సాక్షి, అమరావతి: ఆగస్ట్ 1న విజయనగరం జిల్లాలోని భోగాపురం ఎయిర్‌పోర్ట్ వద్ద జరగనున్న ప్రధాని మోదీ బహిరంగ సభకు ప్రజలను తరలించే బాధ్యతను చంద్రబాబు ప్రభుత్వం గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల నెత్తిన పెట్టింది. ఉత్తరాంధ్ర జిల్లాల్లోని అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఈ సభకు మండలాల వారీగా ఎంత మందిని తరలించాలనే విషయంపై అధికారులకు టార్గెట్లు పెట్టారు. దీంతో ఎమ్మెల్యేల టార్గెట్ల మేరకు..సచివాలయ ఉద్యోగులకు ఒక్కొక్కరు ఎంతమందిని సభకు తరలించాలో పేర్కొంటూ ఆయా మండలాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు.
విజయనగరం జిల్లా రాజాం నియోజకవర్గంలో స్థానిక ఎమ్మెల్యే తమ పరిధిలోని 4 మండలాలతో పాటు రాజాం అర్బన్ ప్రాంతం నుంచి 1,500 మందిని తరలించాలని హుకుం జారీ చేశారు. ఆయా ఉద్యోగులు 1న ఉదయం 4 గంటలకే ఎంపీడీవో ఆఫీసు కంట్రోల్ రూంలో హాజరై జనాల తరలింపులో పాల్గొనాలని ఆదేశాల్లో పేర్కొన్నారు.


