ఆ ముగ్గురూ ప్రాణ స్నేహితులనడానికి నిజమైన అర్థంగా నిలిచారు. ఒకటో తరగతితో మొదలైన వారి స్నేహం.. చదువు పూర్తయ్యి, ఉద్యోగాలలో చేరి.. పదవీ విరమణ చేసే వరకూ ఐక్యంగా కొనసాగింది. ఈ ఉదంతం తెలిసిన వారంతా తెగ ఆశ్యర్యపోతున్నారు. వారి అమూల్య స్నేహాన్ని చూసి, వారేవా అంటున్నారు. ఇది కేరళలోని ఇడుక్కి జిల్లా నెయ్యస్సేరి గ్రామానికి చెందిన కథనం.
1975లో నెయ్యస్సేరి సెయింట్ సెబాస్టియన్ హైస్కూల్‌లో ఒకటో తరగతిలో అడుగుపెట్టిన ముగ్గురు చిన్నారులు.. సోని మాథ్యూ, సాల్జీ ఇమ్మాన్యుయేల్, సిమీ జోస్‌లు తొలుత క్లాస్‌మేట్స్. కాలక్రమేణా వీరి పరిచయం విడదీయలేని బంధంగా మారి, ఐదు దశాబ్దాల సుదీర్ఘ ప్రయాణానికి నాంది పలికింది. వీరి విద్యాభ్యాసంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు వీరు ముగ్గురూ ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఒకే బెంచిపై పాఠాలు వింటూ, పెరిగిన ఈ స్నేహితులు, పదో తరగతి తర్వాత కూడా ఒకేలాంటి లక్ష్యాలతో ముందుకు సాగారు. విద్యాభ్యాసం పూర్తయ్యాక, సమాజానికి మేలు చేసే ఉపాధ్యాయ వృత్తినే ముగ్గురూ ఎంచుకోవడం విశేషం.
సోని మాథ్యూ
సోని మాథ్యూ తన కెరీర్‌లో పదేళ్ల పాటు హైస్కూల్ టీచర్‌గా సేవలందించి, తాను చదువుకున్న నెయ్యస్సేరి పాఠశాలలోనే ఏడాది పాటు హెడ్ మాస్టర్‌గా బాధ్యతలు నిర్వహించడం విశేషం. త్వరలో ఈయన పైన్కులం సెయింట్ రీటాస్ హైస్కూల్ హెడ్ మాస్టర్‌గా పదవీ విరమణ చేయనున్నారు. తన విజ్ఞానంతో ఎందరో విద్యార్థులను భావి భారత పౌరులుగా తీర్చిదిద్దిన తృప్తి ఆయన కళ్లలో నిరంతరం కనిపిస్తుంటుంది.
సాల్జీ ఇమ్మాన్యుయేల్
విద్యా యజ్ఞంలో అలుపెరగని బాటసారి సాల్జీ ఇమ్మాన్యుయేల్ తన వృత్తి జీవితంలో కేరళలోని ముతలకోడం, చెమ్మనార్, ఇలందేశం, రాజముడి, చలస్సేరి తదితర మారుమూల ప్రాంతాల్లోని పాఠశాలల్లో పనిచేశారు. ఎక్కడ పనిచేసినా తనదైన ముద్ర వేసిన ఆమె ప్రస్తుతం కలియార్ సెయింట్ మేరీస్ ఎల్పీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అక్షరమే ఆయుధంగా ఆమె సాగించిన ప్రయాణం ఎందరికో స్ఫూర్తిదాయకం.
సిమీ జోస్
అంకితభావానికి నిలువుటద్దంలా నిలిచిన ఈ ముగ్గురి బృందంలో మరొకరు సిమీ జోస్. వెన్మణి సెయింట్ జార్జ్ యూపీ స్కూల్, వలక్కల్ ఎల్ఎఫ్ యూపీఎస్, ఎలుముట్టం సెయింట్ మేరీస్ తదితర పాఠశాలల్లో సేవలు అందించారు. ప్రస్తుతం కొడిక్కులం సెయింట్ మేరీస్ ఎల్పీ స్కూల్ హెడ్ మిస్ట్రెస్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న ఆమె, తన తోటి స్నేహితులతో కలిసి ఒకేసారి పదవీ విరమణ చేయనుండటం గమనార్హం.
కొత్తమంగళం డియోసెస్ పరిధిలోని వివిధ పాఠశాలల్లో అంచలంచెలుగా ఎదుగుతూ నేడు హెడ్ మాస్టర్ హోదాల్లో ఉన్న ఈ ముగ్గురు మిత్రులు.. 2026, మార్చి నెలలో ఒకేసారి పదవీ విరమణ చేయనున్నారు. ఒకే పాఠశాలలో ఓనమాలు నేర్చుకున్న ఈ స్నేహితులు.. ఐదు దశాబ్దాల తర్వాత ఒకే సమయంలో విద్యాశాఖ నుండి వీడ్కోలు తీసుకోవడం కేరళ విద్యా వర్గాల్లో అరుదైన రికార్డుగా నిలిచింది.
ఇది కూడా చదవండి: నిపా వైరస్: భారత్‌కు ‘ఆరోగ్య సంస్థ’ హెచ్చరిక


