ఐదేళ్లలో కొత్తగా 434 మంది బిలియనీర్లు
వీళ్లంతా రూ.100 కోట్లకుపైగా ఆదాయంతో ఐటీ రిటర్న్స్ సమర్పించారు
2021–22లో 142 మంది బిలియనీర్లు... ఇప్పుడు 576 మంది..
లోక్‌సభలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి వెల్లడి
సాక్షి, అమరావతి: దేశంలో కోటీశ్వరుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన ఐదేళ్లలో కొత్తగా 434 మంది బిలియనీర్లుగా ఎదిగారు. ఐదేళ్లలో దేశవ్యాప్తంగా బిలియనీర్ల సంఖ్య 142 నుంచి 576కు పెరిగినట్లు కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లోక్‌సభలో వెల్లడించారు. రూ.100 కోట్లకు పైగా ఆదాయ పన్ను ఐటీ రిటర్న్స్ దాఖలు చేసిన వారి ఆధారంగా బిలియనీర్ల సంఖ్యను లెక్కించినట్లు తెలిపారు. గడిచిన సంవత్సర కాలంగా ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆర్థిక సంక్షోభ పరిస్థితులు తలెత్తినా... మన దేశంలో మాత్రం కొత్తగా 161 మంది బిలియనీర్లుగా ఎదగడం విశేషం.
తగ్గుతున్న ఆర్థిక అసమానతలు
» దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంత ఆర్థిక అసమానతలు తగ్గుముఖం పట్టాయని పంకజ్ చౌదరి తెలిపారు.
» 2023–24 గృహ వినియోగ సర్వే ఆధారంగా చూస్తే పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో గినీ సూచిక (ఆర్థిక అసమానతలను తెలిపేది) తగ్గిందని పేర్కొన్నారు.
» 2022–23లో గ్రామీణ ప్రాంతాల్లో 0.266గా ఉన్న గినీ సూచిక. 2023–24లో 0.237కి, పట్టణాల్లో 0.314 నుంచి 0.284కు తగ్గిందన్నారు.
» కోవిడ్ తర్వాత 15 ఏళ్లకు పైబడిన వాళ్లలో 2022లో 3.6 శాతంగా ఉన్న నిరుద్యోగ శాతం 2025కి 3.1 శాతానికి తగ్గిందని వివరించారు.


