మరో 17 మంది భద్రతా సిబ్బంది కూడా..
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: పాకిస్తాన్‌లోని బలూచిస్తాన్‌లోని 40 గంటల వ్యవధిలో వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన ఎదురుకాల్పుల్లో 145 మంది ఉగ్రవాదులు, మరో 17 మంది భద్రతా సిబ్బంది ప్రాణాలు కోల్పోయారు. క్వెట్టా, సిబి, మస్తుంగ్, గ్వాదర్, నోష్కి, పాస్ని, పంజ్‌గుర్, ఖరన్ ప్రాంతాల్లో ఈ ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నట్లు బలూచిస్తాన్ ప్రావిన్స్ సీఎం సర్ఫరాజ్ బుగ్తి చెప్పారు.
మృతుల్లో ఇద్దరు మహిళలు, ముగ్గురు సూసైడ్ బాంబర్లు కూడా ఉన్నారన్నారు. మొత్తం 145 మృతదేహాలను అధికారులు స్వాధీనం చేసుకుని, గుర్తింపు ప్రక్రియ చేపట్టారని వివరించారు. శనివారం పలు ప్రాంతాల్లో పౌరులతోపాటు భద్రతా సిబ్బందిపై బలూచ్ సాయుధ గ్రూపులు దాడులకు పాల్పడటంతో బలగాలు కూంబింగ్ చేపట్టాయన్నారు.
ఉగ్రవాదుల దాడుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు సహా 18 మంది ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. శనివారం భద్రతా బలగాలు పంజ్‌గుర్, షబాన్ ప్రాంతాల్లో చేపట్టిన ఆపరేషన్లలో 41 మంది ఉగ్రవాదులు చనిపోయారని గుర్తు చేశారు. ఈ ఘటన అనంతరం ప్రావిన్స్‌లో అప్రమత్తత ప్రకటించామని చెప్పారు.
అఫ్గానిస్తాన్ నుంచి కొందరు అందించే ఆదేశాల ప్రకారం ఇక్కడున్న వారు ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకునేందుకు పథకం పన్నారని బుగ్తి ఆరోపించారు. బలూచ్ లిబరేషన్ ఆర్మీ, తాలిబన్ వంటి గ్రూపులతో చర్చలు జరిపే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.
పశ్చాత్తాప భావనతో లొంగిపోవాలనుకునే వారిని మాత్రం స్వాగతిస్తామని చెప్పారు. బలూచిసాŠత్‌న్‌లో ఉగ్రవాదుల హింసాత్మక కార్యకలాపాలతో 2024లో 787 మంది చనిపోగా, 2025లో ఈ సంఖ్య 956కు అంటే దాదాపు 22 శాతం పెరిగినట్లు ప్రభుత్వ గణాంకాలు వెల్లడిస్తున్నాయి.
పాక్ ఆరోపణలను ఖండించిన భారత్
బలూచిస్తాన్‌లో అశాంతి వెనుక భారత్ హస్తముందంటూ పాకిస్తాన్ చేసిన ఆరోపణలను విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. ఇవి పూర్తి గా నిరాధారాలని పేర్కొంది. హింసాత్మక ఘటనలు జరిగిన ప్రతిసారీ పాక్ మిలటరీ అంతర్గత వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ఇలాంటి ఎత్తుగడల కు పాల్పడుతుందని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ వ్యాఖ్యానించారు. బదులుగా అక్కడి ప్రజల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరించడంపై దృష్టి పెట్టాలని సలహా ఇచ్చారు. మానవ హక్కుల ఉల్లంఘన, అణచివేతలో పాకిస్తాన్‌కు దారుణమైన రికార్డు ఉందని పేర్కొన్నారు.


