పాక్‌ సైన్యానికి చుక్కలు.. మునీర్‌కు కొత్త టెన్షన్‌? | Pakistan Tension Over Baloch Woman Incident | Sakshi
Sakshi News home page

పాక్‌ సైన్యానికి చుక్కలు.. మునీర్‌కు కొత్త టెన్షన్‌?

Feb 2 2026 6:36 PM | Updated on Feb 2 2026 6:55 PM

Pakistan Tension Over Baloch Woman Incident

ఇస్లామాబాద్‌: పాకిస్తాన్‌ సైన్యానికి బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA)కు చెందిన ఇద్దరు మహిళలు చుక్కలు చూపించారు. ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లుగా మారి పాకిస్తాన్‌ సిబ్బంది దాదాపు 200 మందిని హతమర్చారు. మరోవైపు.. బలోచిస్థాన్‌ అంతటా పాక్‌ భద్రతా దళాలను లక్ష్యంగా చేసుకొని ‘హీరోఫ్’ పేరుతో రెండో దశ ఆపరేషన్‌ను ప్రారంభించనున్నట్లు బీఎల్‌ఏ పేర్కొంది. దీంతో, దాయాది పాక్‌కు బీఎల్‌ఏ వెన్నులో వణుకుపుట్టించినట్టు అయ్యింది.

ఇంతకీ ఏం జరిగిందంటే.. కొద్దిరోజులుగా దాయాది దేశం పాకిస్తాన్‌లో వరుస దాడులు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో బలోచిస్థాన్‌ ప్రావిన్సులో ఉన్న 12 వేర్వేరు ప్రాంతాల్లో పెద్దఎత్తున జరుగుతోన్న దాడులకు తమదే బాధ్యత అని తాజాగా బలోచిస్థాన్‌ లిబరేషన్ ఆర్మీ (BLA) ఓ ప్రకటనలో తెలిపింది. ఇదే సమయంలో పాక్‌ దళాలపై దాడి చేసింది తమ విభాగానికి చెందిన ఇద్దరు మహిళా ఆత్మాహుతి బాంబర్లేనని వెల్లడించింది. వీరిలో 24 ఏళ్ల ఆసిఫా మెంగల్‌ అనే యువతి చేసిన దాడిలో పాక్‌ సిబ్బంది సహా వంద మంది మృతి చెందినట్లు తెలిపింది. మరో ఆత్మాహుతి బాంబర్‌ హవా బలోచ్ దాడిలోనూ అనేకమంది ప్రాణాలు కోల్పోయినట్లు పేర్కొంది. ఇక, ఇద్దరు మహిళలు దాడులు చేసిన వీడియోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.  

ఇదిలా ఉండగా.. బీఎల్‌ఏ విడుదల చేసిన వీడియోలో ఆత్మాహుతి దాడిలో పాల్గొన్న మహిళా యోధురాలు పాక్‌ ప్రభుత్వాన్ని ఎగతాళి చేస్తూనే..  సంచలన ఆరోపణలకు దిగింది. బలూచ్‌ యోధుల్ని ఏమీ చేయలేక.. తమ ఇంట ఆడవాళ్లపై ప్రతాపం చూపిస్తోందని పేర్కొంది. ‘‘పాక్‌ సైన్యానికి మమ్మల్ని నేరుగా ఎదుర్కొనే ధైర్యం లేదు. అది వాళ్ల కెపాసిటీకి మించిన పని. అందుకే మా ఇంట ఆడవాళ్లపై పడ్డారు. ఇది పిరికిపంద చర్య కాదంటారా?’’ అంటూ ఆ వీడియోలో మాట్లాడింది. అలాగే బలోచ్ ప్రజలు మేల్కొని పోరాటంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చింది. మాకు ఇంతకు మించిన మార్గం మరొకటి లేదంటూ పెద్ద తుపాకీ పట్టుకొని చిరునవ్వుతో చేసిన ఈ వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్‌ అయ్యాయి.  ఈ వ్యాఖ్యలు చేసిన 12 గంటల్లోపే ఆమె వీరమరణం పొందిందని బీఎల్‌ఏ పేర్కొంది.

మీడియా నివేదికల ప్రకారం.. ఆత్మాహుతి చేసుకున్న బలూచ్‌ యోధురాలు హవా బలోచ్‌కు సంబంధించిన కొన్ని విషయాలు బయటకు వచ్చాయి. ఆమె తండ్రి 2021లో పాకిస్తాన్ భద్రతా దళాల చేతిలో మరణించినట్టు తెలిసింది. అతడు బీఎల్‌ఏ యోధుడని సమాచారం. సదరు మహిళ తిరుగుబాటులో చేరడానికి ముందు అధికారికంగా విద్యను కూడా పొందినట్టు నివేదించబడింది. ఇది దశాబ్దాలుగా కొనసాగుతున్న బలోచ్ వేర్పాటువాద ఉద్యమం ధోరణిని ప్రతిబింబిస్తుంది.

పాక్‌ ఓవరాక్షన్‌.. 
పాకిస్తాన్‌లో అతిపెద్ద ప్రావిన్స్ బెలూచిస్తాన్‌ (సుమారు 44% భూభాగం). అయితే.. పంజాబీలు, పశ్తూన్లు వంటి జాతులు పాక్‌ రాజకీయ, సైనిక, ఆర్థిక వ్యవస్థలో ప్రధాన ఆధిపత్యం కలిగి ఉన్నారు. ఈ క్రమంలో కేవలం ఆరు శాతం జనాభా ఉన్న మైనారిటీ వర్గం బలూచ్‌.. సొంత గడ్డపై అన్నివిధాలుగా తీవ్ర అణచివేతకు గురవుతోంది. అదే సమయంలో గ్యాస్, ఖనిజ ఆర్థిక వనరులతో పాటు గ్వాదర్ పోర్ట్ విషయంలోనూ పాక్‌ ప్రభుత్వ పెత్తనం ఎక్కువైందని.. స్థానికులైన తమకు తగిన లాభాలు అందడం లేదంటూ ఆ జాతి వాదిస్తోంది. వెరసి తమ హక్కుల కోసం తిరుగుబాట్లు, ఉద్యమాలు చేస్తున్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement