దేశంలోని పాఠశాల విద్యార్థుల ఆధార్ డేటా అప్‌డేట్ ప్రక్రియలో భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ) కీలక మైలురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా సుమారు 83,000 పాఠశాలల్లో చదువుతున్న కోటి మందికి పైగా విద్యార్థులకు ‘తప్పనిసరి బయోమెట్రిక్ అప్‌డేట్స్’ (ఎంబీయూ) పూర్తి చేసినట్లు అధికారికంగా ప్రకటించింది.
ఎందుకు ఈ అప్‌డేట్ తప్పనిసరి?
సాధారణంగా ఐదేళ్లలోపు పిల్లలకు ఆధార్ నమోదు చేసే సమయంలో కేవలం ఫొటో, పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలను మాత్రమే సేకరిస్తారు. ఆ వయసులో పిల్లల వేలిముద్రలు, కనుపాప (ఐరిస్) గుర్తులు పూర్తిగా పరిపక్వం చెందవు కాబట్టి వాటిని తీసుకోరు. అయితే 5 ఏళ్లు, 15 ఏళ్లు దాటిన తర్వాత పిల్లలు తమ బయోమెట్రిక్ వివరాలను ఆధార్‌లో అప్‌డేట్ చేయడం అత్యవసరం. ఈ వివరాలు అప్‌డేట్ చేయకపోతే భవిష్యత్తులో నీట్, జేఈఈ, సీయూఈటీ వంటి పోటీ పరీక్షలకు దరఖాస్తు చేసుకునేటప్పుడు ఇబ్బందులు ఎదురవుతాయి. ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు పొందడానికి కూడా ఈ అప్‌డేట్ తప్పనిసరి.
ఉచితంగా అప్‌డేట్ చేసుకునే అవకాశం
విద్యార్థులకు వీలుగా యూఐడీఏఐ కీలక నిర్ణయం తీసుకుంది. 15 ఏళ్లలోపు పిల్లలకు అక్టోబర్ 1 నుంచి ఏడాది పాటు ఈ బయోమెట్రిక్ అప్‌డేట్‌ను ఉచితంగా అందిస్తోంది. పాఠశాలల్లో నిర్వహించే ప్రత్యేక శిబిరాలతో పాటు దేశవ్యాప్తంగా ఉన్న ఆధార్ కేంద్రాల్లో కూడా ఈ సదుపాయాన్ని పొందవచ్చు. ఇప్పటికే కేంద్రాల ద్వారా సుమారు 1.3 కోట్ల అప్‌డేట్లు పూర్తయ్యాయి.
సాంకేతికతతో వేగవంతం
సెప్టెంబర్ 2025లో యూనిఫైడ్ డిస్ట్రిక్ట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఫర్ ఎడ్యుకేషన్ ప్లస్ (యూడీఐఎస్‌ఈ+) అప్లికేషన్‌తో ఆధార్ డేటాను అనుసంధానం చేయడం వల్ల ఈ ప్రక్రియ వేగవంతమైంది. దీని ద్వారా ఏ విద్యార్థికి అప్‌డేట్ అవసరమో సులభంగా గుర్తించి నేరుగా పాఠశాలల్లోనే శిబిరాలు నిర్వహిస్తున్నారు. ‘దేశంలోని అన్ని పాఠశాలలు కవర్ అయ్యే ఈ ప్రక్రియ కొనసాగుతుంది’ అని యూఐడీఏఐ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ మేరకు ఉడాయ్ సీఈఓ భువనేష్ కుమార్.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ప్రధాన కార్యదర్శులకు లేఖ రాస్తూ పాఠశాలల్లో శిబిరాల నిర్వహణకు సహకరించాలని కోరారు.
ఇదీ చదవండి: రిస్క్ లేకుంటే రాబడి లేదు!


