న్యూఢిల్లీ: భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాత్కాలిక వాణిజ్య ఒప్పంద ముసాయిదాపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు. శనివారం న్యూఢిల్లీలో ఈ కీలక పరిణామాన్ని ప్రకటించిన ఆయన ఈ ఒప్పందం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, బంధానికి ప్రగతికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ మైత్రిని మరింత బలోపేతం చేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చూపిస్తున్న చొరవను, నిబద్ధతను మోదీ ఈ సందర్భంగా కొనియాడారు.
ఈ వాణిజ్య ఒప్పందం భారతీయ ఆర్థిక వ్యవస్థకు, ‘మేక్ ఇన్ ఇండియా’ నినాదానికి మరింత ఊతాన్నిస్తుందని ప్రధాని ధీమా వ్యక్తం చేశారు. అమెరికా మార్కెట్లో భారతీయ ఉత్పత్తులకు మెరుగైన అవకాశాలు లభించడంతో స్థానిక పరిశ్రమలు ప్రపంచ స్థాయికి ఎదుగుతాయని ఆయన అభిప్రాయపడ్డారు. దేశీయంగా తయారయ్యే వస్తువులకు అంతర్జాతీయ గుర్తింపు లభించడమే కాకుండా, విదేశీ ఎగుమతులు పెరుగుతాయన్నారు. ఈ నూతన ఒప్పందం ద్వారా రైతులకు, పారిశ్రామికవేత్తలకు, స్టార్టప్ ఆవిష్కర్తలకు భారీ ప్రయోజనం చేకూరనుందని ప్రధాని పేర్కొన్నారు.
Great news for India and USA!
We have agreed on a framework for an Interim Trade Agreement between our two great nations. I thank President Trump for his personal commitment to robust ties between our countries.
This framework reflects the growing depth, trust and dynamism of… https://t.co/zs1ZLzamhd— Narendra Modi (@narendramodi) February 7, 2026
అమెరికాతో సులభతర వాణిజ్యం వల్ల గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థలు బలోపేతం కావడమే కాకుండా, చిన్న తరహా పరిశ్రమలు తమ సామర్థ్యాన్ని పెంచుకునే అవకాశం ఉంటుందని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ ఒప్పందం కేవలం వాణిజ్యానికి మాత్రమే పరిమితం కాకుండా, దేశంలో భారీ స్థాయిలో ఉద్యోగ అవకాశాలను సృష్టిస్తుందని పేర్కొన్నారు. ప్రధానంగా దేశంలోని యువతకు, మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి మార్గాలు లభిస్తాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ కీలక పాత్ర పోషించేందుకు దోహదపడుతుందని అన్నారు.
ఇది చారిత్రక ఒప్పందం: పీయూష్ గోయల్
భారతదేశం- అమెరికా మధ్య కుదిరిన తాజా మధ్యంతర వాణిజ్య ఒప్పందం ఇరు దేశాల ఆర్థిక సంబంధాల్లో మైలురాయిగా నిలవనుందని, ప్రధాని నేతృత్వంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఫలితంగా ఈ ఒప్పంద ముసాయిదా ఖరారైనట్లు కేంద్ర వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా భారతీయ ఎగుమతిదారులకు అంతర్జాతీయ స్థాయిలో అపారమైన అవకాశాలు లభించనున్నాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.


