తమను ఎంతో కష్టపడి, ఎన్నో త్యాగాలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రుల పట్ల కన్నబిడ్డలు కృతజ్ఞతగా ఉండటం అనేది ఒక భావోద్వేగ అనుభూతి. అలా కన్నవారి పట్ల అమితమై ప్రేమానురాగాలు చూపించడం, సౌకర్యవంతమైన జీవితాన్ని అనుభవించేలా చేయడంతోపాటు వారి చిన్న చిన్న కలల్ని గుర్తు పెట్టుకుని మరీ నెరవేర్చే పిల్లలు చాలామందే ఉన్నారు. అలా తన తండ్రిని తొలిసారి 'వందే భారత్' రైలులో తీసుకెళ్లి ఆనందింప చేసిన వీడియో ఒకటినెట్టింట విశేషంగా నిలుస్తోంది.
'భుక్కడ్ ముసాఫిర్' అనే ఇన్‌స్టాగ్రామ్ ఐడీ ఉన్న ఒక ట్రావెలర్, ఇన్‌ఫ్లుయెన్సర్ ఈ వీడియోను షేర్ చేశారు. ఈ వీడియోలో ఆ వృద్ధుడైన తండ్రి ప్లాట్‌ఫామ్‌పై వేచి ఉండటం, రైలు ఎక్కి తన సీటులో కూర్చోవడం, రైలు కిటికీలోంచి అందమైన ప్రకృతి దృశ్యాలను ఆస్వాదిస్తూ మురిసిపోవడం కనిపిస్తుంది. ఆయన ముఖంలోని నవ్వును చూసి కుటుంబ సభ్యులు కూడా ఎంతో సంతోషంగా కనిపించారు. ఈ సందర్భంగా కుమారుడు మాట్లాడుతూ "ఒకప్పుడు మా నాన్న రూ. 5 ఆదా చేయడం కోసం ఆటో ఎక్కకుండా ఆఫీసుకు నడిచి వెళ్లేవారు. అందుకే ఇప్పుడు నాకు అవకాశం దొరికినప్పుడల్లా ఆయనకు సౌకర్యవంతమైన జీవితాన్ని అందించడానికి ఆ డబ్బును ఖర్చు చేస్తున్నాను" అని ఆ కుమారుడు వీడియో కింద రాసుకొచ్చారు.
ఇదీ చదవండి: రూ. 5 లక్షల వెండి పాత్ర పొరపాటున చెత్తలో.. చివరికి
నెటిజన్ల స్పందన
ఈ వీడియో చూసి నెటిజన్లు ఎంతో భావోద్వేగానికి లోనయ్యారు. నిజమైన ఆనందం ఇదే... పిల్లల బాధ్యతలు నెరవేర్చడంలో తమ సంతోషాలను త్యాగం చేసిన తల్లిదండ్రులకు తిరిగి ఆ సుఖసంతోషాలను అందించడం లోనే నిజమైన గెలుపు ఉంది వ్యాఖ్యానించారు. రైలు టికెట్ ధర ఎంతో తండ్రికి తెలిస్తే తిడతారేమో అని కొందరు సరదాగా కామెంట్ చేయడం విశేషం.
ఇదీ చదవండి: రెస్ట్ రూంలో కెమెరా : భారతీయ సంతతి వైద్యుడికి జైలు
వందే భారత్, రైల్వే రాయితీలు ఉండవా?
వందే భారత్ రైళ్లలో సీనియర్ సిటిజన్లకు ప్రత్యేకంగా ఎటువంటి టికెట్ రాయితీలు ఉండవు. కరోనా సమయంలో ఇండియన్ రైల్వేస్ సీనియర్ సిటిజన్లకు ఇచ్చే సాధారణ రాయితీలను కూడా రద్దు చేసింది. అయితే, ఐఆర్‌సిటిసి (IRCTC)లో క్యాన్సర్, థాలసేమియా, గుండె సంబంధిత సమస్యలు, కిడ్నీ వ్యాధులు లేదా క్షయ (టిబి) వంటి తీవ్రమైన అనారోగ్య సమస్యలు ఉన్న రోగులకు, అలాగే దివ్యాంగులకు 75శాతం వరకు టికెట్ రాయితీని అందిస్తోంది. కానీ, ఈ రాయితీలు వందే భారత్ రైళ్లకు వర్తించవు.
ఇదీ చదవండి: ఒకే కాన్పులో నలుగురు అమ్మాయిలు : 10 సీటర్ కారు కావాలి


