చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్‌ పోస్ట్‌ | Robert Kiyosaki Massive Warning MOST POWERFUL FINANCIAL POSITION CHANGES HANDS | Sakshi
Sakshi News home page

చేతులు మారుతున్న ‘ప్రపంచ ఆర్థిక శక్తి’.. కియోసాకి వైరల్‌ పోస్ట్‌

May 4 2026 1:45 PM | Updated on May 4 2026 2:21 PM

Robert Kiyosaki Massive Warning MOST POWERFUL FINANCIAL POSITION CHANGES HANDS

ప్రముఖ ఆర్థిక వ్యాఖ్యాత, 'రిచ్ డాడ్ పూర్ డాడ్' (Rich Dad Poor Dad ) రచయిత రాబర్ట్ కియోసాకి (Robert Kiyosaki) ప్రపంచ ఇన్వెస్టర్లను మరోసారి హెచ్చరించారు. సరిగ్గా 12 రోజుల్లో, అంటే మే 15న, ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన ఆర్థిక పీఠం (అమెరికా ఫెడరల్ రిజర్వ్ చైర్మన్) చేతులు మారబోతోంది. అయితే మెజారిటీ ప్రజలకు దీని పర్యవసానాలు ఏంటో తెలియడం లేదని ఆయన ఆందోళన వ్యక్తం చేస్తూ సోషల్‌ మీడియాలో ఆయన ఓ పోస్ట్‌  చేశారు.

వార్ష్ చేతుల్లోకి పగ్గాలు..
గత ఎనిమిదేళ్లుగా ఫెడ్ చైర్మన్‌గా ఉన్న జెరోమ్ పావెల్ మే 15న పదవి నుంచి తప్పుకుంటున్నారు. ఆయన స్థానంలో డొనాల్డ్ ట్రంప్ నమ్మకస్తుడు కెవిన్ వార్ష్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు. గత 50 ఏళ్లలో ఏ ఫెడ్ చైర్మన్ ఎదుర్కోనంతటి భయంకరమైన ఆర్థిక పరిస్థితుల మధ్య వార్ష్ పదవిలోకి వస్తున్నారని కియోసాకి విశ్లేషించారు.

వార్ష్ ముందున్న సవాళ్లు ఇవే..
చమురు మంట: బ్యారెల్ ఆయిల్ ధర 120 డాలర్ల వద్ద ఉంది.
ద్రవ్యోల్బణ సెగ: 3.3 శాతంతో ద్రవ్యోల్బణం గత రెండేళ్ల గరిష్టానికి చేరింది.
వడ్డీ రేట్ల సందిగ్ధత: ఇరాన్ యుద్ధం కారణంగా ఇంధన ధరలు పెరగడంతో, ఫెడ్ వడ్డీ రేట్లను 3.5% - 3.75% వద్దే కొనసాగించాల్సి వస్తోంది.

కియోసాకి మాటల్లో 'వార్ష్ ట్రాప్'
కెవిన్ వార్ష్ ఒక ప్రమాదకరమైన ఉచ్చులో చిక్కుకున్నారని కియోసాకి అభివర్ణించారు. ఆయన ముందున్నవి కేవలం మూడు మార్గాలు, ఆ మూడూ నష్టదాయకమే. రేట్లు తగ్గించడం: రేట్లు తగ్గిస్తే, అప్పటికే మండుతున్న ద్రవ్యోల్బణంపై పెట్రోల్ పోసినట్లవుతుంది.
రేట్లు మార్చకపోవడం: ఇది అధ్యక్షుడు ట్రంప్‌ను నిరాశపరచడమే కాకుండా, యుద్ధం వల్ల కునారిల్లుతున్న ఆర్థిక వ్యవస్థను మరింత దెబ్బతీస్తుంది.
రేట్లు పెంచడం: ఇది దేశాన్ని నేరుగా ఆర్థిక మాంద్యం (Recession)లోకి నెట్టివేస్తుంది.

 

తొలగని పావెల్ నీడ!
ఈ కథనంలో మరో ఆసక్తికరమైన మలుపు ఏంటంటే.. చైర్మన్ పదవి నుంచి దిగిపోయినా, జెరోమ్ పావెల్ ఫెడ్ బోర్డు నుంచి వెళ్లడం లేదు. 2028 వరకు ఆయన బోర్డు మెంబర్‌గా కొనసాగుతారు. 1951 తర్వాత ఒక మాజీ చైర్మన్ ఇలా బోర్డులో ఉండిపోవడం ఇదే తొలిసారి. అంటే, ట్రంప్ తనకిష్టమైన వారిని ఆ సీటులో కూర్చోబెట్టి వడ్డీ రేట్లు తగ్గించేలా చక్రం తిప్పాలని చూసినా, పావెల్ అక్కడ ‘వాచ్ డాగ్’లా అడ్డుపడే అవకాశం ఉంది.

అసలు బాస్ ఎవరు?
కియోసాకి విశ్లేషణ ప్రకారం.. ఇప్పుడు ఫెడ్ చైర్మన్ ఎవరన్నది ముఖ్యం కాదు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసిస్తోంది వార్ష్ కాదు, ట్రంప్ అంతకన్నా కాదు. కేవలం 21 మైళ్ల వెడల్పు ఉన్న 'హార్ముజ్ జల సంధి' (Strait of Hormuz).

"ఆ జలసంధి గుండా చమురు ట్యాంకర్ల ప్రయాణం సాధారణ స్థితికి వచ్చే వరకు.. ద్రవ్యోల్బణం 2%కి తగ్గే వరకు.. ఫెడ్ రేట్లు తగ్గించే సాహసం చేయలేదు. ఎవరు చైర్మన్ సీటులో కూర్చున్నా సరే.. ప్రస్తుతానికి 'హార్ముజ్ జలసంధి' మాత్రమే ప్రపంచ ఆర్థిక గమనాన్ని నిర్ణయిస్తోంది." అని కియోసాకి తేల్చి చెప్పారు.

ఇన్వెస్టర్లు కేవలం వ్యక్తుల మార్పును మాత్రమే కాకుండా, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలను గమనించాలని కియోసాకి సూచించారు. వార్ష్ రాకతో అద్భుతాలు జరుగుతాయని ఆశించడం కంటే, క్షేత్రస్థాయి పరిస్థితులను అర్థం చేసుకోవడం మేలని ఆయన పోస్ట్ సారాంశం.

Advertisement
 
Advertisement
Advertisement