అమెరికా, బంగ్లా మధ్య సీక్రెట్‌ డీల్‌.. భారత్ కారణమా? | Secret Trade Deal Between US and Bangladesh On Election Time | Sakshi
Sakshi News home page

అమెరికా, బంగ్లా మధ్య సీక్రెట్‌ డీల్‌.. భారత్ కారణమా?

Feb 6 2026 1:06 PM | Updated on Feb 6 2026 1:21 PM

Secret Trade Deal Between US and Bangladesh On Election Time

భారత్‌ పొరుగు దేశంలో బంగ్లాదేశ్‌లో ఎన్నికల వేళ పరిణామాలు శరవేగంగా మారిపోతున్నాయి. ఇటీవలి కాలంలో బంగ్లాదేశ్‌లో మైనార్టీలైన హిందువులపై దాడుల కారణంగా భారత్‌, బంగ్లా మధ్య ఉద్రిక్తకర వాతావరణం నెలకొంది. ఈ పరిస్థితులు ఎన్నికలపై ప్రభావం చూపించే అవకాశం ఉంది. మరోవైపు.. భారత్‌, అమెరికా మధ్య ట్రేడ్‌ డీల్‌.. యూనస్‌ ప్రభుత్వాన్ని టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ డీల్‌తో  బంగ్లాదేశ్‌ ఒక్కసారిగా ఉలిక్కిపడింది. తమ దేశంలో ప్రత్యేకంగా టెక్స్‌టైల్, రెడీమేడ్ గార్మెంట్స్ రంగంపై ఈ ప్రభావం చూపించడమే ఇందుకు కారణం. ఇలాంటి తరుణంలో యూనస్‌ సర్కార్‌.. అమెరికాతో చేసుకున్న సీక్రెట్‌ డీల్‌ ఇప్పుడు బంగ్లాలో హాట్‌ టాపిక్‌గా మారింది.

అయితే, ఎన్నికల ముందు, తమ పదవీకాలం ముగియబోతున్న సమయంలో యూనస్ సర్కార్‌ ట్రంప్‌తో సీక్రెట్‌ డీల్‌ కుదుర్చుకున్నట్టు వార్తలు బయటకు వచ్చాయి. బంగ్లాదేశ్‌లోని ప్రముఖ పత్రిక ‘ప్రథమ్ ఆలో’ ప్రకారం.. బంగ్లా, అమెరికా మధ్య ఒప్పందం గురించి బహిరంగంగా ఏ సమాచారం బయటకు రాలేదు. యూనస్ ప్రభుత్వం ఇప్పటికే అమెరికాతో ఒక నాన్-డిస్‌క్లోజర్ ఒప్పందం సైన్ చేసింది. అందుకే ఈ ట్రేడ్ డీల్ ముసాయిదా ప్రజలకు తెలియడం లేదు. అంటే ప్రభావితమయ్యే పరిశ్రమలకు కూడా అసలు షరతులు ఏంటో తెలియని పరిస్థితి ఏర్పడింది అని చెప్పుకొచ్చింది. ఈ నేపథ్యంలో అనేక ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఈ డీల్‌లో అసలు ఇందులో ఏముంది? ఎవరి ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకున్నారు? అనే ప్రశ్నలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. యూనస్ ప్రభుత్వాన్ని ప్రజలు ఎన్నికల ద్వారా ఎన్నుకోలేదు. ఇది తాత్కాలిక ప్రభుత్వం. ఈ తాత్కాలిక ప్రభుత్వానికి ఇలాంటి కీలక ఒప్పందం చేసే నైతిక హక్కు ఉందా? అన్నది పెద్ద ప్రశ్నగా మారింది.

కాగా, ఫిబ్రవరి 12న బంగ్లాదేశ్‌లో ఎన్నికలు జరగబోతున్నాయి. కానీ కేవలం మూడు రోజుల ముందు, అంటే ఫిబ్రవరి 9న అమెరికా–బంగ్లాదేశ్ ట్రేడ్ డీల్‌పై సంతకాలు చేసే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. యూనస్ ప్రభుత్వం ఇంత తొందరగా అమెరికాతో ఒప్పందం ఎందుకు చేయాలనుకుంటోంది? అనే ప్రశ్న ఎదురైంది. కాగా, 2025 ఏప్రిల్‌లో ట్రంప్ 100 దేశాలపై టారిఫ్ ప్రకటించినప్పుడు, బంగ్లాదేశ్‌పై 37 శాతం సుంకాలు విధించారు. అనంతరం, జూన్‌లో నాన్-డిస్‌క్లోజర్ ఒప్పందం సైన్ చేయడంతో చర్చలు రహస్యమయ్యాయి. జూలైలో టారిఫ్ 35 శాతానికి, ఆగస్టులో 20 శాతానికి తగ్గింది. ఇప్పుడు ఫిబ్రవరి 9న ఒప్పందంపై సంతకాలు చేయనున్నట్టు బంగ్లాదేశ్ వాణిజ్య శాఖ చెబుతోంది.

ఈ నేపథ్యంలో యూనస్‌ ప్రభుత్వం సీక్రెట్‌ ఒప్పందంపై టెక్స్‌టైల్‌, గార్మెంట్‌ తయారీదారులు, సంస్థలు ఆందోళన చెందుతున్నాయి. తమతో ఎలాంటి సంప్రదింపులు లేకుండా ఈ ప్రక్రియ సాగుతుండటం ఆందోళనకు గురి చేస్తోందని గార్మెంట్ తయారీదారుల సంఘం నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు ఇలాంటి ఒప్పందాలు చేయడం భవిష్యత్తులో పెద్ద సమస్యలు తెస్తుందని హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే బంగ్లాదేశ్ మొత్తం ఎగుమతుల్లో 90 శాతానికి పైగా ఇదే రంగం ఆధారంగా ఉంది. ఇప్పటికే ట్రంప్ విధించిన భారీ టారిఫ్‌ల వల్ల వస్త్ర పరిశ్రమ నష్టపోయింది. ఇప్పుడు మరోసారి అమెరికాతో ఏవో షరతులతో ఒప్పందం జరిగితే, లక్షలాది మందికి ఉపాధి ఇచ్చే ఈ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంది. అలా జరిగితే దేశ ఆర్థిక వ్యవస్థ మొత్తం దెబ్బతినే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో అమెరికా చేతిలో బంగ్లాదేశ్‌ జుట్టు అంటూ ఆ దేశంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

మరోవైపు.. సీక్రెట్‌ ఒప్పందంపై బంగ్లాదేశ్‌ ప్రముఖ ఆర్థికవేత్త అనూ మహమ్మద్ తీవ్రంగా స్పందించారు. ఎన్నికలకు ముందు పోర్టులను లీజుకు ఇవ్వడం, ఆయుధాలు దిగుమతి చేయడం, అమెరికాతో తలవంచే ఒప్పందాలు చేసుకోవడం ఇవన్నీ ఎందుకు ఇంత తొందరగా ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. ఈ ఒప్పందాలు పారదర్శకంగా లేవని, అవాస్తవంగా ముందుకు తీసుకెళ్తున్నారని ఆరోపించారు. విదేశీ లాబీలు యూనస్ ప్రభుత్వంలోకి ప్రవేశించి, ఎలాగైనా ఈ ఒప్పందాలు జరిగేలా చూస్తున్నాయని బాంబు పేల్చారు. అయితే, ఈ డీల్‌పై ఇటీవల వచ్చిన కొన్ని నివేదికలు ఈ అనుమానాలకు మరింత బలం ఇస్తున్నాయి. 2024లో షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూల్చిన పరిణామాల వెనుక ఇస్లామిక్ శక్తులతో పాటు అమెరికా ‘డీప్ స్టేట్’ మద్దతు ఉందన్న ఆరోపణలు అప్పట్లో వినిపించాయి. ఆ తర్వాతే యూనస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు అదే ప్రభుత్వం అమెరికాతో రహస్య ఒప్పందం చేయబోతుండటంతో అనుమానాలు పెరుగుతున్నాయి.

వివాదాస్పద అంశాలు..

పారదర్శకత లోపం: ఒప్పందం వివరాలు ప్రజలకు, పార్లమెంట్‌కు తెలియజేయలేదు.

అనుమానాలు : ఎన్నికల ముందు తాత్కాలిక ప్రభుత్వం దీర్ఘకాలిక వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోవడం చట్టబద్ధతపై ప్రశ్నలు లేవనెత్తుతోంది.

ఆర్థిక ప్రభావం: ఎగుమతిదారులు, ఆర్థిక నిపుణులు దీని వల్ల బంగ్లాదేశ్‌ దీర్ఘకాలికంగా అమెరికా వాణిజ్య విధానాలకు బంధించబడుతుందేమోనని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

వస్త్ర పరిశ్రమపై ప్రభావం..

అమెరికా మార్కెట్ ఆధారపడటం: బంగ్లాదేశ్‌ ఎగుమతుల్లో 90% వస్త్రాలు, అందులో ఎక్కువ భాగం అమెరికాకు వెళ్తుంది. కొత్త ఒప్పందం వల్ల 20% టారిఫ్ స్థిరపడింది. ఇది భారతదేశం (25%), వియత్నాం (21%), పాకిస్తాన్‌ (19%)తో పోలిస్తే పోటీ స్థాయిలో ఉంది.

పోటీ సామర్థ్యం: టారిఫ్ తగ్గడం వల్ల అమెరికా మార్కెట్లో బంగ్లాదేశ్‌ వస్త్రాలు మరింత పోటీగా నిలుస్తాయి.

ఉద్యోగ భద్రత: అమెరికా మార్కెట్‌లో డిమాండ్ పెరగడం వల్ల ఉద్యోగ అవకాశాలు పెరగవచ్చు.

వేతన ఒత్తిడి: తక్కువ ధరల పోటీ కొనసాగించడానికి తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు కొనసాగవచ్చు.

సామాజిక ప్రభావం: కార్మికుల హక్కులు, భద్రతా ప్రమాణాలు అంతర్జాతీయ ఒత్తిడితో మెరుగుపడే అవకాశం ఉంది. కానీ తాత్కాలికంగా ఉత్పత్తి ఒత్తిడి పెరుగుతుంది. బంగ్లాదేశ్‌ వస్త్ర పరిశ్రమ అమెరికా మార్కెట్‌లో దీర్ఘకాలికంగా స్థిరపడే అవకాశం ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement