జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు | Arrest of accused in double assassination case | Sakshi
Sakshi News home page

జంటహత్యల కేసులో నిందితుల అరెస్టు

Jul 28 2026 4:49 AM | Updated on Jul 28 2026 4:49 AM

Arrest of accused in double assassination case

సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్, గుడివాడ ఎమ్మెల్యే రాముతో నిందితుడు కళ్యాణ్‌ (ఫైల్‌)

మామాఅల్లుళ్లను హతమార్చిన టీడీపీ కార్యకర్తలు 

కృత్తివెన్ను: కృష్ణా జిల్లా కృత్తివెన్ను మండలం చినగొల్లపాలెంలో జరిగిన జంట హత్యల కేసు మిస్టరీ ఎట్టకేలకు వీడింది. మామాఅల్లుళ్లను హతమార్చిన ఆరుగురు టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్‌ చేశారు. ఈ కేసు వివరాలను బందరు డీఎస్పీ జి.శ్రీనివాసరావు సోమవారం వెల్లడించారు. ఆయన కథనం మేరకు.. జూన్‌ 27వ తేదీ రాత్రి పాతగొడవల నేపథ్యంలో చినగొల్లపాలెం ఎస్టీ కాలనీకి చెందిన మామాఅల్లుళ్లు శెట్టి సుబ్బన్న, గొలుసు అయ్యప్పను దారుణంగా హత్యచేశారు. 

అదే గ్రామానికి చెందిన శంకరపు శ్రీనుకు సుబ్బన్న, అయ్యప్పలతో చేపలవేట వద్ద ఘర్షణ జరిగింది. దీన్ని మనసులో పెట్టుకున్న శ్రీను అదే గ్రామానికి చెందిన జల్లా నాగరాజు, గుడివాడకు చెందిన నలుగురు స్నేహితుల సహకారంతో సుబ్బన్న, అయ్యప్పలపై కర్రలు, రాడ్డు, కత్తితో దాడిచేశారు. వారిద్దరినీ హతమర్చారు. అనంతరం మృతదేహాలను వారి ద్విచక్ర వాహనానికే కట్టి నీటిలో పడేశారు. కంకిపాడు సీఐ బి.బి.రవికుమార్, ఆర్‌పేట సీఐ కె.ఏసుబాబు, పెడన సీఐ నాగేంద్రప్రసాద్‌ మూడు బృందాలుగా ఏర్పడి దాదాపు నెలరోజుల పాటు సాంకేతిక అంశాల సాయంతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. 

ఎట్టకేలకు హత్యచేసింది శంకరపు శ్రీను, జల్లానాగరాజు,  పెదఎరుకపాడుకు చెందిన కటికల కల్యాణ్, అబ్బూరి విజయరత్నం (దాస్‌), యలవర్తిపాడుకు చెందిన డొక్కుమాల శ్రీకాంత్, గుడివాడ కార్మికనగర్‌కు చెందిన అబ్దుల్‌ఖాదర్‌జిలానీ అని గుర్తించారు. ఈ నెల 26వ తేదీ రాత్రి లక్ష్మీపురం సెంటర్‌లో ఉండగా వారందరినీ పెడన సీఐ నాగేంద్రప్రసాద్, కృత్తివెన్ను ఎస్‌ఐ పైడిబాబు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద ఒక కారు, ద్విచక్రవాహనం, ఏడు మొబైల్‌ఫోన్లు, హత్యకు ఉపయోగించిన కత్తి, ఇనుపరాడ్డు, కర్రను స్వా«దీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచారు. నెలరోజులపాటు ఎంతో శ్రమించి కేసును ఛేదించిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్‌నాయుడు అభినందించారు. 

అధికార పార్టీ అండతోనే.. 
జంటహత్యల కేసులో నిందితులు అధికార తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు. చినగొల్లపాలెంకు చెందిన నిందితులు ఆ పార్టీకి అత్యంత సానుభూతి పరులు. ఈ కారణంగానే హత్య జరిగినప్పటి నుంచి స్థానికంగా ఉన్న ఆ పార్టీ నాయకులు నిందితులు శ్రీను, నాగరాజు, కటికల కల్యాణ్‌ను రక్షించేందుకు అనేక యత్నాలు చేశారని ప్రచారం జరుగుతోంది. శ్రీనుతో పాటు నాగరాజును అనుమానించిన పోలీసులు కొద్ది రో­జుల క్రితం విచారణ పేరుతో తీసుకెళ్లారు. అయితే టీడీపీ నేతల ఒత్తిళ్లతో అనంతరం వారిని వదిలే­శా­రని సమాచారం. చివరికి అసలు నిందితులు వారే కావడంతో అరెస్టు చేయక తప్పలేదని తెలుస్తోంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement