవాణా శాఖ కమిషనర్‌ను సుమోటోగా ఇంప్లీడ్ చేసిన హైకోర్టు.. వారంలోగా కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. విచారణను వచ్చే వారానికి కోర్టు వాయిదా వేసింది.ఇదీ చదవండి: అక్రమ నిర్బంధాలపై హైకోర్టు ఆరా.. ఖాకీలపై ఆగ్రహం -
‘రైతులను ముంచేసిన కూటమి సర్కార్’
సాక్షి, విజయవాడ: కూటమి ప్రభుత్వం రైతులను అన్ని రకాలుగా ముంచేసిందని ఎన్టీఆర్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షులు దేవినేని అవినాష్ మండిపడ్డారు. ఈ నెల 13వ తేదీన రైతుల సమస్యలపై కలెక్టర్‌కు వినతిపత్రం అందిస్తామని తెలిపారు. ఆ పార్టీ కార్యాలయంలో బుధవారం.. ‘అన్నదాతకు అండగా’ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట ఇంఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, డిప్యూటీ మేయర్ బెల్లందుర్గ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ, వైఎస్ జగన్ రైతుల కోసం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పెట్టుబడి సాయం అందించారు. కూటమి అధికారంలోకి వచ్చాక ఆర్బీకే సెంటర్లు లేకుండా పోయాయి. రైతుల కోసం బడ్జెట్లో ప్రస్తావించకుండా కూటమి సర్కార్ మోసం చేసింది. సూపర్ సిక్స్‌లో చెప్పిన పెట్టుబడి సాయం గురించి కూటమి నేతలు మాట్లాడటం లేదు. కనీస మద్దతు ధర కూడా రైతుకు దక్కకుండా చేస్తున్నారు’’అని అవినాష్ నిలదీశారు.దయనీయ స్థితిలో రైతులుతన్నీరు నాగేశ్వరరావు మాట్లాడుతూ, రైతులకు కనీసం గోనె సంచులు కూడా అందించడం లేదని మండిపడ్డారు. ధాన్యం రవాణాకు జీపీఎస్ ఉన్న వాహనాలు ఉండాలని నిబంధన పెట్టారు. గతంలో సబ్సిడీపై రైతులకు టార్పాలిన్ పట్టాలిచ్చేవారు. ఈ కూటమి ప్రభుత్వం టార్పాలిన్ పట్టాలు కూడా ఇవ్వలేని స్థితిలో ఉంది. రైతులు దయనీయమైన స్థితిలో దళారులకు ధాన్యం అమ్ముకోవాల్సి వస్తుంది’’ అని మండిపడ్డారు.రైతులంటే చంద్రబాబుకు చిన్నచూపువిజయవాడ మేయర్ రాయన భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, కళ్లాల్లో ఎక్కడి ధాన్యం అక్కడే ఉంది. రైతు భరోసా కేంద్రాలను నిర్వీర్యం చేశారు. ధాన్యం రంగుమారిపోతున్నా కొనడం లేదు. రైతులంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. రైతులను మోసం చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది’’ అని ఆమె ధ్వజమెత్తారు. -
శబరిమలకు మరికొన్ని ప్రత్యేక రైళ్లు
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): శబరిమలలో అయ్యప్పస్వామిని దర్శించుకునే భక్తుల సౌకర్యం కోసం ఇప్పటికే నడుస్తున్న కొన్ని ప్రత్యేక రైళ్లతో పాటు అదనంగా మరికొన్ని రైళ్లను నడపనున్నట్లు రైల్వే అధికారులు ప్రకటించారు. కాకినాడ పోర్టు–కొల్లం (07173) ఈనెల 11, 18, 25 తేదీల్లో బుధవారం రాత్రి 11.50 గంటలకు కాకినాడ పోర్టులో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07174) ఈనెల 13, 20, 27 తేదీల్లో శుక్రవారం ఉదయం 8.40 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. సికింద్రాబాద్–కొల్లం (07175) ఈనెల 19, 26 తేదీల్లో గురువారం రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయలుదేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఈ రైలు (07176) ఈనెల 21, 28 తేదీల్లో శనివారం ఉదయం 5 గంటలకు కొల్లంలో బయలుదేరుతుంది. -
పొమ్మనలేక పొగ!
ఏక కాలంలో లక్షన్నర ప్రభుత్వ ఉద్యోగాలు.. అది కూడా తామున్న ప్రాంతంలోనే.. విద్యార్హతలు, సామర్థ్యాన్ని బట్టి విధులు.. జీవితం మూడు పువ్వులు.. ఆరు కాయలు.. ఇది గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి.సీన్ కట్ చేస్తే.. గడచిన సార్వత్రిక ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కూటమి సర్కారు వీరిని పొమ్మనలేక పొగ పెడుతున్నట్లుగా వ్యవహరిస్తోంది. తీవ్రమైన పని ఒత్తిడి, అవమానాల నడుమ విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. ముఖ్యంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్ల తిప్పలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి.గుడ్లవల్లేరు: కూటమి సర్కారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను చిన్న చూపు చూస్తోంది. వారి విద్యార్హతలు, సామర్థ్యాన్ని బట్టి కాక ఇష్టానుసారంగా విధులు కేటాయిస్తూ వారితో చెడుగుడు ఆడుకుంటోంది. ముఖ్యంగా జిల్లాలో 310 మంది ఇంజినీరింగ్ అసిస్టెంట్(ఈఏ)లు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. వీరికి ఒక ఉద్యోగానికి జీతం ఇచ్చి.. వంద రకాల పనులను చేయిస్తూ.. కనీస ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న విమర్శలు వస్తున్నాయి. దీని కారణంగా పలు అభివృద్ధి పనులపై వీరు క్షేత్రస్థాయి పర్యవేక్షణ ఉంచలేకపోతున్నారు. ఫలితంగా నిబంధనలు పక్కదారి పట్టించి, అధికార పార్టీల నేతలు తమ పబ్బం గడుపుకునేందుకు పావులు కదుపుతున్నారన్న విమర్శలు వస్తున్నాయి.జల్‌జీవన్ బాధ్యత..జిల్లాలో జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టిన రూ.50.19 కోట్ల విలువైన పనుల బాధ్యతను ఈఏలకే అప్పగించారు. ఆర్‌డబ్ల్యూఎస్‌లో ఏఈల కొరత అధికంగా ఉండేసరికి పూర్తిగా జిల్లాలోని ఈ పనులపై ఇంజినీరింగ్ పర్యవేక్షణ బాధ్యతలను ఈఏలే చూస్తున్నారు.రోడ్ల పనులు కూడా..జాతీయ ఉపాధి హామీ నిధులతో పల్లె పండుగ పేరిట జిల్లాలో సంక్రాంతికి పూర్తి చేయాలని లక్ష్యంగా సీసీ రోడ్ల నిర్మాణ పనులు నిర్వహిస్తున్నారు. జిల్లాలో ఉపాధి నిధులు రూ.15,537.59లక్షలతో 1,964పనులను చేపట్టవలసి ఉంది. కేవలం 30శాతం పనులనే పూర్తి చేసినట్లు ఉన్నతాధికారులు చెబుతున్నారు. ఈ రోడ్ల నిర్మాణాల పనులను సైతం పీఆర్ ఏఈలు ఉన్నా.. గ్రామాల్లోని ఇంజినీరింగ్ అసిస్టెంట్లే చూస్తున్నారు.హౌసింగ్‌లో సైతం..గత వైఎస్సార్ సీపీ పాలనలో జిల్లాకు 88,438 ఇళ్లు మంజూరయ్యాయి. జిల్లాలోని హౌసింగ్ ఏఈలు దాదాపుగా రిటైర్మెంట్ అయిపోయి నలుగురే మిగిలారు. ఆ ఏఈల స్థానంలో సీనియర్ వర్క్ ఇన్స్పెక్టర్లతో పాటు ఇంజినీరింగ్ అసిస్టెంట్లను నియమించి వారితో పనులు చేయించుకుంటున్నారు. ప్రభుత్వం రిక్రూట్ చేయకుండా ఇంజినీరింగ్ అసిస్టెంట్లకు పని భారం పెంచేసింది. తమ గ్రామ స్థాయి విధులతో పాటు మండల స్థాయిలో హౌసింగ్ పనులను పర్యవేక్షించటం సాధ్యం గాక గృహ నిర్మాణ పనులు పడకేస్తున్నాయి. తమ శాఖలో ఏఈలు ఉద్యోగ విరమణ చేయటం వల్ల నలుగురు తప్ప మిగిలిన పోస్టులు ఖాళీగా ఉన్నమాట వాస్తవమేని జిల్లా హౌసింగ్ పీడీ ఎస్.వెంకట్రావు వివరణ ఇచ్చారు.టాయిలెట్ల పనులన్నీ..జిల్లాలో సర్వశిక్ష అభియాన్ నిధులు రూ.60.48 లక్షలతో అంగన్వాడీల వద్ద మరుగుదొడ్లను నిర్మిస్తున్నారు. ఒక్కో టాయిలెట్‌కు రూ.36 వేలను వెచ్చిస్తూ.. 168 టాయిలెట్స్‌ను నిర్మిస్తున్నారు. వీటి పర్యవేక్షణ బాధ్యతను కూడా ఇంజినీరింగ్ అసిస్టెంట్లే చూస్తున్నారు. ఎస్ఎస్ఏ ఏఈలు ఉన్నా.. వారికి పట్టకుండా ఇంజినీరింగ్ అసిస్టెంట్లతోనే పర్యవేక్షణ విధులను చేయించుకుంటున్నారు. ఇన్ని పనులు తమ భుజ స్కంధాలపై వేసుకొని చేస్తున్న ఈఏలకు కనీస మర్యాద దొరకడం లేదని తెలుస్తోంది. వేధింపులు, ఛీత్కారాలు మధ్య విధులు నిర్వర్తించాల్సి వస్తోంది. కూటమి నాయకుల కనుసన్నల్లోనే పనులు జరుగుతున్నాయని, వాటిల్లో నాణ్యత కూడా సక్రమంగా ఉండటం లేదని విమర్శలు వస్తున్నాయి.విద్యార్హతలు, సామర్థ్యాన్ని బట్టి కాక ఇష్టానుసారంగా విధులు వలంటీర్ల విధులన్నీ ఉద్యోగులకు కేటాయింపు ప్రధానంగా ఇంజినీరింగ్ అసిస్టెంట్లపై తీవ్ర పని ఒత్తిడి అవమానాలు, ఛీత్కారాల మధ్య భారంగా విధులువెట్టి చాకిరి ఇలా..కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఈఏలచే పింఛన్లు పంపిణీ చేయించారు.వంద రోజుల కూటమి ప్రభుత్వ పాలనపై ఇది మంచి ప్రభుత్వం పేరిట కార్యక్రమాలను నిర్వహించి ఇంటింటికీ తిరిగి స్టిక్కర్లు, కరపత్రాల పంపిణీ చేయించారు.ప్రభుత్వ పాఠశాలల్లో మరుగుదొడ్ల పరిశుభ్రతపై రెండు రోజులకు ఒకసారి పరిశీలన చేసి యాప్‌లో నమోదు చేయాలి.చెత్తను బండ్లకు పారిశుద్ధ్య కార్మికులు ఎత్తేటపుడు పర్యవేక్షించాలి.జియో ట్యాగింగ్‌లో ఇబ్బందులెన్నో..ప్రభుత్వ ఆదేశాల మేరకు సచివాలయ ఉద్యోగులతో పాటు ఈఏలు ఇంటింటికీ తిరిగి జియో ట్యాగింగ్ సర్వే నిర్వహిస్తున్నారు. ఎంప్లాయీస్ మొబైల్ అప్లికేషన్ పేరిట వచ్చిన యాప్‌లో ప్రతి ఇంటినీ ఫొటో తీసి జియో ట్యాగింగ్ చేసి ఆధార్ నంబర్ అప్లోడ్ చేయాలి. ఆయా సచివాలయాల పరిధిలోని గృహాల సంఖ్యకు అనుగుణంగా లక్ష్యాలు ఇచ్చారు. సర్వే సమయంలో గృహ యజమాని తప్పనిసరిగా బయో మెట్రిక్ లేదా.. ఫేషియల్ అథంటిఫికేషన్ ఇవ్వాలి. పలు చోట్ల నెట్వర్క్ పని చేయక.. సిగ్నల్స్ రాక యాప్ ఓపెన్ కానందున ఉద్యోగులు పడే ఇబ్బందులు వర్ణనాతీతం. ఒకవైపు టార్గెట్ల పేరుతో వస్తున్న తీవ్ర ఒత్తిళ్ల కారణంగా పలువురు సచివాలయ ఉద్యోగులు సెలవు పెట్టి ఇతర ఉద్యోగాల కోసం వెతుక్కుంటున్నట్లు తెలుస్తోంది. -
నిత్యాన్నదానానికి రూ. లక్ష విరాళం
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): విజయవాడ మొగల్రాజపురానికి చెందిన పసుమల్లి శ్రావణి, ఓం ప్రకాష్ కుటుంబం మంగళవారం అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేసింది. ఈ సందర్భంగా ఆలయ అధికారులను కలిసి అమ్మవారి నిత్యాన్నదాన పథకానికి రూ. 1,00,116 విరాళాన్ని అందజేసింది. దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించగా, వేద పండితులు ఆశీర్వచనం అందించారు. ఆలయ సిబ్బంది దాతలకు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను బహూకరించారు. ఉర్దూ పాఠశాల తనిఖీ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): భవానీపురంలోని ఉర్దూ పాఠశాలను మంగళవారం నేషనల్ మైనార్టీ కమిషన్ సభ్యుడు సయ్యద్ షహజాది ఆకస్మిక తనిఖీ చేశారు. విద్యార్థులతో మాటామంతీ కార్యక్రమం నిర్వహించారు. పాఠ శాలలను తనిఖీ చేసిన వారిలో సర్వే కమిషనర్ ఆఫ్ వక్ఫ్ షేక్ షేరీన్ బేగం, ఉమ్మడి కృష్ణా జిల్లా మైనారిటీ సంక్షేమశాఖ అధికారి అబ్దుల్ రబ్బాని, పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు. అంబాసిడర్లుగా స్ఫూర్తి నింపాలి గ్రామ, వార్డు సచివాలయ కార్యదర్శులతో ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ లక్ష్మీశ గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రధాన మంత్రి సూర్య ఘర్ ముఫ్త్ బిజిలీ యోజన (సౌర విద్యుత్) పథకం అమలుకు అంబాసిడర్లుగా ప్రజల్లో స్ఫూర్తి నింపి, లబ్ధిదారులుగా రిజిస్ట్రేషన్ చేసుకొనేలా ప్రోత్సహించాలని కలెక్టర్ డాక్టర్ జి.లక్ష్మీశ సచివాలయ కార్యదర్శులకు సూచించారు. మంగళవారం కలెక్టర్ గ్రామ, వార్డు సచివాలయాల కార్యదర్శులతో వర్చువల్‌గా సమావేశం నిర్వహించారు. తొలుత ఏపీసీపీడీసీఎల్ అధికారులు కార్యక్రమానికి సంబంధించిన విధివిధానాలు, ప్రయోజనాలను వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ గ్రామ, వార్డు సచివాలయాల ఉద్యోగులు తొలుత పథకం కింద లబ్ధి పొందేందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. అనంతరం తమ పరిధిలోని ప్రజలకు పథకంపై అవగాహన కల్పించాలన్నారు. విద్యుత్ శాఖ ఎస్ఈ ఎ.మురళీమోహన్, నోడల్ అధికారి ఎం.భాస్కర్ పాల్గొన్నారు. చెక్ పోస్ట్ వద్ద నిఘా పెంచాలి జగ్గయ్యపేట అర్బన్: పట్టణంలోని తొర్రగుంటపాలెంలో ఉన్న ఎకై ్సజ్ స్టేషన్‌ను, గరికపాడు అంతర్రాష్ట్ర సరిహద్దు చెక్‌పోస్టులను ఎకై ్సజ్ కమిషనర్ నిశాంత్, ఎన్పోర్స్మెంట్ డైరెక్టర్ శర్మతో కలిసి మంగళవారం సందర్శించారు. తెలంగాణ నుంచి అక్రమంగా వచ్చే మద్యాన్ని నియంత్రించడంలో కట్టుదిట్టంగా వ్యవహరించాలని ఆదేశించారు. అలాగే చెక్‌పోస్టు వద్ద నిఘాను పెంచాలని ఎకై ్సజ్ అధికారులకు వారు సూచించారు. మద్యం అమ్మకాలపై వారు సంతృప్తి వ్యక్తం చేశారు. వారి వెంట ఎకై ్సజ్ డీసీ శ్రీనివాస్, ఏఈఎస్ స్థానిక అధికారులు ఉన్నారు. స్కేటింగ్ పోటీల్లో జంక్షన్ చిన్నారికి స్వర్ణం హనుమాన్‌జంక్షన్ రూరల్: కృష్ణాజిల్లా హనుమాన్ జంక్షన్‌కు చెందిన చిన్నారి అన్విత జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో స్వర్ణ పతకం సాధించింది. డాక్టర్ పోలవరపు కల్యాణ చక్రధర్, డాక్టర్ స్వరాజ్యం దంపతుల కుమార్తె అన్విత ఇటీవల తమిళనాడులోని కోయంబత్తూరులో ఇన్లైన్ హాకీ కేడెట్స్ ఆధ్వర్యంలో జరిగిన 62వ నేషనల్ స్కేటింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో సత్తా చాటింది. అండర్–11 కేటగిరీలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచి బంగారు పతకాన్ని కై వసం చేసుకుంది. -
ఏరివేతే లక్ష్యం!
భవానీపురం(విజయవాడపశ్చిమ): పింఛన్ల తనిఖీ ప్రక్రియ తీరు చూస్తుంటే కొందరి ఏరివేతే లక్ష్యంగా కనిపిస్తోంది. ముఖ్యంగా గత ప్రభుత్వంలో ఐదేళ్లపాటు పింఛన్ తీసుకుంటున్నవారి పేర్లు తొలగించేందుకే ప్రభుత్వం ఇప్పుడు సర్వే నిర్వహిస్తోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ జిల్లాలో పెన్షన్ల తనిఖీకి పైలెట్ ప్రాజెక్ట్‌గా విజయవాడ అర్బన్ పరిధిలోని భవానీపురం కరకట్ట రోడ్‌లోని 121వ సచివాలయాన్ని కలెక్టర్ లక్షీశ గుర్తించారు. ఈ క్రమంలో మంగళవారం ఈ సచివాలయ పరిధిలో 378 మంది పెన్షనర్లు ఉండగా 9 బృందాలను ఏర్పాటు చేసి ఒక్కో బృందానికి 42 మంది పెన్షనర్లను పరిశీలించే బాధ్యతను అప్పగించారు. ఒక్కో బృందానికి ఎంత మంది ఉంటారనేది స్పష్టత లేదు. జిల్లాలోని వివిధ మండలాల నుంచి ఎంపీడీఓలు పాల్గొన్నారు. వ్యంగ్యంగా.. స్పెషల్ ఆఫీసర్‌గా వచ్చిన నందిగామ మున్సిపల్ కమిషనర్ ఈవీ రమణబాబు వ్యవహార శైలి పింఛన్‌దారులకు బాధ కలిగించింది. వారిపై కస్సుబుస్సులాడటంతో వారు చిన్నబుచ్చుకున్నారు. ‘ఇంటి పన్ను ఉందా?’ ‘లేదు సార్.. అద్దెకు ఉంటున్నాం..’ ‘అయితే అద్దె చెల్లించిన రశీదు చూపించండి. అప్పుడే మీ పింఛన్ పునరుద్దరిస్తాం’ అంటూ సీరియస్‌గా వార్నింగ్ ఇచ్చారు. ఇటీవల సంభవించిన బుడమేరు వరద కారణంగా మునిగిన ఇంటిని ఖాళీ చేసి రెండు మూడు ఇళ్ల అవతల మేడపై అద్దెకు ఉంటున్న మహిళా పింఛన్‌దారుల ఆధార్ కార్డ్ చూసి డోర్ నంబర్ తేడాపై అసహనం వ్యక్తం చేశారు. తమను చూసేవారు ఎవరూ లేరని, పింఛనే ఆధారమని కన్నీరు పెట్టుకున్న వృద్ధ మహిళలను ఉద్దేశించి ‘ఏమిటో ప్రతి ఒక్కరూ వెనుక ముందూ లేనివారే ఉంటున్నారు’ అంటూ వెటకారం చేయగా వారు కన్నీటి పర్యంతం అయ్యారు. మొత్తం మీద మసీదు వీధిలో ఆయన చేసిన తనిఖీపై పింఛన్‌దారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. పింఛన్ తొలగిస్తే తాము ఎలా బతకాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాసాంజనేయస్వామి వీధిలో ఒక బృందం చెట్టు నీడన ఉండి పింఛన్‌దారులను అక్కడికి పిలిపించి తనిఖీ చేశారు. రెండు వీధుల అవతల ఉంటున్నవారు పరుగులు పెడుతూ అక్కడికి చేరుకుని తనిఖీ చేయించుకున్నారు. ఒక బృందం కరెంట్ బిల్లులు, రేషన్ కార్డ్‌లు తనిఖీ చేసి ఫొటోలు తీసుకున్నారు. మరో బృందం ఇంటి పన్నులు, పింఛన్‌దారులు అర్హులేనా.. అక్కడే ఉంటున్నారా వంటి అంశాలను తనిఖీ చేశారు. సామాజిక పింఛన్ల తనిఖీ పైలెట్ ప్రాజెక్టు ప్రారంభం లబ్ధిదారులపై కస్సుబుస్సుమన్న నందిగామ మున్సిపల్ కమిషనర్ కన్నీరు పెట్టుకున్న పింఛన్‌దారులు అద్దె చెల్లిస్తున్న రశీదు, ఇంటి పన్ను ఉంటేనే పింఛన్ -
త్వరలో క్రిస్మస్ కానుక
రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి వీరాంజనేయ స్వామి సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఎస్సీ సంక్షేమ పథకాలన్నీ అర్హులైన వారికి అందిస్తామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి శ్రీ డోలా బాల వీరాంజనేయ స్వామి తెలిపారు. విజయవాడ నాల్గో డివిజన్ వరలక్ష్మి నగర్లో రూ.80 లక్షలతో నిర్మించిన కమ్యూనిటీ హాలును మంత్రి మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారంలోకి వచ్చిన ఐదు నెలల్లోనే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులతో ప్రారంభించిన కమ్యూనిటీ హాల్స్‌ను జనరల్ నిధులతో పూర్తి చేసి ప్రారంభించడం ఎంతో సంతోషంగా ఉందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అసంపూర్తిగా ఉన్న కమ్యూనిటీ హాల్స్‌ను త్వరితగతిన పూర్తి చేస్తామన్నారు. త్వరలోనే రాష్ట్రంలోని క్రిస్టియన్స్ అందరికీ క్రిస్మస్ కానుక అందిస్తామన్నారు. అంబేడ్కర్ విదేశీ విద్యా దీవెన పథకాన్ని పునరుద్ధరిస్తామన్నారు. రాష్ట్రంలో రూ.340 కోట్లతో ప్రభుత్వ సంక్షేమ నూతన వసతి గృహాలను నిర్మిస్తామన్నారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా డిసెంబర్, జనవరి నెలలోనే రుణాలు అందిస్తామన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తదితరులు పాల్గొన్నారు. -
యువత ఉన్నతంగా ఎదగాలి
వన్‌టౌన్(విజయవాడపశ్చిమ): యువత లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనకు పాటుపడాలని రాష్ట్ర గనులు, ఎకై ్సజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో కృష్ణా తరంగ్ – 2024 అంతర కళాశాలల యువజనోత్సవం మంగళవారం విజయవాడలోని కేబీఎన్ కళాశాలలో ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ యువజనోత్సవాలను మంత్రి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో మంత్రి కొల్లు మాట్లాడుతూ యువతలోని ప్రతిభాపాటవాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తోందన్నారు. ఈ ఉత్సవాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తోందన్నారు. ఈ క్రమంలోనే స్కిల్ సెన్సెస్కు శ్రీకారం చుట్టిందన్నారు. యువతలోని నైపుణ్యాలు ఏంటనేవి నమోదు చేసి, ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా, సుస్థిర ఉపాధి అవకాశాలు మెరుగుపరుచుకునేందుకు తగిన నైపుణ్యాలు పెంపొందించేలా కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో ఏపీ మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, విశ్వవిద్యాలయం వైస్ చాన్స్‌లర్ (ఇన్చార్జ్) ఆచార్య ఆర్. శ్రీనివాసరావు, రెక్టార్ ఆచార్య ఎంవీ బసవేశ్వరరావు, రిజిస్ట్రార్ డాక్టర్ కె. శోభన్‌బాబు, కృష్ణా తరంగ్ కన్వీనర్ డాక్టర్ ఎం. కోటేశ్వరరావు, కళాశాల కార్యదర్శి టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. తొలి రోజు పాశ్చాత్య బృందగానం, శాసీ్త్రయ వోకల్ సోలో, క్విజ్, మెహింది, జానపద బృంద వాద్యం, శాసీ్త్రయ నాట్యం, శాసీ్త్రయ వాద్యం, కార్టినింగ్ అంశాల్లో పోటీలు జరిగాయి. రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభమైన కృష్ణా తరంగ్–2024 -
టెక్ ఫెస్ట్‌లతో సృజనాత్మకత
మొగల్రాజపురం(విజయవాడ తూర్పు): యువతలో ఉన్న ఆలోచనా శక్తిని పెంపొందించేందుకు ఇలాంటి టెక్‌ఫెస్ట్‌లు ఎంతగానో దోహదం చేస్తాయని ఎమ్మెల్సీ పి.అశోక్‌బాబు చెప్పారు. విజయవాడ రమేష్ ఆస్పత్రి రోడ్డులో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఆవరణలో జరుగుతున్న రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024ను అశోక్‌బాబు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వారు చదువుకున్న అంశాలకు వారిలో ఉన్న తెలివితేటలను జోడించి మంచి ప్రాజెక్టులను రూపొందించారన్నారు. కొత్త ఆవిష్కరణలు చిన్నవిగానే మొదలైన తర్వాతే మల్ట్టీనేషనల్ కంపెనీ స్థాయికి ఎదుగుతాయని చెప్పారు. విద్యార్థిలో ఉన్న ఆలోచనలే వారిలో నైపుణ్యాలను పెంచుతాయన్నారు. రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024 కన్వీనర్ ఎం.విజయ సారథి మాట్లాడుతూ ఇక్కడ బహుమతులు పొందిన ప్రాజెక్టు నమూనాలు జనవరి 6, 7, 8 తేదీల్లో జరిగే రాష్ట్ర స్థాయి టెక్ఫెస్ట్కు ఎంపిక అవుతాయన్నారు. విజేతలు వీరే.. సాయంత్రం జరిగిన ముగింపు సభకు స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్ (స్పా) కళాశాల డైరెక్టర్ సి.రమేష్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టు నమూనాలను సందర్శించి వారిని అభినందించారు. రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024లో మొదటి బహుమతి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన మెకానికల్ విభాగం విద్యార్థులు తయారు చేసిన ప్రొటైపింగ్ అండ్ ప్రొడక్ట్ డెవలప్మెంట్ ఆన్ 3డీ ప్రింటింగ్ ప్రాజెక్టు నమూనాకు వచ్చింది. రెండో బహుమతి విజయవాడ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ఈసీఈ విభాగం విద్యార్థులు తయారు చేసిన ఆటోమేటెడ్ స్మార్ట్ స్ట్రీట్ లైట్ ఇన్టెన్సిటీ కంట్రోలర్ ప్రాజెక్టు నమూనాకు లభించింది. మొదటి బహుమతి ఎంపికై న ప్రాజెక్టును రూపొందించిన విద్యార్థులకు రూ.25వేల చెక్కు, రెండో బహుమతిగా ఎంపికై న ప్రాజెక్టును తయారు చేసిన వారికి రూ.10 వేల చెక్కును అతిథులు అందజేశారు. ఎమ్మెల్సీ అశోక్‌బాబు, స్పా కళాశాల డైరెక్టర్ రమేష్ ముగిసిన రీజనల్ పాలిటెక్ ఫెస్ట్–2024 -
ఆదివాసీల అణచివేతను ఖండించాలి
విజయవాడ సదస్సులో వక్తల పిలుపు గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ఆదివాసీలు, గిరిజనులపై జరుగుతున్న అణచివేతను ఖండించాలని వక్తలు పిలుపునిచ్చారు. మంగళవారం విజయవాడ గాంధీనగర్‌లోని హనుమంతరాయ గ్రంథాలయంలో ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ వేదిక ఉభయ తెలుగు రాష్ట్రాల కమిటీ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ‘ఆదివాసీలు –హక్కులు–భారత రాజ్యాంగం‘ అనే అంశంపై సదస్సు జరిగింది. పాల్గొన్న మాజీ మంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు మాట్లాడుతూ దేశంలోని సహజ సంపదను అదానీ, అంబానీలకు దోచిపెట్టేందుకు ఆదివాసీలను అణచివేస్తున్నారన్నారు. అభివృద్ధిలో ఆదివాసీలకు వాటా దక్కడం లేదన్నారు. విరసం నాయకుడు పాణి మాట్లాడుతూ మూలవాసీ బచావో నిషేధం విధించడానికి గల కారణాలను బహిర్గతం చేయాలన్నారు. ఏపీ సీఎల్సీ కార్యదర్శి చిలుకా చంద్రశేఖర్ మాట్లాడుతూ దండకారణ్యంలో ఆదివాసీలపై జరుగుతున్న అణచివేత, మానవ హక్కుల హననాన్ని వివరించారు. నిర్భంధాన్ని ప్రతి ఒక్కరూ ఖండించాలన్నారు. ఆల్ ఇండియా ట్రైబల్ ఫోరం నాయకులు ముక్తి సత్యం, ఎస్ డానీ, సిద్ధార్థ దొర మాట్లాడుతూ అదానీ, అంబానీల కోసం ఆదివాసీల చట్టాలకు సవరణలు చేస్తున్నారన్నారు. ఖనిజ సంపదను దోచిపెట్టేందుకే చట్టాలు అనుకూలంగా సవరించుకుంటున్నారన్నారు. సదస్సులో ఏపీసీఎల్సీ ఉపాధ్యక్షుడు టి.ఆంజనేయులు, సి.భాస్కరావు(ఆలిండియా ఓ.పి.డి.ఆర్ అధ్యక్షుడు) చిట్టి బాబు (సి.ఎల్.సి.ఎ.పి), బాబు (ఆదివాసీ హక్కుల పోరాట సంఘీభావ కమిటీ), రాధ(సి.ఎం.ఎస్), లక్ష్మణ్ (సి.ఎల్.సి.టి.ఎస్), హనుమంతరావు (ఓ.పి.డి.ఆర్), రోహిత్ (హెచ్.ఆర్.ఎఫ్) తదితరులు పాల్గొన్నారు. -
‘బీసీలను వంచించిన కూటమి’
భవానీపురం(విజయవాడపశ్చిమ): డబ్బున్న వారికే రాజ్యసభ సీటు ఇచ్చిన కూటమి ప్రభుత్వం బీసీలను వంచించి తమ నైజాన్ని బయట పెట్టుకుందని వైఎస్సార్ సీపీ నాయీబ్రాహ్మణ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు తొండమల్లు పుల్లయ్య మంగళవారం ఒక ప్రకటనలో విమర్శించారు. బీసీలను మభ్యపెట్టి ముగ్గురు రాజ్యసభ సభ్యులను రాజీనామా చేయించి వారికి మొండి చెయ్యి చూపించిన ఘనుడు చంద్రబాబు అని ఎద్దేవా చేశారు. బీసీల కోసం ఎక్కడి వరకైనా వెళ్తాననే ఆర్.కృష్ణయ్య స్వప్రయోజనాల కోసమే పార్టీలు మారుతున్నారని విమర్శించారు. హవాలా, మనీ లాండరింగ్ కేసుల్లో సీబీఐ, ఈడీ విచారణ ఎదుర్కొంటున్న సాన సతీష్‌కు రాజ్యసభ ఇవ్వడం చంద్రబాబుకే చెల్లిందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎంతో మంది బీసీలకు రాజ్యాధికారాన్ని కల్పించిన ఘనత వైఎస్ జగన్మోహన్ రెడ్డికే దక్కిందని గుర్తుచేశారు. ఉప ముఖ్యమంత్రులుగా, రాజ్యసభ సభ్యులుగా, శాసన మండలి సభ్యులుగా బీసీలను నియమించిన సామాజిక న్యాయవేత్త వైఎస్ జగన్మోహన్రెడ్డి అని వివరించారు. తనకు కులం, మతం లేదని చెప్పుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ప్రభుత్వం బీసీలకు చేస్తున్న అన్యాయాన్ని గ్రహించాలని కోరారు. -
మైనింగ్ మంత్రి ఇలాకా.. కూటమి తాలూకా..
కోనేరుసెంటర్(మచిలీపట్నం): మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మైనింగ్ శాఖ మంత్రి ఇలాఖాలో అవినీతి దందా పెరిగిపోతోంది. కూటమి అండతో అవినీతిపరులు చెలరేగిపోతున్నారు. అదేమని ఎవరైనా అడిగితే మేమింతే అడ్డొస్తే అంతే అంటూ బెదిరిస్తున్నారు. అక్రమమార్గంలో అడ్డంగా దోచేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతున్న సంబంధిత అధికా రులు పట్టించుకోవడం లేదు. దున్నేవాడిదే భూమి అన్న చందంగా తవ్వుకున్న వాడితే మట్టి అనుకుంటున్నారో ఏమో గ్రామాల్లో అయినకాడికి మట్టిని మాయం చేసేస్తున్నారు. కూటమి నేతల కనుసన్నల్లో జరుగుతున్న ఈ మట్టి దందాను ఎదుర్కోలేక, వారు ఇచ్చే ముడుపులు తీసుకుని చూసీ చూడనట్లు ఉంటున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మూడు గ్రామాల్లో.. బందరు మండలంలోని గోపువానిపాలెం, కరగ్రహారం, మంగినపూడి గ్రామాల్లో మట్టి దందా యథేచ్ఛగా కొనసాగుతోంది. ఆయా గ్రామాలకు చెందిన కూటమి నాయకులు మట్టిని మాయం చేస్తూ ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతున్నారు. పోర్టు భూముల్లోని మట్టిని అయిన కాడికి తవ్వి బయటి ప్రాంతాలకు తరలించేస్తున్నారు. ట్రాక్టర్ మట్టిని దూరాన్ని బట్టి రూ.1500 నుంచి రూ.2 వేల వరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. గతంలో చీకటి రాజ్యంలో కార్యకలాపాలు సాగించిన వారు, ప్రస్తుతం పట్టపగలే మట్టి తవ్వుకుని అమ్మేసుకుంటున్నారు. గోపువానిపాలెం గ్రామానికి చెందిన ఓ మహిళా ప్రజాప్రతినిధి కొడుకు, కరగ్రహారంలో తెలుగుదేశం, జనసేన పార్టీలకు చెందిన కార్యకర్తలు ఆ పార్టీ నేతల అండతో మట్టి దందాను సాగిస్తున్నట్లు ఆ పార్టీ వర్గాలే బహిరంగంగా చర్చించుకోవడం గమనార్హం. వందల ఎకరాల్లో మట్టి మాయం కూటమి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటి వరకు ఆ మూడు గ్రామా లకు సంబంధించి వందల ఎకరాల పోర్టు భూముల్లోని మట్టి తవ్వి అమ్మేసుకున్నట్లు తెలుస్తోంది. తద్వారా తమ తమ స్థాయిని బట్టి కూటమి నేతల దగ్గర వారికున్న పలుకుబడి, పరపతిని బట్టి రూ.లక్షలు, రూ.కోట్లు దిగమింగినట్లు ప్రచారం సాగుతోంది. మైనింగ్ శాఖా మంత్రి కొల్లు రవీంద్ర సొంత నియోజకవర్గమైన మచిలీ పట్నంలో మట్టి దందా సాగుతున్నా పట్టించుకోకపోవడం సర్వత్ర విమర్శలకు దారి తీస్తోంది. దీంతో నియోజకవర్గ ప్రజలకు అనేక అనుమానాలు తలెత్తుతున్నాయి. మచిలీపట్నం మండలంలో మట్టి దందా చెలరేగిపోతున్న మట్టి మాఫియా మామూళ్ల మత్తులో అధికారులు కచ్చితంగా చర్యలు తీసుకుంటాం పోర్టుభూముల్లో మట్టిని తవ్వితే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. మట్టి ట్రాక్టర్లను అడ్డుకుని కేసులు నమోదు చేస్తాం. వాటికి జరిమానా విధించటంతో పాటు వాహనాలను సీజ్ చేస్తాం. సిబ్బందిని అప్రమత్తం చేసి పోర్టు భూముల్లో మట్టి తరలిపోకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటాం. – పి.మధుసూదనరావు, తహసీల్దార్, బందరు -
పెనమలూరులో పేదల ఇళ్లు నేలమట్టం
పెనమలూరు: మండల కేంద్రమైన పెనమలూరులో పేదల ఇళ్లను అధికారులు పూర్తిగా నేలమట్టం చేశారు. పెనమలూరు – చోడవరం రహదారి పక్కన ఆక్రమణల్లో ఉన్న దాదాపు 100 ఇళ్లను సోమవారం 10 జేసీబీలతో కూల్చివేత కార్యక్రమం చేపట్టి మంగళవారంతో ముగించారు. అనేక పేద కుటుంబాలు పెనమలూరు రోడ్డులో హైస్కూల్ సెంటర్ నుంచి అంబేడ్కర్ నగర్ వరకు దాదాపు 40 సంవత్సరాలుగా ఇళ్లు ఏర్పాటు చేసుకోని జీవిస్తున్నాయి. రహదారి విస్తరణ పేరుతో కూటమి నేతలు పేదల ఇళ్లపై కన్నేశారు. దీంతో భారీ జేసీబీలను రంగంలోకి దించారు. నివాసితులు నిద్రలో ఉండగా సోమవారం ఒక్కసారిగా పేదల ఇళ్లపై విరుచుకు పడ్డారు. పేదలకు ఏమాత్రం గడువు ఇవ్వకుండా ఇళ్లను జేసీబీలతో కూల్చివేశారు. రెండో రోజుల కూడా కూల్చి వేత పనులను పోలీసుల బందో బస్తుతో కొనసాగించారు. ఇళ్లు కూల్చివేసిన తరువాత ఆ ప్రాంతం బీభత్సంగా మారింది. భూకంప పరిస్థితులు తలపిస్తోం. ఇళ్లు కూల్చి వేయటంతో పేదలు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. హైస్కూల్ వరకూ విస్తరిస్తారా.. పెనమలూరు వంతెన వద్ద నుంచి హై స్కూల్ వరకు ఉన్న రోడ్డు కూడా విస్తరిస్తారా లేదా అనే విషయం గ్రామంలో చర్చనీయంగా మారింది. ఈ ప్రాంతంలో పెద్దల భవనాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోడ్డు ఇరుకుగా ఉండ టంతో తరుచుగా ట్రాఫిక్ జామ్ అవు తోంది. మరి ఈ పరిస్థితిలో ఇక్కడ కూడా పారదర్శకంగా రహదారి విస్తరిస్తారా లేదా అనే విషయం గ్రామంలో చర్చనీయంగా మారింది. కోర్టుకు వెళ్లిన బాఽధితులు ఇళ్ల కూల్చివేతపై పలువురు బాఽధితులు కోర్టుకు వెళ్లారు. తమకు నోటీసులు ఇవ్వకుండా ఏకపక్షంగా ఇళ్లు కూల్చి వేశారని కోర్టును ఆశ్రయించారు. పలు దేవాలయాలు, ప్రార్థనా మందిరాలు రోడ్డు ఆక్రమణల్లోనే ఉన్నాయి. వాటి పై అధికారులు ఏమి చర్యలు తీసుకుంటారనేది గ్రామంలో చర్చ జరుగుతోంది. దిక్కుతోచని స్థితిలో బాధితులు కర్కశంగా వ్యవహరించిన అధికారులు -
మామిడి పంటకు బీమా పథకం
పెనుగంచిప్రోలు: ఎన్టీఆర్ జిల్లాలో మామిడి పంటకు ప్రభుత్వం వాతావరణ ఆధారిత బీమా పథకంలో అవకాశం కల్పించిందని ఉద్యానవన శాఖాధికారి టి.వర్ధిని తెలిపారు. ఆమె మంగళవారం మాట్లాడుతూ.. అగ్రికల్చర్ ఇన్సూరెన్స్ కంపెనీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ అనే కేంద్ర ప్రభుత్వ సంస్థ రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల సహకారంతో బీమా చెల్లింపునకు ఒప్పందం చేసుకున్నాయని పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి రైతులు బీమా ప్రీమియం ఎకరానికి రూ.2050 చొప్పున డిసెంబర్ 15వ తేదీ లోపు చెల్లించాలని సూచించారు. ప్రకృతి వైపరీత్యాలతో పంట దెబ్బతింటే ఎకరానికి రూ.41 వేల నష్టపరిహారం వస్తుందని పేర్కొన్నారు. ఈ బీమా కాలాన్ని ఈ ఏడాది డిసెంబర్ 15 నుంచి వచ్చే ఏడాది మే 31వ తేదీగా నిర్ణయించిందని పేర్కొన్నారు. ఈ మధ్య కాలంలో అధిక వర్షం, వాతావరణ వ్యత్యాసం, అధిక గాలులు తదితర కారణాలతో నష్టం వాటిల్లితే ప్రభుత్వం నిబంధనల మేరకు అంచనా వేసి బీమా వర్తింపజేస్తారని వివరించారు. ప్రీమియం చెల్లింపునకు రైతులు తమ బ్యాంక్ ఖాతా, ఆధార్ కార్డు, పాస్‌బుక్ జిరాక్స్ కాపీలు, పంట వేసినట్లు ధ్రువీకరణ పత్రం సమర్పించాలని సూచించారు. ఈ పథకం ఐదేళ్లకు పైబడిన చెట్లకు మాత్రమే వర్తిస్తుందని పేర్కొన్నారు. రైతులు కామన్ సర్వీస్ సెంటర్ లేదా సమీపంలోని బ్యాంక్ లేదా పీఎంఎప్బీవై పోర్టల్ ద్వారా మొబైల్లో ప్రీమియం చెల్లించొచ్చని సూచించారు. వివరాలకు రైతు సేవా కేంద్రాల్లో లేదా ఉధ్యానవన శాఖాధికారులను సంప్రదించాలని పేర్కొన్నారు. -
ఎన్నికల హామీల అమలుకు 23న ధర్నా
కృష్ణలంక(విజయవాడతూర్పు): భవన, ఇతర నిర్మాణ కార్మికులకు ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని, సంక్షేమబోర్డు పథకాలను పునరుద్ధరించాలని, మెమో నంబర్ 1214ను వెంటనే రద్దు చేయాలని కోరుతూ ఈ నెల 23న జిల్లా కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాను జయప్రదం చేయాలని ఎన్టీఆర్ జిల్లా బిల్డింగ్ వర్కర్స్ యూనియన్ (సీఐటీయూ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పుట్టెపు అప్పారావు, పిల్లి నరసింహారావు కోరారు. విజయవాడ రాఘవయ్య పార్కు సమీపంలోని బాలోత్సవ భవన్లో సోమవారం జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం సంక్షేమ బోర్డును పనిచేయించి పథకాలను అమలు చేస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చి మ్యానిఫెస్టోలో ప్రకటించిందని గుర్తు చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి ఆరు నెలలు కావస్తున్నా ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. ఇప్పటికే యూనియన్ ద్వారా ఎమ్మెల్యేలు, మంత్రులు, అధికా రులకు అనేకసార్లు విన్నవించామని, తమ సమస్యలను పట్టించుకోకుండా తాత్సారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇతర రాష్ట్రాల నుంచి వేల మంది వలస కార్మికులు వచ్చి పనిచేస్తున్నారని, వారికి ఇక్కడ ఆధార్ కార్డు లేదని సంక్షేమబోర్డులో చేర్చుకోకపోవడంతో వారికి ఎలాంటి పథకాలు అందటం లేదని వివరించారు. భవన నిర్మాణ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఈ నెల 23న కలెక్టరేట్ వద్ద జరిగే ధర్నాలో కార్మికులందరూ పాల్గొనాలని కోరారు. ఈ సమావేశంలో యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.వెంకటేశ్వరరావు, కోశాధికారి బి.బెనర్జీ, వి.బి.రాజు, ఎం.బాబూరావు, డి.అర్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
మద్యం దుకాణంపై టాస్క్ఫోర్సు దాడి
కంకిపాడు: మద్యం దుకాణంపై టాస్క్ ఫోర్సు బృందం సోమవారం రాత్రి ఆకస్మికంగా దాడులు జరిపింది. దుకాణం నుంచి అక్రమంగా తరలిపోతున్న మద్యం సీసాలను స్వాధీనం చేసుకుని ఉయ్యూరు ఎకై ్సజ్ అధికారులకు అప్పగించింది. ఉయ్యూరు ఎకై ్సజ్ సీఐ శేషగిరిరావు తెలిపిన వివరాల మేరకు... కంకిపాడు పట్టణంలోని ఎస్ వైన్స్‌పై రాష్ట్ర టాస్క్ఫోర్సు బృందం ముందస్తు సమాచారం మేరకు దాడి జరిపింది. దాడిలో భాగంగా మద్యం దుకాణం నుంచి బెల్టు షాపులకు తరలిస్తున్న 408 మద్యం సీసాలను గుర్తించి స్వాధీనం చేసుకుంది. మద్యం సీసాలతో పాటు కారును సీజ్ చేసింది. ఉయ్యూరు ఎకై ్సజ్ స్టేషన్‌కు అప్పగించింది. ఇందులో భాగంగా సోమవారం రాత్రి ఇరువురిని, మంగళవారం ఉదయం ఒకరిని అదుపులోకి తీసుకుంది. మద్యం రవాణాలో పాత్ర ఉన్న కె.విద్యాసాగర్, కె.సురేష్, టీ.శ్రీనివాస్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ సందర్భంగా సీఐ శేషగిరిరావు ‘సాక్షి’తో మాట్లాడుతూ బెల్టుషాపులను ప్రోత్సహించేది లేదన్నారు. అక్రమంగా మద్యం అమ్మకాలు సాగితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. నిరంతరం గ్రామాలపై నిఘా ఉంటుందని, బెల్టు నడిపితే శిక్ష తప్పదని హెచ్చరించారు. అక్రమంగా తరలుతున్న 408 మద్యం బాటిళ్లు స్వాధీనం ముగ్గురు వ్యక్తులు అరెస్టు.. కారు సీజ్ -
లైంగిక దాడి కేసులో నిందితుడికి పదేళ్ల జైలు
విజయవాడస్పోర్ట్స్: ప్రేమ పేరుతో 17 ఏళ్ల బాలికను నమ్మించి ఆమైపె పలుమార్లు లైంగికదాడి చేసిన యువకుడికి పదేళ్లు జైలు శిక్ష విధిస్తూ విజయవాడ పోక్సో కోర్టు న్యాయ మూర్తి వి.భవాని మంగళవారం తీర్పు చెప్పారు. ఇంటర్మీడియెట్ చదువుతూ మొగల్రాజపురంలో తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న బాలికకు కానూరు సనత్‌నగర్‌కు చెందిన పోతిన నాని అలియాస్ మహేంద్ర(21) ప్రేమ పేరుతో దగ్గరయ్యాడు. మాయమాటలు చెప్పి బాలికను మచిలీపట్నం బీచ్ వద్ద ఉన్న రిసార్ట్‌కు తీసుకెళ్లి లైంగికదాడికి పాల్పడ్డాడు. ఆ తరువాత హైదరాబాద్, ముంబై తీసుకెళ్లి అక్కడ పలుమార్లు లైంగికదాడి చేశారు. బాలిక కనిపించడం లేదంటూ ఆమె కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మాచవరం పోలీసులు కేసు నమోదు చేశారు. 2015 అక్టోబర్‌లో వెలుగు చూసిన ఈ ఘటనపై పోలీసులు విస్తృతంగా దర్యాప్తు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. బాధితురాలి తరఫున స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ వి.కృష్ణవేణి కోర్టులో వాదనలు వినిపించారు. పది మంది సాక్షులను విచారించిన అనంతరం నేరం రుజువు కావడంతో నిందితుడు పోతిన నాని అలియాస్ మహేంద్రకు పదేళ్ల జైలు శిక్షతో పాటు రూ.10 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. నిందితుడు చెల్లించిన జరిమానాలో రూ.5 వేలతో పాటు, మరో రూ.4 లక్షలను బాధితురాలికి నష్టపరిహారంగా చెల్లించాలని జిల్లా లీగల్ సెల్ అథారిటీని న్యాయమూర్తి ఆదేశించారు. -
వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల కోసం దరఖాస్తుల ఆహ్వానం
చిలకలపూడి(మచిలీపట్నం): వైద్య, ఆరోగ్యశాఖలో నేషనల్ హెల్త్ మిషన్ ద్వారా పోస్టుల భర్తీ కోసం అర్హుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని కృష్ణా జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ జి.గీతాబాయి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ల్యాబ్‌టెక్నీషియన్ గ్రేడ్–2 నాలుగు పోస్టులు, ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్లీ ఎనిమిది పోస్టులు, శానిటరీ అటెండర్ కం వాచ్‌మన్ పది పోస్టులకు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. దరఖాస్తు ఫారం వెబ్సైట్లో ఉందని పేర్కొన్నారు. పూర్తి చేసిన దరఖాస్తులను మచిలీపట్నంలోని డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఈ నెల 16వ తేదీలోగా అందజేయాలని కోరారు. -
చదువు ఒత్తిడితోనే విద్యార్థి ఆత్మహత్య
పెనమలూరు: మండలంలోని పోరంకిలో ఉన్న ఓ కార్పొరేట్ కాలేజీలో నీట్ లాంగ్‌టర్ము చదువుతున్న జనావత్ పరుశురామ్నాయక్ (19) చదువు ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నాడని అతని తండ్రి జణావత్ శంకర్‌నాయక్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోరంకిలో సోమవారం కార్పొరేట్ కాలేజీలో నీట్ విద్యార్థి హాస్టల్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై మృతుడి తండ్రి పోలీసులకు చేసిన ఫిర్యాదు చేశారు. తన కుమారుడు చదువు ఒత్తిడి వల్లే ఆత్మహత్య చేసుకున్నాడని అందులో పేర్కొన్నాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. -
అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు జీతాల్లేవ్
లబ్బీపేట(విజయవాడతూర్పు): ఈ నెల పదో తేదీ వచ్చినా అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు జీతాలు పడలేదు. ప్రతినెలా మొదటి తేదీనే పడే జీతాలు పదో తారీఖు వచ్చినా పడలేదు. దీంతో జీతాలు ఎప్పుడు పడతాయా అని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో దాదాపు 300 మంది అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఉన్నారు. వారిలో స్టాఫ్ నర్సులతో పాటు, నాల్గో తరగతి ఉద్యోగులు, కంప్యూటర్ ఆపరేటర్లు ఉన్నారు. గతంలో ప్రతినెలా మొదటి తేదీనే జీతాలు రావడంతో ఆ భరోసాతో కొందరు ఉద్యోగులు చిన్న చిన్న రుణాలు తీసుకున్నారు. వాటికి ప్రతినెలా ఏడు నుంచి పదో తేదీలోపు ఈఎంఐలు చెల్లించాల్సి ఉంది. ఇప్పుడు జీతాలు పడక పోవడంతో తాము ఈఎంఐలు ఎలా చెల్లించాలో అర్థం కావడం లేదని చిరుద్యోగులు వాపోతున్నారు. మరికొందరు ఇంటి అద్దెలు చెల్లించేందుకు అప్పులు చేస్తున్నారు. గతంలో ప్రతినెలా మొదటి తేదీనే ఒకప్పుడు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఏజెన్సీల కింద పనిచేసే వారు. వారు ప్రభుత్వం నిధులు ఇచ్చినా, ఉద్యోగులకు సరిగా జీతాలు ఇచ్చేవారు కాదు. ఈ విషయాన్ని గ్రహించిన నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులందరినీ ఈ కార్పొరేషన్ పరిధిలోని తీసుకొచ్చారు. దీంతో ప్రతినెలా పర్మినెంట్ ఉద్యోగుల కంటే ముందుగానే అవుట్సోర్సింగ్ ఉద్యో గులకు జీతాలు చెల్లించేవారు. దీంతో ఉద్యోగులు సైతం తమకు ప్రతినెలా జీతం వస్తుందనే ధైర్యంతో ఉండేవారు. మళ్లీ కష్టాలేనా.. ప్రస్తుతం పదోతేదీ వచ్చినా జీతాలు ఇవ్వక పోవడంతో మళ్లీ తమకు గతంలో ఎదుర్కొన్న కష్టాలు రానున్నాయా అంటూ పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అవుట్‌సోర్సింగ్‌లో ఉన్న వార మంతా చిరుద్యోగులమేనని, తక్కువ జీతాలకు పనిచేస్తున్నామని పేర్కొంటున్నారు. ప్రభుత్వం స్పందించి తమకు జీతాలు సత్వరమే విడుదల చేయాలని కోరుతున్నారు. పదో తేదీ దాటినా ఎదురుచూపులే గతంలో మొదటి తేదీనే ఇచ్చిన వైనం -
నష్టం అపారం.. అరకొర సాయం
2.68 లక్షల కుటుంబాలను బుడమేరు ముంచింది. బాధితులను గుర్తించేందుకు 1,700 బృందాలతో ప్రభుత్వం సర్వే చేయించింది. అప్పట్లో అధికారులు ప్రకటించిన లెక్కల ప్రకారం 98,662 ఇళ్లు, 5,975 ఎంఎస్ఎంఈలు (చిన్నతరహా పరిశ్రమలు), 41,814 వాహనాలు నిటమునిగాయి. 39,470 మంది సాధారణ రైతులను, 2,448 మంది ఉద్యాన రైతులు, 479 మత్య్సకారులను కోలుకోలేని విధంగా దెబ్బతీసింది. ఇప్పటికీ పలువురు బాధితులు ఇళ్లు, వాహనాలు, వ్యవసాయ, ఉద్యాన, ఎంఎస్ఎంఈలకు సంబంధించి పరి హారం అందలేదని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. ఈ విషయాన్ని ఇటీవల జరిగిన డీఆర్సీ సమావేశంలో టీడీపీ ప్రజాప్రతినిధులే ప్రస్తావించారు. మొత్తంగా ప్రజలు రూ.వెయ్యి కోట్లకు పైగా నష్టపోయా రని అధికారుల అంచనా. అయితే ఇప్పటి వరకు ప్రభుత్వం రూ.304.08 కోట్లను మాత్రమే పరిహారంగా ఇచ్చి చేతులు దులుపుకొందని బాధితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
సమన్వయంతో అర్జీలను పరిష్కరించండి
గాంధీనగర్(విజయవాడసెంట్రల్): ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన అర్జీలను సమన్వయంతో సత్వరం పరిష్కరించా లని సంబంధిత అధికారులను కలెక్టర్ డాక్టర్ జి. లక్ష్మీశ ఆదేశించారు. కలెక్టరేట్లోని శ్రీ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో పీజీఆర్ఎస్ కార్యక్రమం సోమవారం జరిగింది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా, డీఆర్వో ఎం.లక్ష్మీనరసింహం, జీఎస్‌డబ్ల్యూఎస్ ప్రత్యేక అధికారి జి.జ్యోతి, డీఆర్ డీఏ పీడీ కె.శ్రీనివాసరావుతో కలిసి కలెక్టర్ లక్ష్మీశ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సంద ర్భంగా ఆయన మాట్లాడుతూ.. పీజీఆర్ఎస్ ద్వారా ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించాలన్నారు. ఎస్వోపీ ప్రకారం నాణ్యతతో పరిష్కరించాలని, ఇందుకు జిల్లాస్థాయి అధికారులు, క్షేత్రస్థాయి అధికారులతో సమన్వయం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. రెవెన్యూ శాఖ అర్జీలే అధికం పీజీఆర్ఎస్ కార్యక్రమంలో మొత్తం 120 అర్జీలు వచ్చాయని కలెక్టర్ లక్ష్మీశ తెలిపారు. వీటిలో రెవెన్యూకు సంబంధించి 52 అర్జీలు అందాయన్నారు. పంచాయతీరాజ్ 13, పోలీస్ 8, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ 4, విద్య 4, పౌర సరఫరాలు 3, విభిన్న ప్రతిభావంతులు 2, ఉపాధి కల్పన 2, హౌసింగ్ 2, హెల్త్ 2, దేవదాయ శాఖ, మైన్స్ అండ్ జియాలజీ, మత్స్య శాఖ, నేషనల్ హైవే, స్కిల్ డెవలప్మెంట్, అటవీ, డీఆర్డీఏ, వ్యవసాయ శాఖలకు సంబంధించి ఒక్కో అర్జీ అందాయన్నారు. వాటిని నిర్దేశ గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ లక్ష్మీశ సూచించారు. పరిహారం అందించాలి ‘బుడమేరు వరద నగరాన్ని ముంచెత్తి వంద రోజులైంది. ప్రజలు వరదల్లో సర్వం కోల్పోయారు. ప్రభుత్వం ప్రతి ఒక్కరినీ ఆదుకుంటామని చెప్పింది. ఇప్పటికీ బాధితులకు పరిహారం అందలేదు. గుర్తించిన బాధితులందరికీ పరిహారం అందజేయాలి’ అని కోరుతూ సీపీఎం నాయకులు సీహెచ్బాబూరావు, కాశీనాథ్ బాధితుల తరఫున కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. అధికారులకు కలెక్టర్ డాక్టర్ లక్ష్మీశ ఆదేశం ప్రజాసమస్యల పరిష్కార వ్యవస్థకు 120 అర్జీలుగుడిని రక్షించాలని వినతి ‘విజయవాడ బాడవాపేట రెల్లి వీధిలో 40 ఏళ్ల కిందట నూకాలమ్మ దేవస్థానాన్ని నిర్మించారు. అప్పటి నుంచి రెల్లి కులస్తులు ఆరాధిస్తున్నారు. ఇటీవల కొందరు దేవాలయాన్ని ధ్వంసం చేయాలని ప్రయత్నిస్తున్నారు. విగ్రహాలను దొంగిలించారు. దేవాలయాన్ని కాపాడాలని అడిగిన మాపైనే మాచవరం పోలీసులు వత్తిడి చేస్తున్నారు. ఆలయాన్ని రక్షించండి’ అని కోరుతూ రెల్లి వీధికి చెందిన పెద్దలు కలెక్టర్‌కు అర్జీ ఇచ్చారు. -
హెల్త్ వర్సిటీ వద్ద ఆందోళన
లబ్బీపేట(విజయవాడతూర్పు): విదేశాల్లో మెడిసిన్ గ్రాడ్యుయేషన్ చేసిన విద్యార్థులు తమ సర్టిఫికెట్లను పర్మనెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని కోరుతూ హెల్త్ యూనివర్సిటీ వద్ద సోమవారం ఆందోళనకు దిగారు. తాము కోర్సు పూర్తి చేసినా రిజిస్ట్రేషన్ చేయకుండా ఏపీ మెడికల్ కౌన్సిల్లో జాప్యం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమలో కొందరు ఇప్పటికే ఇంటర్న్‌షిప్ పూర్తి చేయగా, మరికొందరు ఇంటర్న్‌షిప్ కోసం ఎదురు చూస్తున్నామని పేర్కొన్నారు. తమ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎక్కడా లేని నిబంధనలు రాష్ట్రంలో చెబుతున్నారని, తమ భవిష్యత్‌కు సంబంధించి అంశంపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని కోరారు. పలు రాష్ట్రాల్లో ఫారిన్ మెడిసిన్ సర్టిఫికెట్లు ఫేక్ అని తేలినట్లు సమాచారం. దీంతో విద్యార్థులు సమర్పించిన సర్టిఫికెట్లను ఆయా యూనివర్సిటీలు నిజమైనవిగా నిర్ధారిస్తేనే రిజిస్ట్రేషన్ చేస్తున్నారు. అలా ఇప్పటి వరకూ ఏపీ మెడికల్ కౌన్సిల్ నుంచి 400 మంది సర్టిఫికెట్లను ఆయా దేశాల ఎంబసీలకు పంపించారు. వాటి నుంచి సమాచారం వచ్చిన వెంటనే రిజిస్ట్రేషన్ చేస్తామని కౌన్సిల్ అధికారులు పేర్కొంటున్నారు. స్విమ్మింగ్ పోటీల చాంపియన్ ఎన్టీఆర్ జిల్లావిజయవాడస్పోర్ట్స్: రాష్ట్ర స్థాయి తొమ్మిదో సబ్‌జూనియర్, జూనియర్ అక్వాటిక్ చాంపియన్ షిప్లో ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు సత్తా చాటారు. ఈ నెల ఏడు, ఎనిమిది తేదీల్లో విశాఖ పట్నం ఆర్కే బీచ్‌లోని ఆక్వాటిక్ స్విమ్మింగ్ పూల్‌లో జరిగిన ఈ పోటీలకు జిల్లా నుంచి 41 మంది స్విమ్మర్లు ప్రాతినిధ్యం వహించారు. ఎన్టీఆర్ జిల్లా క్రీడాకారులు 24 గోల్డ్, 22 సిల్వర్, 13 బ్రాంజ్ మెడల్స్, 199 పాయింట్లతో ఓవరాల్ చాంపియన్‌షిప్ కై వసం చేసుకున్నారు. 21 మంది స్విమ్మర్లు వ్యక్తిగత పతకాలు సాధించారు. గ్రూప్–1 విభాగంలో ఎం.సేత్, యు.ప్రేమామృత, ఎన్.పావనిసరయు అత్యఽ దిక పాయింట్లు సాధించారు. క్రీడాకారులను ఎన్టీఆర్ జిల్లా స్విమ్మింగ్ సంఘం అధ్యక్షుడు డాక్టర్ ఎం.ఓబుల్‌రెడ్డి, కోశాధికారి కె.రమేష్, సర్ విజ్జి వీఎంసీ స్విమ్మింగ్ పూల్ ఇన్చార్జ్ ఎం. రాంబాబు అభినందించారు. కార్తికేయుడికి ప్రత్యేక పూజలుమోపిదేవి: స్థానిక శ్రీవల్లీదేవసేన సమేత శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో స్వామి, అమ్మవార్లకు పుష్పశయ్యాలంకృత పర్యంక సేవను సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీసుబ్రహ్మణ్య షష్ఠి కల్యాణ మహోత్సవాల్లో భాగంగా ఉదయం ఆలయ డీసీ దాసరి శ్రీరామవరప్రసాదరావు ఆధ్వర్యంలో వేదపండితులు కొమ్మూరు ఫణికుమార్‌శర్మ, ప్రధానార్చకుడు బుద్ధు పవన్‌కుమార్‌శర్మ, ఘనాపాటి నౌడూరి సుబ్రహ్మణ్యశర్మ బ్రహ్మత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. రాత్రికి స్వామివారు, అమ్మవార్లకు వేదమంత్రాలతో పుష్పశయ్యాలంకృత పర్యంక సేవ చేశారు. ఆలయ సూపరింటెండెంట్ బొప్పన సత్యనారాయణ ఏర్పాట్లను పర్యవేక్షించారు. దుర్గగుడికి రూ.3.15 లక్షల విరాళాలుఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానం, ఆలయ బంగారు తాపడం పనులకు తిరుపతికి చెందిన భక్తులు సోమవారం రూ.3.15 లక్షల విరాళం అందజేశారు. తిరుపతి బాలాజీనగర్‌కు చెందిన ఎం.సుబ్రహ్మణ్యంరెడ్డి, కుసుమాంబ కుటుంబ సభ్యులు అమ్మవారిని దర్శించుకునేందుకు ఇంద్రకీలాద్రికి విచ్చేశారు. అమ్మవారి నిత్యాన్నదానానికి రూ.1.15 లక్షలు, బంగారు తాపడం పనులకు రూ.2 లక్షల చొప్పున విరాళం సమర్పించారు. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించిన అధికారులు వేద ఆశీర్వచనం, ఆలయ అధికారి అమృతరావు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలు అందజేశారు.