ఏకంగా కంపెనీల పేర్లే మార్చేస్తూ జీవోలు జారీ
క్రేయాన్ టెక్నాలజీ, ఎస్‌సీఐసీవెంచర్స్ కంపెనీల పేర్లు ఒకదానికొకటి మార్చేసిన ప్రభుత్వం
ఆ తప్పులను జనవరిలో ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చిన యాజమాన్యం
ఆ తప్పుడు జీవోలో పేర్లు మార్చడానికి ఏకంగా ఆరు నెలల సమయం తీసుకున్న క్వాంటమ్
కంప్యూటింగ్ సర్కారు
ఇదేనా స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటున్న పారిశ్రామికవేత్తలు
సాక్షి, అమరావతి: క్వాంటమ్ కంప్యూటింగ్... ఈ పదాన్ని చంద్రబాబు సర్కారు రాష్ట్రంలో బాగా ప్రచారం చేస్తోంది. ఎటువంటి సమస్యకైనా మిల్లీ సెకన్లలో పరిష్కారం చూపించే సత్తా ఉందంటూ ఊదరగొడుతోంది. కానీ క్వాంటమ్ కంప్యూటింగ్‌ను పర్యవేక్షించే మంత్రి నారా లోకేశ్ శాఖ మాత్రం తప్పుడు జీవోలు జారీ చేసే శాఖగా మారిపోయింది. ఏకంగా జీవోల్లో కంపెనీల పేర్లనే మార్చేస్తూ ఉత్తర్వులు జారీ చేస్తున్నారు.
తీరా దొంగలు పడ్డ ఆరు నెలలకు కుక్కలు మొరిగినట్లు.. తప్పు జరిగిన ఆరు నెలల తర్వాత నిదానంగా నిద్రలేచిన లోకేశ్ టీం తప్పులను సరిదిద్దుతూ తాజాగా ఉత్తర్వులు జారీ చేయడంతో చంద్రబాబు బడాయి మాటల బండారం ప్రపంచానికి తెలిసిపోయింది. అసలేం జరిగిందంటే...
కంపెనీల పేర్లనే పూర్తిగా మార్చేసి జీవోలు..
గతేడాది నవంబర్ నెలలో ఐటీ శాఖ ఎస్‌సీఐసీబీ వెంచర్స్ ఎల్‌ఎల్‌పీ అనే సంస్థ రూ.550 కోట్లతో శ్రీ సిటీలో ఎలక్ట్రానిక్ పరికరాల తయారీ యూనిట్ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతూ జీవో ఎంఎస్ నెంబర్ 49.., క్రేయాన్ టెక్నాలజీ రూ.1,079 కోట్లతో ఐటీ ఎన్‌క్లౌంజర్స్, పీసీబీ బేరబోర్డు యూనిట్ ఏర్పాటును ఆమోదిస్తూ జీవో ఎంఎస్ నెంబర్ 60ను ప్రభుత్వం విడుదల చేసింది.
అయితే జీవోల్లో కంపెనీల పేర్లను ఒకదానికి బదులు ఇంకో కంపెనీ పేరును పేర్కొంటూ అధికారులు కళ్లు మూసుకొని ఉత్తర్వులు జారీ చేసేశారు. ఒక జీవో జారీ చేసే ముందు సెక్షన్ ఆఫీసర్ దగ్గర నుంచి ఆ శాఖ అడిషనల్ సెక్రటరీ, సెక్రటరీ, ఫైనాన్స్, సీఎస్, సీఎంవో ఇలా అనేక మందిని దాటుకొని రావాల్సి ఉంటుంది. అలాంటిది... ఎక్కడా కూడా జరిగిన పొరపాటును గుర్తించలేదంటే ప్రభుత్వం ఏ స్థాయిలో పనిచేస్తోందో అర్థం చేసుకోవచ్చు.
ఆరు నెలల తర్వాత పేర్లు మార్చి...
జీవోలు బయటకు రాగానే కంపెనీల యాజమాన్యాలు జరిగిన తప్పును వెంటనే ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తే దాన్ని సరిదిద్దడానికి ఏకంగా ఆరు నెలల సమయం తీసుకొంది. చివరకు జనవరిలో విశాఖ కేంద్రంగా జరిగిన సీఐఐ పెట్టుబడుల సమావేశంలో ఈ రెండు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకుంటున్నప్పుడూ కూడా ఆ కంపెనీల ప్రతినిధులు జరిగిన తప్పిదాన్ని మరోసారి అధికారుల దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకుండా పోయింది. నవంబర్ 2025లో జారీ చేసిన తప్పుడు జీవోలను సవరిస్తూ ఏప్రిల్ 2026లో జీవోలను జారీ చేశారు.
జీవో జారీ అయ్యే సమయంలో వివిధ దశల్లో ఒక గుమస్తా అనుకోకుండా చేసిన తప్పు వల్ల కంపెనీల పేర్లు మారాయంటూ చేతులు దులిపేసుకున్నారు. తప్పుడు జీవోల్లోని పేర్లు మార్చేందుకే ఆరు నెలల సమయం తీసుకున్నారని.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అంటే ఇదేనా అని పలువురు పారిశ్రామికవేత్తలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.


