ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు | Youth Dies During Online Gaming | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ గేమ్ ఆడుతూ కుప్పకూలిన యువకుడు

Feb 9 2026 12:08 PM | Updated on Feb 9 2026 12:15 PM

Youth Dies During Online Gaming

మీరట్‌: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్‌లో  విషాదకర సంఘటన చోటుచేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడిన 22 ఏళ్ల మహ్మద్ కైఫ్ గేమ్ ఆడుతూ హైబీపీకి లోనై మృతిచెందాడు. ఖైర్‌నగర్ గూలర్ వాలి ప్రాంతానికి చెందిన  కైఫ్ తన చెవులకు ఇయర్‌ఫోన్స్ పెట్టుకుని  గేమ్‌లో నిమగ్నమై ఉన్న సమయంలో ఈ ఘటన చోటుచేసుకుంది.  అత్యంత ఉత్కంఠ భరితంగా గేమ్‌ ఆడుతున్న ఆ సమయంలో  ఖైఫ్‌ రక్తపోటు (బీపీ) ఒక్కసారిగా 300 దాటిపోవడంతో పరిస్థితి విషమించింది.

వైద్య పరిభాషలో దీనిని ‘మైండ్ అటాక్’ లేదా తీవ్రమైన బ్రెయిన్ హెమరేజ్‌ అని వైద్యులు చెబుతుంటారు. గేమ్ ఆడుతున్నప్పుడు కలిగిన తీవ్ర ఉద్వేగం లేదా ఒత్తిడి కారణంగా కైఫ్‌కు రక్తపోటు విపరీతంగా పెరిగిపోయింది. ఈ క్రమంలో మెదడులోని ఒక రక్తనాళం చిట్లిపోవడంతో అతను స్పృహ కోల్పోయాడు. వెంటనే అతనిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ రెండు రోజుల పాటు మృత్యువుతో పోరాడిన కైఫ్ చివరకు ప్రాణాలు విడిచాడు.

మృతుడు కైఫ్ రోజులో ఎక్కువ సమయం ఆన్‌లైన్ గేమ్‌లు ఆడేవాడని కుటుంబ సభ్యులు అధికారులకు తెలిపారు. అతిగా గేమింగ్ ఆడటం వల్ల కలిగే మానసిక, శారీరక ఒత్తిడి ఖైఫ్‌ మరణానికి ప్రధాన కారణంగా కనిపిస్తోంది. ఈ ఘటనపై మీరట్ పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు ప్రారంభించారు. యువకుడి మరణానికి దారితీసిన పరిస్థితులు, అతను ఆడుతున్న గేమ్, ఇతర సాంకేతిక అంశాలను పోలీసులు పరిశీలిస్తున్నారు. ఆన్‌లైన్ గేమ్‌ల విషయంలో యువత, తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని ఈ ఘటన హెచ్చరిస్తోంది.

ఇది కూడా చదవండి: ‘ఆ బిడ్డ నాది కాదు’.. తేజ్ ప్రతాప్ విలవిల

Advertisement
 
Advertisement
Advertisement