తిరువనంతపురం: కేరళ శాసనసభ ఎన్నికల ఫలితాలు పదేళ్ల వామపక్ష (ఎల్‌డీఎఫ్) పాలనకు తెరదించుతూ కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ (యూడీఎఫ్) కూటమికి అధికారాన్ని కట్టబెట్టాయి. అయితే ఈ చారిత్రక విజయం కాంగ్రెస్ నేతల గొప్పదం వల్ల కానే కాదని, కేవలం మార్పు కోరుకున్న ప్రజలు విధిలేక కాంగ్రెస్‌కు ఓటేశారని నాయర్ సర్వీస్ సొసైటీ (ఎన్‌ఎస్‌ఎస్) జనరల్ సెక్రటరీ జి. సుకుమారన్ నాయర్ వ్యాఖ్యానించారు.
పెరున్నలో మీడియాతో మాట్లాడిన ఆయన.. తాజా ఫలితాలను ‘ప్రజాస్వామ్య విజయం’గా అభివర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కేరళ రాజకీయాల్లో తీవ్ర సంచలనంగా మారాయి. 140 స్థానాలున్న కేరళ అసెంబ్లీలో కాంగ్రెస్ 63, దాని మిత్రపక్షం ఐయూఎంఎల్ 22 సీట్లు గెలుచుకుని పదేళ్ల ఎల్‌డీఎఫ్ ప్రభుత్వాన్ని గద్దె దించాయి. అయితే, ఈ విజయం తమ సొంత ప్రతిభేనని కొందరు కాంగ్రెస్ నేతలు భ్రమ పడుతున్నారని, కానీ అందులో ఏమాత్రం నిజం లేదని సుకుమారన్ నాయర్ తేల్చి చెప్పారు.
పదేళ్ల పాలనతో విసుగెత్తిపోయిన ప్రజలు, మార్పు కోరుకుంటూ ఓటు వేశారన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకపోవడం వల్లే ఆ ఓట్లు కాంగ్రెస్, యూడీఎఫ్ పక్షాన పడ్డాయని ఆయన అన్నారు. మంత్రుల ఓటములకు కూడా ఈ ప్రజా వ్యతిరేకతే కారణమని ఆయన విశ్లేషించారు. కొత్త ముఖ్యమంత్రి ఎంపిక పూర్తిగా కాంగ్రెస్ అంతర్గత వ్యవహారమని, సమర్థులైన, అనుభవజ్ఞులైన వారిని ఆ పార్టీ కేంద్ర నాయకత్వమే ఎంచుకుంటుందని సుకుమారన్ నాయర్ పేర్కొన్నారు. సీఎం అభ్యర్థిగా ఎవరిని ప్రకటించినా తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు.
కాంగ్రెస్ సీనియర్ నేత వీడీ సతీశన్ గురించి ప్రస్తావించగా.. అది కాంగ్రెస్ నిర్ణయమని, దాన్ని అంగీకరించాల్సిందేనని బదులిచ్చారు. ఎన్నికల్లో ఎన్ఎస్ఎస్ సమాన దూరమనే విధానాన్ని పాటించిందని చెప్పిన ఆయన, గతంలో సతీశన్‌తో వచ్చిన విబేధాలు ఇంకా అలాగే ఉన్నాయని, వాటిని సరిదిద్దుకోవాలని తాను అడగబోనన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానున్న నేపథ్యంలో తమకు న్యాయబద్ధంగా దక్కాల్సిన హక్కులను ప్రభుత్వాన్ని అడుగుతామని, అనవసరమైన పదవులు, చట్టవిరుద్ధమైన ప్రయోజనాల కోసం తాము ఆశపడబోమని పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: ఒహియోలో వివేక్ రామస్వామి సంచలనం


