జస్ట్‌ రూ. 5వేలు, మొబైల్‌ ఫోన్‌తో.. రూ. 50 కోట్ల వ్యాపారం! | How Parul Gulati Built A Rs 50 Crore Business With Just Rs 5,000? | Sakshi
Sakshi News home page

జస్ట్‌ రూ. 5వేలు, మొబైల్‌ ఫోన్‌తో.. రూ. 50 కోట్ల వ్యాపారం!

Jul 27 2026 4:38 PM | Updated on Jul 27 2026 4:42 PM

How Parul Gulati Built A Rs 50 Crore Business With Just Rs 5,000?

వ్యాపారం అనేది వినయోగదారుల అవసరం, నమ్మకం నుంచే పుడతాయని అంటారు పారిశ్రామిక నిపుణులు. ఏ బ్రాండ్‌ అయినా మొదట్లో చిన్నగా మొదలవుతుంది. అశేష ప్రజాదరణతోనే బ్రాండ్‌గా స్థిరపడుతుందని అంటారు. అచ్చం అలానే చాలామంది ఎదుర్కొనే, పెదవివిప్పని సమస్యను పరిష్కారం చూపుతూ తన వ్యాపార సామ్రాజ్యాన్ని నిర్మించుకుంది ఓ నటి. అంతేగాదు కేవలం చాలా తక్కువ మొత్తంతో పెట్టుబడి పెట్టి..కోట్లలో డబ్బులు ఆర్జిస్తూ..ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలకు గొప్ప వ్యాపార సూత్రాలను చెబుతోందామె. ఆ నటి ఎవరంటే..

నటిగా కెరీర్ ప్రారంభించి, వ్యాపారవేత్తగా అవతరించిన పరుల్ గులాటికి తన బిజినెస్‌ జర్నీ ఎలా మొదలైందో ఓ ఇంటర్వ్యూలో షేర్‌ చేసుకున్నారు. చాలామంది బహిరంగంగా చర్చించడానికి సిగ్గుపడే సమస్యను పరిష్కరించి..అత్యంత గుర్తింపు పొందిన నిష్‌ హెయిర్‌ బ్రాండ్‌ వ్యవస్థాపకురాలిగా మారింది. తాను దీన్ని కేవలం రూ. 5 వేలు పెట్టుబడితో మొదలుపెట్టి..ఇవాళ ఏకంగా రూ. 50 వేల కోట్ల టర్నోవర్‌ చేసే కంపెనీగా మార్చినట్లు వెల్లడించింది. 

ఆమె ప్రస్థానం మొదలైందిలా..
తాను నటిగా పనిచేస్తూ, టెలివిజన్ వాణిజ్య ప్రకటనలలో నటిస్తున్నప్పుడు వ్యాపారం ప్రారంభించాలనే కోరిక తనలో పుట్టిందని వెల్లడించింది పరుల్‌. ఆ రోజు నుంచి తనకంటూ వ్యాపారం ఉండాలని నిశ్చయించుకుని..హెయిర్‌ ఎక్స్‌ టెన్షన్లపై దృష్టిసారించినట్లు తెలిపింది. ఆమె కేవలం జుట్టు సమస్యలకు పరిష్కారాలను అందరికీ అందుబాటులో, సరసమైన ధరలలో, ఆన్‌లైన్‌లో లభించేలా చేయడమే తన లక్ష్యంగా పెట్టుకుంది. అలా ఆమె కేవలం రూ. 5 వేలతో తన వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. 

నిజానికి 2017లో 'నిష్ హెయిర్' ప్రారంభమైనప్పుడు, క్రియేటర్ ఎకానమీ ఇంకా శైశవ దశలోనే ఉంది. ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ నేటిలా అభివృద్ధి చెందలేదు, అలాగే పరుల్ తన కొత్త బ్రాండ్ కోసం సెలబ్రిటీల ప్రచారాన్ని ఇష్టపడలేదు. బదులుగా ఆమెనే స్వయంగా కంపెనీ ప్రతినిధిగా మారింది. ఇది తాత్కాలికమేనని, ఆ తర్వాత ప్రముఖ తారలనే అంబాసిడర్లుగా నియమించుకోవాల్సిందేనని అనుకుంది. అప్పటి వరకు ఆమె తన ఫోన్‌లో వీడియోలను రికార్డు చేసి..క్రమం తప్పకుండా కంటెంట్‌ను పోస్ట్ చేయాలని నిర్ణయించుకుంది. 

ఆ నిర్ణయమే ఆ తర్వాత బ్రాండ్ వృద్ధికి అతిపెద్ద కారణాలలో ఒకటిగా నిలిచింది. అలా ఆమె ఉదయం రాత్రి అని భేదం లేకుండా చాలా పోస్టులు చేసినట్లు తెలిపింది. చివరికి తాను నిష్‌ హెయిర్‌ మార్కెటింగ్‌ విభాగంగా మిగిలిపోయానని అంటోంది. వాళ్లకి తాను బడ్జెట్‌ని ఇవ్వనని, కేవలం రీల్స్‌ మాత్రమే చేస్తానని అన్నారు. 

ఎలా సక్సెస్‌ అయ్యిందంటే..
ఆమె తరచుగా టెలివిజన్ వాణిజ్య ప్రకటనల ఆడిషన్లకు హాజరయ్యేది, అక్కడ డజన్ల కొద్దీ మోడళ్లు వెయిటింగ్ రూములలో కలిసి కూర్చునేవారు. అక్కడ, ఆమె ఉద్దేశపూర్వకంగా ప్రజల ముందు తన హెయిర్ ఎక్స్‌టెన్షన్‌ను తీసివేసి, వారిలో ఉత్సుకతను, సంభాషణను రేకెత్తించేది. ఆ వ్యూహం ఫలించి..త్వరలోనే, తోటి నటీనటులు, మోడళ్లు ఆ ఉత్పత్తి ఎక్కడ నుంచి వచ్చిందని, తాము కొనుగోలు చేయగలమా అని అడగడం ప్రారంభించారు. అలా మొదటి కస్టమర్‌ని సంపాదించుకుంది. అయితే ఈ ఉత్తత్తులు ప్రారంభ ధరే రూ. 10 వేలు నుంచి రూ. 12 వేలు మధ్య ఉంటుంది. 

కానీ ఆమె పెట్టుబడిని తిరిగి రాబట్టుకోవడానికి సహాయపడుతుందన్న ఉద్దేశ్యంతో రూ. 5,000కే అమ్మడానికి అంగీకరించింది. అంతేగాతు తన మొదటి అమ్మకం జరగడానికే నెల పట్టిందని అంటోంది. సోషల్‌మీడియాని ఉపయోగించుకోవడాని కంటే ముందు..పరుల్ వారాంతాల్లో ఫ్లీ మార్కెట్లలో గడుపుతూ, చాలామంది అంతకుముందెన్నడూ చూడని ఒక ఉత్పత్తిని వినియోగదారులకు పరిచయం చేసేది. అంతేగాదు కొనుగోలుదారులను కలసి..ఆ హెయిర్‌ ఎక్స్‌టెన్షన్‌లను ప్రయత్నించమని ప్రోత్సహించేది. ముఖ్యంగా కస్టమర్ల నమ్మకాన్ని గెలుచుకునే ప్రయత్నంపై ఫోకస్‌ పెట్టేది. 

ఈ వ్యూహం అమ్మకాలను పెంచేందుకు, అవగాహన కల్పించడానికి ఉపయోగ పడింది. అలా వివిధ నగరాల్లో సుమారు 12 ఫ్లీ మార్కెట్ ఈవెంట్‌లను పూర్తి చేసే సమయానికి, వ్యాపారం గణనీయమైన సామర్థ్యాన్ని చూపించడం ప్రారంభించింది. ఆ విధంగా పరుల్‌ అహ్మదాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో లక్ష రూపాయలు సంపాదించిన విషయాన్ని వెల్లడించింది. అంతేగాదు వైరల్‌ అయిన ప్రతీది అమ్మకాలను తీసుకు రాదు. అందుకు ప్రభావవంతమైన కంటెంట్‌ కావాలి.  వీటన్నింటి తోపాటు అత్యంత ప్రభావవంతమైన కంటెంట్ వ్యూహం, కాబోయే కస్టమర్‌లకు ఉత్పత్తిని కొన్ని సెకన్లలోనే అర్థమయ్యేలా చేయడం అని చెబుతోంది. 

బ్రాండ్‌ వాల్యూ పెరిగే కొద్దీ..మార్కెటింగ్‌ చేసే విధానం మారాలి..
బ్రాండ్ పెరిగేకొద్దీ, పరుల్ దానిని మార్కెట్ చేయడానికి అసాధారణమైన మార్గాలను అన్వేషించారు. అందుకోసం నిష్ హెయిర్ సరఫరా చేసిన నిజమైన మానవ జుట్టుతో తయారు చేసిన దుస్తులు ధరించి ఆమె కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌కు హాజరై అందరి దృష్టిని ఆకర్షించారు. అంతేగాదు ప్రతి వ్యవస్థాపకుడు తనకు సాధ్యమైన చోటల్లా తన ఉత్పత్తిని ప్రోత్సహించేలా నమ్మకాన్ని పెంపొందించుకోవాలని అన్నారు. 

చివరగా ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు మిమ్మల్ని పూర్తిగా నమ్మండి, అలాగే మీ ఆలోచనను పదిమందితో పంచుకోండి అని చెబుతున్నారు. అంతేగాదు తన విజయం అనేది నిధుల సమీకరణతోనో లేదా ప్రకటనల బడ్జెట్‌లతోనో ప్రారంభం కాదు, నిజమైన సమస్యను పరిష్కరించడంతోనూ, ఉత్పత్తిని నమ్మడంతోనూ, అలాగే రోజు కెమెరా ముందు నిలబడటానికి సిద్ధంగా ఉండటంతో మొదలైందని ఆత్మవిశ్వాసంగా చెబుతోంది పరుల్‌.

 

(చదవండి: ప్లాస్టిక్ కవర్‌లలో పట్టు చీరలను పెడుతున్నారా..? జానపద గాయని శారీ టిప్స్‌..)

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement