'సర్, మీ ప్రభుత్వానికి మంచి బుద్ధి క‌ల‌గాలి' | How Shatrughan Sinha, Naseeruddin Shah Reacts Delhi Police Action | Sakshi
Sakshi News home page

హింస వ‌ద్దు.. చ‌ర్చ‌లు జ‌ర‌పండి చాలు

Jul 22 2026 6:00 PM | Updated on Jul 22 2026 6:20 PM

How Shatrughan Sinha, Naseeruddin Shah Reacts Delhi Police Action

కేంద్రానికి శ‌త్రుఘ్న సిన్హా, నసీరుద్దీన్ షా విజ్ఞ‌ప్తి

న్యూఢిల్లీ: విద్యార్థుల ప‌ట్ల కేంద్ర ప్ర‌భుత్వం వ్య‌వ‌హ‌రించిన తీరును బాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు, కేంద్ర మాజీ మంత్రి శ‌త్రుఘ్న సిన్హా ఖండించారు. నీట్ యూజీ పేప‌ర్ లీకేజీ వ్య‌వ‌హారంలో న్యాయం కోసం శాంతియుతంగా పోరాడుతున్న యువ‌త‌ను దౌర్జ‌న్యంగా అణ‌చివేయాల‌ని చూడ‌డం స‌మంజ‌సం కాద‌ని హిత‌వు పలికారు. పంతాల‌కు పోకుండా ఉద్య‌మ‌కారుల‌తో చ‌ర్చ‌లు జ‌రిపి స‌మ‌స్య ప‌రిష్క‌రించాల‌ని మోదీ స‌ర్కారుకు సూచించారు. పార్ల‌మెంట్ వెలుపల‌ ప్ర‌తిప‌క్ష నాయ‌కుల అరెస్ట్‌ను త‌ప్పుబ‌ట్టారు. ఈ మేర‌కు ఎక్స్‌లో ఘాటు వ్యాఖ్య‌ల‌తో పోస్ట్ పెట్టారు.

'వినాశకాలే విపరీత బుద్ధి'... సర్, మీ ప్రభుత్వానికి ఎంత త్వరగా అయితే అంత త్వ‌ర‌గా మంచి బుద్ధి వ‌స్తుంద‌ని ఆశిస్తున్నాను. ద‌య్య‌చేసి విద్యార్థుల పోరాటాన్ని ఇగో స‌మ‌స్య‌గా చూడ‌కండి. జెన్ జెడ్/సీజేపీ చట్టబద్ధమైన డిమాండ్లను పరిగణన‌లోకి తీసుకోండి. ప్రభుత్వానికి గానీ, యువతరానికి గానీ ఏమాత్రం మేలు చేయని, మీకు అత్యంత విధేయులైన మీ ప్రతినిధులు చేసే రెచ్చగొట్టే ప్రకటనలను నియంత్రించండి.

నిరసన తెలిపే హక్కు, డిమాండ్ చేసే హక్కును కాపాడాలి. లాఠీచార్జి, దౌర్జ‌న్యాల‌తో వాక్ స్వేచ్ఛ‌ను హ‌రించ‌కూడ‌దు. పోరాటం చేస్తున్న‌వారంతా మన సమాజానికి చెందిన ప్రజలే. లోక్‌స‌భ‌లో ప్ర‌తిప‌క్ష నాయ‌కుడైన రాహుల్ గాంధీతో వ్యవహరించాల్సిన పద్ధతి ఇదేనా? 'వారి' డిమాండ్లు నెరవేరనిదే ప్రభుత్వం పార్లమెంటులోనూ, పార్లమెంటు బయట కూడా విజయం సాధించకపోవచ్చు. మన శాంతియుత నిరసనకారులను, మద్దతుదారులను దేవుడు ఆశీర్వదించుగాక. జై హింద్!'' అంటూ  శ‌త్రుఘ్న సిన్హా త‌న పోస్ట్‌లో రాసుకొచ్చారు.

నాకు కోపం వస్తోంది: నసీరుద్దీన్ షా
ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద విద్యార్థులపై పోలీసులు వ్య‌హ‌రించిన తీరుపై సీనియ‌ర్‌ నటుడు నసీరుద్దీన్ షా తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ దురాఘత ఫలితాన్ని ఏదో ఒకరోజు వారు కూడా క‌చ్చితంగా అనుభవిస్తార‌ని శ‌పించారు. విద్యార్థుల‌కు పోరాటానికి అండ‌గా ఉంటామ‌ని ఆయ‌న భ‌రోసా ఇచ్చారు. ఈ మేర‌కు సెల్ఫీ వీడియో విడుద‌ల చేశారు.

చ‌ద‌వండి: డింపుల్ వీడియోలు వైర‌ల్‌.. అఖిలేశ్ యాద‌వ్‌ అరెస్ట్‌

''అమెరికా ఐసీఈ ఏజెంట్లను తలపించేలా, ముసుగులు ధరించి లాఠీలు పట్టుకున్న ఆ దుండగులు మన పిల్లలను క్రూరంగా హింసిస్తుండటం చూసి, ప్రస్తుతం నా గుండె బరువెక్కింది, నాకు తీవ్రమైన కోపం వస్తోంది. అప్పుడప్పుడు మీ పిల్లల గురించి ఆలోచించండి, అలాగే ఒకరోజు మీకు కూడా అదే గతి పడుతుందని గుర్తుంచుకోండి” అని నసీరుద్దీన్ షా అన్నారు.

మీకు అండ‌గా మేముంటాం
న్యాయ‌మైన డిమాండ్ల సాధ‌న‌కు ఉద్య‌మిస్తున్న యువ‌త‌కు చాలా మంది ప్రజల సానుభూతి ఉంద‌న్నారు షా.  విద్యార్థుల పోరాటానికి ఎంతో మంది అండ‌దండ‌లు ఉన్నాయని, పోరాటం కొన‌సాగించాల‌న్నారు. దేశ యువతపై త‌నకు ఎప్పుడూ ఆశ ఉండేదని, అది ఇప్పుడు మరింత ద్విగుణీకృతం అయింద‌ని పేర్కొన్నారు. మీరు మీ పోరాటాన్ని కొనసాగించండి, మేము మీకు అండగా ఉంటామని నసీరుద్దీన్ షా భ‌రోసా ఇచ్చారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement