ఆ నటుడికి అరుదైన బ్రెస్ట్‌ కేన్సర్‌..!ఎందువల్ల వస్తుందంటే.. | Actor Tyler Mane Diagnosed With Breast Cancer | Sakshi
Sakshi News home page

Male Breast Cancer: ఆ నటుడికి అరుదైన బ్రెస్ట్‌ కేన్సర్‌..!ఎందువల్ల వస్తుందంటే..

Jun 12 2026 4:50 PM | Updated on Jun 12 2026 5:16 PM

Actor Tyler Mane Diagnosed With Breast Cancer

రొమ్ము కేన్సర్‌ అంటే మహిళలకే వస్తుందని అనుకుంటారు. కానీ పురుషులకు కూడా వస్తుందట. అయితే పురుషుల్లో ఇది అత్యంత అరుదు. మరి మగవాళ్లలో ఈ కేన్సర్‌ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి?, ఎందువల్ల వస్తుంది?, నివారణ చర్యలు తదితరాల గురించి సవివరంగా తెలుసుకుందామా.!.

హాలీవుడ్‌ నటుడు, మాజీ ప్రొఫెషనల్‌ రెజ్లర్‌, టైలర్ మానేకు బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉన్నట్లు వైద్యులు ఇటీవలే నిర్థారించారు. అందుకోసం కీమోథెరపీ చేయించుకుంటున్నట్లు కూడా తెలిపారు. 59 ఏళ్ల హీరో పురుషుల రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించడం కోసం ఇన్‌స్టాగ్రామ్‌లో ఇలా రాసుక్చొఆరు. అవును నాకు బ్రెస్ట్‌ కేన్సర్‌ ఉంది. ఇది చాలా అరుదైనది, పైగా ఇది 1% మంది మగవాళ్లే ఈ సమస్య బారిన పడతారట. నిజం చెప్పాలంటే మొదట బహిరంగంగా మాట్లాడాలనుకోలేదు. 

కానీ తర్వాత నాకు తెలిసిందేంటంటే..దీని గురించి మాట్లాడకపోవడం, దీనికోసం తెలుసుకోకపోవడం వల్లే పురుషులలో ఈ వ్యాధి చాలామటుకు లాస్ట్‌ స్టేజ్‌లో నిర్థారిస్తున్నట్లు తెలిసింది. ఆ నేపథ్యంలోనే దీని గురించి మాట్లాడాలని నిర్ణయించుకున్నా. డాక్టర్లంతా కొట్టిపారేసినా..నా భార్య ఆ గడ్డను తొలగించుకోమని ఒత్తిడి చేయడంతోనే ముందుగానే చికిత్స తీసుకుంటున్నా. ప్రతి 755 మంది పురుషులలో ఒకరికి వారి జీవితకాలంలో రొమ్ము కేన్సర్‌ నిర్థారణ అవుతున్నట్లు వైద్యులు తెలిపారు. దీన్ని ముందుగానే గుర్తింస్తే..చికిత్స చేయడం సులభం. అందువల్ల ఇకనైనా మేల్కోవాలి, తక్షణమే స్పందించాలి అని పిలుపునిచ్చారు.

పురుషుల రొమ్ము కేన్సర్ అంటే
రొమ్ము కణజాలంలోని అసాధారణ కణాలు అనియంత్రితంగా పెరిగి కణితిగా ఏర్పడినప్పుడు పురుషులలో రొమ్ము కేన్సర్ వస్తుంది. పురుషులకు రొమ్ము కణజాలం తక్కువగా ఉంటుంది, అంటే అక్కడ కేన్సర్ వచ్చే అవకాశం ఉంది, అయినప్పటికీ ఇది మహిళలతో పోలిస్తే తక్కువ.

కేన్సర్ లక్షణాలు
ప్రారంభ సంకేతాలను గుర్తించడం సకాలంలో రోగ నిర్ధారణ, చికిత్సకు సహాయపడుతుంది.

కొన్ని సాధారణ లక్షణాలు:

  • రొమ్ములో గడ్డ లేదా వాపు

  • రొమ్ము కణజాలం గట్టిపడటం

  • రొమ్మును కప్పి ఉంచే చర్మంలో మార్పులు, ఎరుపు లేదా గుంటలు పడటం వంటివి

  • చనుమొన నొప్పి లేదా సున్నితత్వం

  • లోపలికి తిరిగిన చనుమొన

  • చనుమొన నుండి స్రావం, కొన్నిసార్లు రక్తంతో కూడి ఉండవచ్చు

  • చంక కింద శోషరస గ్రంథులు వాపు

  • నిరంతర పుండ్లు లేదా చనుమొనల చుట్టూ మార్పులు

పురుషులు తమ ఛాతీ లేదా రొమ్ము ప్రాంతంలో ఏవైనా అసాధారణ మార్పులను నిర్లక్ష్యం చేయకూడదు. ఒకవేళ గడ్డ నొప్పిలేకుండా ఉన్నప్పటికీ, దానిని ఆరోగ్య నిపుణుడిచే పరీక్ష చేయించుకోవాలి.

పురుషులలో రొమ్ము కేన్సర్‌కు ప్రమాద కారకాలు
అనేక కారకాలు పురుషులలో రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాన్ని పెంచుతాయి. వాటిలో ఇవి ఉన్నాయి:

వయస్సు పెరగడం: చాలా కేసులు 60 ఏళ్లు పైబడిన పురుషులలో నిర్ధారణ అవుతాయి. సాధారణంగా వయస్సు పెరిగే కొద్దీ ప్రమాదం పెరుగుతుంది.

కుటుంబ చరిత్ర: దగ్గరి బంధువులకు రొమ్ము క్యాన్సర్ ఉన్న పురుషులకు ప్రమాదం ఎక్కువగా ఉండవచ్చు. వంశపారంపర్యంగా వచ్చే జన్యు మార్పులు కూడా ఒక పాత్ర పోషిస్తాయి.

జన్యు మార్పులు: కొన్ని జన్యువులలో, ముఖ్యంగా BRCA2 జన్యువులో మార్పులు, పురుషులలో రొమ్ము కేన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా పెంచుతాయి.

హార్మోన్ల అసమతుల్యత: ఈస్ట్రోజెన్ స్థాయిలు ఎక్కువగా ఉండటం లేదా టెస్టోస్టెరాన్ స్థాయిలు తక్కువగా ఉండటం రొమ్ము కేన్సర్ అభివృద్ధికి దోహదపడవచ్చు.

స్థూలకాయం: శరీరంలో అధిక కొవ్వు ఈస్ట్రోజెన్ స్థాయిలను పెంచుతుంది, ఇది ప్రమాదాన్ని పెంచవచ్చు.

కాలేయ వ్యాధి: సిర్రోసిస్ వంటి పరిస్థితులు హార్మోన్ల సమతుల్యతను ప్రభావితం చేసి, కేన్సర్‌కు గురయ్యే అవకాశాన్ని పెంచుతాయి.

రేడియేషన్ ప్రభావం: గతంలో ఛాతీ ప్రాంతానికి రేడియేషన్ చికిత్స చేయించుకోవడం వల్ల.. రొమ్ము కేన్సర్ వచ్చే అవకాశాలు పెరగవచ్చు.

నివారణ

  • రొమ్ము కేన్సర్‌ను పూర్తిగా నివారించడం ఎల్లప్పుడూ సాధ్యం కానప్పటికీ, కొన్ని జీవనశైలి ఎంపికలు ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడతాయి. ప్రమాదం.

  • అధిక బరువు ఉండటం అనేది అధిక ఈస్ట్రోజెన్ స్థాయిలతో ముడిపడి ఉంటుంది. క్రమం తప్పని వ్యాయామం, సమతుల్య ఆహారం ఆరోగ్యకరమైన శరీర బరువును నిర్వహించడానికి సహాయపడతాయి.

  • అధికంగా మద్యం సేవించడం వల్ల రొమ్ము కేన్సర్‌తో సహా అనేక కేన్సర్ల ప్రమాదం పెరగవచ్చు.

  • క్రమం తప్పని శారీరక శ్రమ హార్మోన్ల స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుంది, మొత్తం ఆరోగ్యానికి తోడ్పడుతుంది.

  • కుటుంబంలో రొమ్ము క్యాన్సర్ చరిత్ర ఉన్న పురుషులు తమ ప్రమాదం గురించి ఆరోగ్య సంరక్షణ నిపుణులతో చర్చించాలి. కొన్ని సందర్భాల్లో, జన్యుపరమైన కౌన్సెలింగ్ సిఫార్సు చేయవచ్చు కూడా.

  • క్రమం తప్పని ఆరోగ్య పరీక్షలు సత్వరమే సమస్యను గుర్తించడానికి సహాయపడతాయి. 

  • రొమ్ము మార్పుల గురించి అవగాహన పెంచుకోవాలి. పురుషులు తమ ఛాతీ ప్రాంతంలోని సాధారణ స్వరూపం, స్పర్శ గురించి తెలుసుకోవాలి. ఏవైనా గడ్డలు, వాపు లేదా చనుమొనలలో మార్పులను ఆలస్యం చేయకుండా వైద్యుడికి తెలియజేయడం వలన ముందుగానే ఈ సమస్య నుంచి సత్వరమే బయటపడే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి.

 

గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. 

(చదవండి: అందుకే అంత లావు..! భావోద్వేగంలో నటుడు అనుపమ్‌ ఖేర్‌)

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement