కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్‌! | ED raids Punjab university Row: Who Is Ashok Mittal? | Sakshi
Sakshi News home page

కీలక పదవి దక్కిన వెంటనే ఈడీ రైడ్స్‌!

Apr 15 2026 11:23 AM | Updated on Apr 15 2026 11:31 AM

రాఘవ్‌ చద్దాతో అశోక్‌ మిట్టల్‌ (ఫైల్‌ ఫొటో)

న్యూఢిల్లీ: ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ దాడులతో పంజాబ్‌ ఒక్కసారిగా ఉలిక్కి పడింది. ప్రముఖ వ్యాపారవేత్త, ఆమ్‌ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ అశోక్‌ మిట్టల్‌కు చెందిన అనేక ప్రదేశాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. వీటిల్లో దేశంలోనే ప్రముఖ విద్యాసంస్థగా పేరున్న లవ్లీ ప్రొఫెషనల్‌ యూనివర్సిటీ కూడా ఉంది. 

ఈడీ అధికార వర్గాలు వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆప్‌ రాజ్యసభ సభ్యుడు అశోక్ మిట్టల్‌ నివాసం, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. ఆయనకు సంబంధించిన వ్యాపార, విద్యా సంస్థల్లో ఈడీ బృందాలు క్షుణ్ణంగా తనిఖీలు జరుపుతున్నాయి. పంజాబ్‌తో పాటు గురుగ్రామ్‌లో 8-9 ప్రదేశాల్లో.. ఏకకాలంలో ఇవి జరుగుతున్నాయి. ఇప్పటికే ఎల్పీయూలోని పలు విభాగాల రికార్డులను పరిశీలించారు. ఆర్థిక లావాదేవీల్లో అవకతవకలు జరిగాయనే అనుమానాలపై దర్యాప్తు కొనసాగుతోంది. 

రాఘవ్‌ చద్దా తీరుతో విసిగిపోయిన ఆప్‌ ఆయన్ని పక్కనపెట్టి ఏప్రిల్‌ 2వ తేదీన అశోక్ మిట్టల్‌ను రాజ్యసభ ఉపనేతగా నియమించింది. ఈ క్రమంలో పార్టీ లోపల కీలక స్థానంలోకి వచ్చిన కొద్ది రోజులకే ఈడీ రైడ్స్‌ జరగడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది.

ఎవరీ అశోక్‌ మిట్టల్‌
అశోక్ మిట్టల్ ప్రముఖ వ్యాపారవేత్త. అంతేకాదు లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ (LPU) స్థాపకుడు, ఛాన్సలర్ కూడా. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల తర్వాత ఆప్‌ ఆయనను రాజ్యసభకు నామినేట్ చేయగా..  ఎన్నిక ఏకగ్రీవమైంది. మిట్టల్ 2024లో పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ ఆన్ ఫైనాన్స్ సభ్యుడిగా కూడా నియమితులయ్యారు. 

ఇప్పటికే ఆప్‌ నేతలు పలువురు కేసులు, విచారణలు ఎదుర్కొంటున్నారు. తాజా ఈడీ రైడ్స్‌ పరిణామాన్ని ఆప్ పార్టీకి పెద్ద దెబ్బగా రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అయితే ఆప్‌ మాత్రం రాజకీయ ఒత్తిళ్లతో జరుగుతున్న దాడులుగా ఆరోపిస్తోంది. 

Advertisement
 
Advertisement
Advertisement