ఉరుకుల పరుగుల నగర జీవితంలో భారతీయులు ఆరోగ్యానికి ఎంతో అవసరమైన ఒక కీలక విషయాన్ని విస్మరిస్తున్నారు.. అదే ‘కంటినిండా నిద్ర’. తాజాగా వెలువడిన ఒక జాతీయ సర్వే నివేదిక ప్రకారం.. భారతీయ నగరాల్లో నిద్ర నాణ్యత ఆందోళనకరంగా పడిపోతోంది. ముఖ్యంగా ముంబై నగరం దేశంలోనే అత్యధికంగా నిద్రలేమితో సతమతమవుతుండగా, ఢిల్లీ వాసులు ఆలస్యంగా నిద్రలేవడంలో రికార్డు సృష్టించారు. మరి మన హెదరాబాద్ పరిస్థితి ఏమిటి?
ఆరోగ్యానికి నిద్రే ప్రాణాధారం
శారీరక ఆరోగ్యానికే కాకుండా, మెదడు పనితీరుకు, మానసిక స్థిరత్వానికి తగినంత నిద్ర అత్యవసరం. నిద్ర తక్కువైతే ఏకాగ్రత దెబ్బతినడమే కాకుండా, దీర్ఘకాలంలో గుండె జబ్బులు, ఊబకాయం, మధుమేహం, ఆందోళన (Anxiety) వంటి సమస్యలకు దారితీస్తుంది. మారుతున్న జీవనశైలి కారణంగా భారతీయులు నిద్రకు దూరమవుతున్నారు.
నగరాల వారీగా నిద్ర తీరు తెన్నులు
Wakefit.co నిర్వహించిన తాజా సర్వే (జనవరి 2025 - మార్చి 2026 మధ్య) భారతీయ మెట్రో నగరాల్లో నిద్ర అలవాట్లపై ఆసక్తికరమైన అంశాలను వెల్లడించింది.
ముంబై (అత్యంత నిద్రలేమి నగరం): ముంబై వాసుల్లో 76.5 శాతం మంది అర్ధరాత్రి దాటాక నిద్రపోతున్నారు. దాదాపు 60 శాతం మంది పనివేళల్లో కూడా నిద్రతో తూగుతున్నట్లు సర్వే పేర్కొంది.
హైదరాబాద్ (సమతుల్య నగరం): మన భాగ్యనగరం ఇతర మెట్రోలతో పోలిస్తే కొంత మెరుగ్గా ఉంది. ఇక్కడ 42 శాతం మంది ఆలస్యంగా నిద్రపోతుండగా, 31 శాతం మంది మాత్రమే నిద్రలేమి సమస్యలను ఎదుర్కొంటున్నారు. దీన్ని సర్వే 'బ్యాలెన్స్‌డ్ స్లీపర్ సిటీ'గా అభివర్ణించింది.
ఢిల్లీ (ఆలస్యంగా మేల్కొనే నగరం): దేశ రాజధానిలో 45 శాతం మంది ఉదయం చాలా ఆలస్యంగా నిద్రలేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యధికం.
చెన్నై (క్రమశిక్షణ కలిగిన నగరం): నిద్ర వేళల విషయంలో చెన్నై వాసులు కొంత క్రమశిక్షణ పాటిస్తున్నారు. కేవలం 23.8 శాతం మంది మాత్రమే ఆలస్యంగా నిద్రలేస్తున్నారు.
కోల్‌కతా (లేట్ నైట్ సిటీ): ఇక్కడ 75.5 శాతం మందికి రాత్రిపూట చాలా ఆలస్యంగా నిద్రపోయే అలవాటు ఉంది.
బెంగళూరు (నిద్ర వైరుధ్యం): ఐటీ హబ్‌లో 36.3 శాతం మంది అర్ధరాత్రి దాటాక పడుకుంటున్నారు. అయితే నిద్రలేచిన తర్వాత కూడా 54 శాతం మంది తాము విశ్రాంతి పొందినట్లు భావించడం లేదని వెల్లడయ్యింది.
విలన్లుగా మారిన స్మార్ట్‌ఫోన్లు
భారతీయులు నిద్రకు దూరం కావడానికి ప్రధాన కారణం డిజిటల్ వ్యసనమేనని సర్వే స్పష్టం చేసింది. దాదాపు 87.6 శాతం మంది పడుకునే ముందు మొబైల్ ఫోన్లు చూస్తున్నట్లు అంగీకరించారు. సోషల్ మీడియా స్క్రోలింగ్, ఓటీటీలో బింజ్ వాచింగ్ వంటి అలవాట్లు నిద్ర నాణ్యతను దెబ్బతీస్తున్నాయి. దీని ప్రభావం ఉత్పాదకతపై పడుతోంది. సుమారు 57.8 శాతం మంది ఆఫీసు పనివేళల్లో నిద్ర వస్తోందని వాపోతున్నారు.
ఆందోళనకర గణాంకాలు
మరో జాతీయ స్థాయి సర్వే (89,000 మంది స్పందనలు) ప్రకారం 46 శాతం మంది భారతీయులు రోజుకు 6 గంటల కంటే తక్కువ సమయమే నిద్రపోతున్నారు. రాత్రి 10 గంటల కంటే ముందే నిద్రపోయే వారు కేవలం 12 శాతం మంది మాత్రమే ఉండటం గమనార్హం.
నిపుణుల సూచనలు
మంచి నిద్ర కోసం రాత్రిపూట స్క్రీన్ టైమ్ తగ్గించాలని, సరైన సమయానికి భోజనం చేసి, బెడ్‌రూమ్‌లో ప్రశాంతమైన వాతావరణం ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. నిద్రను సమతుల ఆరోగ్యానికి ప్రాథమిక అవసరంగా గుర్తించాలని వైద్యులు సూచిస్తున్నారు.
ఇది కూడా చదవండి: గల్ప్‌కు మరిన్ని భారత యుద్ధ నౌకలు


