బిల్లును టికెట్ అనుకుంటే.. టీటీఈలు వాయించేస్తారు! | Rail One App Confusion, Indian Railways Ticketing Issue Leads To Fines And Passenger Disputes Over Invoice Misuse | Sakshi
Sakshi News home page

బిల్లును టికెట్ అనుకుంటే.. టీటీఈలు వాయించేస్తారు!

May 3 2026 11:10 AM | Updated on May 3 2026 1:31 PM

Rail One App Confusion: Invoices Mistaken for Tickets Lead to Heavy Fines

న్యూఢిల్లీ: భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ‘రైల్ వన్’ (Rail One) యాప్ ఇప్పుడు ప్రయాణికుల పాలిట తలనొప్పిగా మారింది. యాప్‌లో బుక్ చేసిన వెంటనే వచ్చే ఒక చిన్న ‘బిల్లు’ (ఇన్‌వాయిస్), రైళ్లలో  వివాదాలకు దారి తీస్తోంది. అది అసలు టికెట్టే కాదని, కేవలం బిల్లు మాత్రమేనని టీటీఈలు చెబుతుంటే.. ప్రయాణికులు నివ్వెరపోతూ భారీగా జరిమానాలు కట్టాల్సి వస్తోంది. ఇంతకీ ఈ యాప్‌లో అసలు ఏం జరుగుతోంది?

టికెట్ కాదు.. అది కేవలం ‘బిల్లు’ మాత్రమే
గతంలో ఉన్న అన్‌రిజర్వ్‌డ్ టికెటింగ్ సిస్టమ్ (యూటీఎస్‌) యాప్ సేవలను రైల్వే శాఖ ఇటీవల ‘రైల్ వన్’ యాప్‌లోకి అనుసంధానం చేసింది. అయితే, సాధారణ బోగీల్లో ప్రయాణించడానికి ఈ యాప్‌లో టికెట్ బుక్ చేసినప్పుడు, రీయింబర్స్‌మెంట్ కోసం ఒక ఇన్‌వాయిస్ (బిల్లు) జనరేట్ అవుతోంది. దీన్నే అసలైన టికెట్ అని అనుకుంటున్న చాలా మంది ప్రయాణికులు, రైలెక్కి స్లీపర్ లేదా ఏసీ క్లాస్‌కు అప్‌గ్రేడ్ చేయమని టీటీఈలను కోరుతున్నారు. తీరా అది ప్రయాణానికి పనికిరాదని టీటీఈలు తేల్చిచెబుతూ ఫైన్లు వేస్తుండటంతో, వేరొకరు బుక్ చేసి పంపారని ప్రయాణికులు వాదనలకు దిగుతున్నారు.

స్క్రీన్‌షాట్ రాదు.. షేర్ చేస్తే చిక్కులే
ఆ ఇన్‌వాయిస్ అడుగు భాగంలో స్పష్టంగా ‘ఇది ప్రయాణ టికెట్ కాదు’ అని రాసి ఉన్నప్పటికీ, ఎవరూ దానిని గమనించడం లేదు. పాత యూటీఎస్ యాప్‌లో బుకింగ్ సమయంలో ఇలాంటి బిల్లు వచ్చేది కాదు. దానికి తోడు, సరికొత్త రైల్ వన్ యాప్‌లో టికెట్ స్క్రీన్‌షాట్ తీయడం కుదరదు. కానీ, అక్కడే ఉన్న ‘షేర్’ ఆప్షన్ ద్వారా పంపితే కేవలం ఇన్‌వాయిస్ మాత్రమే ఇతరులకు వెళ్తోంది. ఆప్షన్‌లో పేపర్‌లెస్ టికెట్ విధానం మాత్రమే ఉండటంతో, షేర్ చేసిన ఆ బిల్లునే అసలు సిసలైన టికెట్ అని ప్రయాణికులు పొరబడుతూ నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు.

ప్రయాణం పూర్తయ్యాకే బిల్లు ఇవ్వాలి
ఈ గందరగోళానికి చెక్ పెట్టాలంటే రైల్వే శాఖ తక్షణ చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది. ప్రయాణ సమయం ముగిసిన తర్వాతే ఇన్‌వాయిస్ జనరేట్ అయ్యేలా నిబంధనలు మారిస్తే ఈ సమస్యను చాలా వరకు తగ్గించవచ్చని త్రిస్సూర్ రైల్వే ప్యాసింజర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ పి. కృష్ణకుమార్ సూచిస్తున్నారు. అలాగే ప్రయాణికులకు దీనిపై విస్తృతంగా అవగాహన కల్పించాలని, ఇన్‌వాయిస్‌ల దుర్వినియోగాన్ని అరికట్టేలా రైల్ వన్ యాప్‌లో తగిన మార్పులు తీసుకురావాలని ఆయన రైల్వేను కోరారు.

ఇది కూడా చదవండి: ఎయిర్‌పోర్టుల్లో గందరగోళం... అసలేం జరుగుతోంది?

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement