సాక్షి,తిరుపతి: జనసేన పార్టీ రాజంపేట సోషల్ మీడియా ఇన్‌ఛార్జ్ శివకుమార్ (48) తిరుపతిలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కెనడీ నగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతుడు అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం నూనెవారిపల్లికి చెందినవాడిగా పోలీసులు గుర్తించారు.
శివకుమార్ ఈనెల 26న తన ఇంటి నుండి బయలుదేరి తమిళనాడులోని పలు దేవాలయాలను సందర్శించారు. అనంతరం తిరుపతి కెనడీ నగర్‌లో ఉంటున్న తన బంధువు చింతల రమణమూర్తి ఇంటికి చేరుకున్నారు. అక్కడ ఇంటి బాత్రూంలో శివకుమార్ ఉరివేసుకుని ప్రాణాలు విడిచారు. తీవ్ర మానసిక ఒత్తిడి, డిప్రెషన్ కారణంగానే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు మృతుడి భార్య కళ్యాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. భార్య ఫిర్యాదు మేరకు ఈస్ట్ ఎస్ఐ రామస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రస్తుతం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించారు.
మృతిపై ముసురుతున్న అనుమానాలు
శివకుమార్ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. తమిళనాడు పర్యటనలో ఉన్న సమయంలో పెరియపాలెంలో ద్విచక్ర వాహనాన్ని వదిలేశారని, అక్కడే ఇద్దరు వ్యక్తులు తమ సిమ్ కార్డులను పారేసినట్లు శివకుమార్ బంధువు పవన్ తెలిపారు. నిన్న తిరుపతిలోని రమణమూర్తి ఇంటికి శివకుమార్, పవన్ కలిసి వచ్చారు. ఈరోజు ఉదయం వైఫై కనెక్ట్ అవ్వడంతో, వాట్సాప్ కాల్ ద్వారా పవన్‌తో శివకుమార్ భార్య కళ్యాణి మాట్లాడారు. ఆ మాట్లాడిన కొద్దిసేపటికే శివకుమార్ బాత్రూంలో ఆత్మహత్యకు పాల్పడటం గమనార్హం. అసలు ఆత్మహత్యకు గల కారణాలు ఏంటి అనే కోణంలో పోలీసులు ముమ్మరంగా విచారిస్తున్నారు.


