కార్మికుల బిడ్డలు.. అంతరిక్షంలో దిట్టలు! | Nalgonda Youth Behind Skyroot Vikram 1 Success | Sakshi
Sakshi News home page

కార్మికుల బిడ్డలు.. అంతరిక్షంలో దిట్టలు!

Jul 27 2026 2:09 PM | Updated on Jul 27 2026 2:34 PM

 Nalgonda Youth Behind Skyroot Vikram 1 Success

తల్లిదండ్రులు, చెల్లితో వంశీ

గ్రామీణ నేపథ్యం.. సామాన్య కుటుంబాలు.. కానీ వారి లక్ష్యాలు మాత్రం ఆకాశాన్ని దాటాయి. దేశ అంతరిక్ష రంగ చరిత్రలో సరికొత్త అధ్యాయాన్ని లిఖించిన స్కైరూట్‌ ఏరోస్పేస్‌ ‘విక్రమ్‌–1’ రాకెట్‌ ప్రయోగం విజయవంతం కావడంలో ఉమ్మడి నల్లగొండ జిల్లాకు చెందిన ఇద్దరు యువకులు కీలక పాత్ర పోషించారు. ఆర్టీసీ కార్మికుడి కుమారుడైన నార్కట్‌పల్లికి చెందిన ప్రజ్ఞాపురం వంశీ క్యాడ్‌ ఇంజనీర్‌గా వ్యవహరించగా.. సిమెంట్‌ ఫ్యాక్టరీ కార్మికుడి బిడ్డ, సూర్యాపేట జిల్లా చింతలపాలెంకు చెందిన గంధం లక్ష్మీనాథ్‌ ఎలక్ట్రికల్‌ కేబుల్‌ హర్నెస్‌ డిజైన్, ఇంటిగ్రేషన్‌ ఇంజనీర్‌గా తమ బాధ్యతలు నిర్వర్తించారు. డీఆర్‌డీవోలో విశేష అనుభవం గడించి, ప్రస్తుతం స్కైరూట్‌లో ప్రతిష్టాత్మక ప్రాజెక్టులో పాలుపంచుకున్న ఈ యువ శాస్త్రవేత్తల స్ఫూర్తిదాయక ప్రయాణంపై ప్రత్యేక కథనం.

నార్కట్‌పల్లి : నార్కట్‌పల్లి మండల కేంద్రానికి చెందిన ప్రజ్ఞాపురం రవి వెంకట్‌పటేల్, సృజన దంపతుల కుమారుడు వంశీ అంతరిక్ష రంగంలో అరుదైన ఘనత సాధించారు. హైదరాబాద్‌కు చెందిన ప్రైవేట్‌ అంతరిక్ష సంస్థ ‘స్కైరూట్ ఏరోస్పేస్’ అత్యంత ప్రతిష్టాత్మకంగా తయారు చేసిన ‘విక్రమ్‌–1’ ప్రైవేట్‌ ఆర్బిటాయ్‌ రాకెట్‌ తయారీ బృందంలో వంశీ క్యాడ్‌ ఇంజనీర్‌గా తన వంతు కీలక బాధ్యతలు నిర్వర్తించారు.  

సుమారు నాలుగేళ్ల పాటు ఎంతో శ్రమించి, వివిధ హోదాల్లో పని చేసి సాధించిన ఈ చరిత్రాత్మక ఘటనలో నిపుణులైన బృందంతో పాటు వంశీ కూడా భాగస్వామి కావడం స్థానికంగా గర్వకారణంగా మారింది. వంశీ తండ్రి రవి వెంకట్‌పటేల్‌ ఆర్టీసీలో కండక్టర్‌గా ప్రస్థానం ప్రారంభించి, ట్రాఫిక్‌ ఇన్‌స్పెక్టర్‌గా విధులు నిర్వహించి, స్క్వాడ్‌ ఇన్‌చార్జ్‌గా ఉద్యోగ విరమణ పొందారు. వంశీ ప్రాథమిక, ఉన్నత పాఠశాల విద్యతో పాటు ఇంటర్మీడియట్  విద్యను నల్లగొండలోనే ప్రైవేట్‌ కళాశాలలో పూర్తి చేశారు. అనంతరం హైదరాబాద్‌లో మెకానికల్‌ ఇంజనీరింగ్‌లో బీటెక్‌ (2014) పూర్తి చేశారు.

డీఆర్‌డీవో నుంచి స్కైరూట్‌ వరకు..
బీటెక్‌ పూర్తయిన తర్వాత హైదరాబాద్‌లోని డిఫెన్స్‌ రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌ (డీఆర్‌డీవో)లో ప్రాజెక్ట్‌ ఇంజనీర్‌గా దాదాపు 6 సంవత్సరాల పాటు ఆయన సేవలందించారు. ద్రవ చోదక వ్యవస్థ (లిక్విడ్‌ ప్రొపల్షన్‌ సిస్టమ్‌) విభాగంలో ఇంటిగ్రేషన్, డిజైన్‌ పనుల్లో సంపాదించిన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకొని.. 2025 జనవరి 2న హైదరాబాద్‌కు చెందిన ‘సై్కరూట్‌ ఏరోస్పేస్‌’ ప్రైవేట్‌ సంస్థలో క్యాడ్‌ ఇంజనీర్‌గా చేరారు. ఆ అనుభవంతోనే ‘విక్రమ్‌–1’ రాకెట్‌ తయారీలో క్యాడ్‌ ఇంజనీర్‌గా పూర్తి బాధ్యతలు నిర్వర్తించి, రాకెట్‌ విజయవంతం కావడంలో తన వంతు పాత్ర పోషించారు. భవిష్యత్తులో చేపట్టబోయే ప్రాజెక్టుల్లోనూ సేవలందించే అవకాశం లభించిందని ఆయన తెలిపారు.

ఇంటిగ్రేషన్‌ టెస్ట్‌ ఇంజనీర్‌గా లక్ష్మీనాథ్‌
మేళ్లచెరువు : సూర్యాపేట జిల్లా చింతలపాలెం మండలకేంద్రానికి  చెందిన గంధం శ్రీను, శ్రీవాణి దంపతుల కుమారుడు లక్ష్మీనాథ్‌ ‘విక్రమ్‌–1’ ప్రైవేట్‌ ఆర్బిటాయ్‌ రాకెట్‌ తయారీ బృందంలో కీలకంగా పని చేశారు. ఎలక్ట్రికల్‌ కేబుల్‌ హెర్నెస్‌ డిజైన్, ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్టు ఇంజనీర్‌గా పనిచేసి యువతకు ఆదర్శంగా నిలిచాడు. వ్యవసాయ నేపథ్య కుటుంబానికి చెందిన లక్ష్మీనాథ్‌.. తండ్రి స్థానిక ఓ సిమెంట్‌ పరిశ్రమలో మిల్లర్‌గా, తల్లి ప్రైవేట్‌ స్కూల్‌లో టీచర్‌గా పని చేస్తూ లక్ష్మీనాథ్‌ను చదివించారు. టెన్త్‌ వరకు స్థానిక సీతా పబ్లిక్‌ స్కూల్‌లో చదివిన లక్ష్మీనాథ్‌.. ఇంటర్, బీటెక్‌ (2023)హైదరాబాద్‌లో పూర్తి చేశాడు. బీటెక్‌ తర్వాత డీఆర్‌డీఓలో ఇంటిగ్రేషన్‌ టెస్ట్‌ ఇంజనీర్‌గా ఏడాదిపాటు పనిచేశాడు.

స్కైరూట్‌ ఏరోస్పేస్‌లో సంవత్సర కాలంగా పనిచేస్తూ ఎలక్ట్రికల్‌  కేబుల్‌ హర్నెస్‌ డిజైన్, ఇంటిగ్రేషన్‌ అండ్‌ టెస్ట్‌ ఇంజనీర్‌గా పనిచేస్తూ విక్రమ్‌–1 (మిషన్‌ ఆగమన్‌)లో కీలకంగా బాధ్యతలు నిర్వర్తించి ప్రయోగం విజయవంతం కావడానికి కృషిచేశారు. భవిష్యత్‌లో భారత అంతరిక్ష రంగ అభివృద్ధికి మరింత సేవలందిస్తూ మారుమూల గ్రామీణ ప్రాంతాల యువతకు స్ఫూర్తిగా నిలవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నట్లు లక్ష్మీనాథ్‌ పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement