సకల కళా వల్లభుని స్మరణకే మహోత్సవాలు
శ్రీకాకుళం(ఘంటసాల): శ్రీకృష్ణ దేవరాయలు తెలుగుజాతికి చేసిన మహోపకారాన్ని స్మరించుకోవడానికే ఈ మహోత్సవాలని రాష్ట్ర హైకోర్టు రిటైర్డ్ జడ్జి, రాష్ట్ర ప్రభుత్వ హైపవర్ కమిటీ చైర్మన్ జస్టిస్ యూవీ దుర్గా ప్రసాద్ అన్నారు. ఘంటసాల మండలం శ్రీకాకుళంలోని ఆంధ్ర మహావిష్ణువు దేవాలయ ప్రాంగణంలో ఏపీ భాషా సాంస్కృతిక శాఖ, ఏపీ దేవదాయ ధర్మదాయ శాఖ సహకారంతో దివి ఐతిహాసిక మండలి ఆధ్వర్యంలో శ్రీకృష్ణ దేవరాయల మహోత్సవాలను మంగళవారం ఆయన ప్రారంభించారు. అనంతరం జస్టిస్ యూవీ దుర్గా ప్రసాద్ మాట్లాడుతూ బహు భాషా కోవిదుడైన శ్రీకృష్ణ దేవరాయలకు ఆంధ్ర మహావిష్ణువు స్వప్నంలో ఇచ్చిన ఆదేశాలతో తెలుగు బాషలో ఆముక్త మాల్యద కావ్యాన్ని శ్రీకాకుళం దేవస్థానంలో గావించడం, అది పంచ మహాకావ్యాల్లో ఒకటిగా ఖ్యాతి గడించడం శ్రీకాకుళం గ్రామ ప్రజలకు గర్వకారణమన్నారు.
శ్రీకాకుళం నుంచే ప్రారంభం..
ఎమ్మెల్యే మండలి బుద్ధ ప్రసాద్ మాట్లాడుతూ తెలుగుజాతి చరిత్ర శ్రీకాకుళం నుంచే ప్రారంభమైందన్నారు. ఆంధ్రుల తొలి రాజధాని శ్రీకాకుళం నుంచే ఆంధ్ర రాజుల పాలన ప్రారంభించారన్నారు. అనంతరం ఆముక్త మాల్యద మండపంలోని శ్రీకృష్ణ దేవరాయల విగ్రహానికి, పక్కనే ఉన్న కాసుల పురుషోత్తమ కవి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముందుగా శ్రీకాకుళేశ్వర స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.


