బర్లింగ్టన్: కెనడాలోని బర్లింగ్టన్‌లో ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్న పంజాబ్‌కు చెందిన మన్‌దీప్ సింగ్ (25) లైంగిక దాడి ఆరోపణలపై అరెస్టయ్యాడు. హాల్టన్ ప్రాంతీయ పోలీసు సేవల (హెచ్‌ఆర్‌పీఎస్)వివరాల ప్రకారం, గత నెల జూన్ 16న సాయంత్రం 5:15 గంటలకు బర్లింగ్టన్ గో స్టేషన్ పార్కింగ్ స్థలంలో ఈ సంఘటన జరిగింది. మన్‌దీప్ సింగ్ బాధితురాలితో మాట్లాడే సమయంలో ఆమెపై లైంగిక దాడికి పాల్పడ్డాడు. అక్కడి నుంచి మహిళ వెంటనే పారిపోవడానికి ప్రయత్నించగా, నిందితుడు ఆమెను సమీపంలోని ఒక వ్యాపార కేంద్రం వరకు వెంబడించి రెండోసారి కూడా లైంగిక దాడికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు.
ఈ సంఘటనలో బాధితురాలికి ఎలాంటి శారీరక గాయాలు కాకపోయినప్పటికీ, ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ కేసు దర్యాప్తును చైల్డ్ అబ్యూజ్ అండ్ సెక్సువల్ అసాల్ట్ యూనిట్ చేపట్టింది. దర్యాప్తులో భాగంగా ఎటోబికోక్ నివాసి అయిన మన్‌దీప్ సింగ్‌ను జూలై 26న పోలీసులు అరెస్టు చేశారు. అతనిపై లైంగిక దాడి అభియోగాలను మోపి, మిల్టన్‌లో బెయిల్ విచారణ నిమిత్తం అదుపులో ఉంచారు. నేరం జరిగిన సమయంలో నిందితుడు ఉబర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నందున, మరికొందరు బాధితులు ఉండే అవకాశం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ కేసుకు సంబంధించి ఎవరి దగ్గరైనా సమాచారం ఉంటే తమను సంప్రదించాలని అధికారులు ప్రజలను కోరారు.


