న్యూఢిల్లీ, సాక్షి : ‘‘పుస్తకం హస్తభూషణం’’ అనేమాట దాదాపు మర్చిపోతున్నాం. చిన్నా పెద్దా అందరికీ మొబైలే సర్వస్వంగా మారిపోయింది. రెండేళ్లలోపు పిల్లలు అతిగా మొబైల్ ఫోన్లు వాడటం వల్ల వారిలో ఆటిజం స్పెక్ట్రమ్ డిజార్డర్ (ASD) వచ్చే ముప్పు పెరుగుతుందని న్యూఢిల్లీలోని ఆల్ ఇండియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) తాజా అధ్యయనం వెల్లడించింది.
ఎయిమ్స్ పీడియాట్రిక్ న్యూరాలజీ విభాగం హెడ్ ప్రొఫెసర్ షెఫాలీ గులాటి మాట్లాడుతూ, పిల్లల పెంపకంలో మానవీయ కోణం చాలా ముఖ్యమని నొక్కి చెప్పారు. "ప్రతి బిడ్డకు గౌరవప్రదమైన జీవితాన్ని గడిపే హక్కు ఉంది. పిల్లల్లో ఆటిజం లక్షణాలు కనిపిస్తే, తల్లిదండ్రులు వెంటనే పీడియాట్రిక్ న్యూరాలజిస్ట్ లేదా డెవలప్‌మెంటల్ పీడియాట్రీషియన్‌ను సంప్రదించాలి" అని ఆమె సూచించారు.
పుట్టినప్పటి నుండి 18 నెలల మధ్య కాలంలో తల్లిదండ్రులు స్క్రీన్ ఎక్స్‌పోజర్‌కు అనుమతించిన పిల్లలలో ఆటిజం మరియు ఇతర తీవ్రమైన రుగ్మతలు గణనీయంగా ఎక్కువగా ఉన్నాయని ఈ పరిశోధన పేర్కొంది. చిన్న వయస్సులోనే ఎక్కువసేపు స్క్రీన్ టైమ్ గడపడం వల్ల ఆటిజం వచ్చే ప్రమాదం పెరుగుతుందని గత అధ్యయనాలు, మెటా-విశ్లేషణలు నిరూపించాయని, అంతేకాకుండా, ఆటిజం ఉన్న పిల్లలను ఇతర పిల్లలతో పోల్చి తాము చేసిన అధ్యయనంలో, ఆటిజం ఉన్న పిల్లలు ముందుగానే, ఎక్కువ సేపు స్క్రీన్ టైమ్ వాడారని వెల్లడైందని గులాటి వివరించారు. అలాగే పిల్లలతో వ్యక్తిగత సంభాషణ ప్రాముఖ్యతను గులాటి నొక్కిచెప్పారు, “మనం పిల్లలతో వ్యక్తిగతంగా ఎంత ఎక్కువగా సంభాషిస్తే, అది అంత ముఖ్యం” అని ఆమె పేర్కొన్నారు.
ఆటిజం లక్షణాలు
ఆటిజం వల్ల పిల్లల్లో కమ్యూనికేషన్ సమస్యలు, ప్రవర్తనా తీరుమార్పులు ఎదుగుదలలో లోపాలతో తదితర మార్పులొచ్చే అవకాశం ఉంది:
మాటలు రావడం ఆలస్యం కావడం, తమ అవసరాలను వ్యక్తపరచడంలో ఇబ్బంది పడటం.
కళ్ళలోకి చూసి మాట్లాడలేకపోవడం (Limited eye contact), ఇతరులతో కలవలేకపోవడం.
ఒకే పనిని పదేపదే చేయడం, శబ్దాలు లేదా కాంతి పట్ల అతిగా స్పందించడం.
నేర్చుకోవడంలో ఇబ్బందులు: మేధోపరమైన నైపుణ్యాల అభివృద్ధిలో అసమానతలు ఉండటం.
ఇండియా గణాంకాలు
ఐసిఎంఆర్ (ICMR) సర్వే ప్రకారం, నగరాల్లోని 65% మంది చిన్నారులు రోజుకు 2 గంటల కంటే ఎక్కువ సమయం మొబైల్ చూస్తున్నారు.
ఆటిజం వ్యాప్తి డబ్ల్యూహెచ్‌ఓ (WHO) అంచనాల ప్రకారం, భారతదేశంలో ప్రతి 100 మంది పిల్లల్లో ఒకరు ఆటిజం బారిన పడుతున్నారు.
అవగాహన లోపం టైర్-2 నగరాల్లో దాదాపు 70% మంది తల్లిదండ్రులు మొబైల్‌ను 'డిజిటల్ బేబీసిట్టర్'గా (పిల్లలను బుజ్జగించడానికి) వాడుతున్నారు.
వైద్యుల ఏమంటున్నారంటే
బాల్యం అనేది మానవ సంబంధాలు, ఆటపాటలు మరియు ఇంద్రియాల ద్వారా నేర్చుకునే ప్రక్రియలతో నిండి ఉండాలి, కానీ స్క్రీన్లతో కాదు. మొబైల్ ఫోన్ల వినియోగాన్ని పరిమితం చేయాలని మరియు పిల్లల ఎదుగుదలలో ఏవైనా లోపాలు కనిపిస్తే వెంటనే వైద్య సలహా తీసుకోవాలని ఎయిమ్స్ అధ్యయనం తల్లిదండ్రులను హెచ్చరిస్తోంది.


