ప్రధాని నివాసం 'యుద్ధరంగం' | Indian Opposition parties besiege PM Narendra Modi house | Sakshi
Sakshi News home page

ప్రధాని నివాసం 'యుద్ధరంగం'

Jul 22 2026 1:56 AM | Updated on Jul 22 2026 1:56 AM

Indian Opposition parties besiege PM Narendra Modi house

మోదీ నివాసం ఎదుట ఆందోళనకు దిగిన రాహుల్‌గాం«దీని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు, తోపులాటలో గాయమై రాహుల్‌ ముక్కు నుంచి కారుతున్న రక్తం

మోదీ ఇంటిని ముట్టడించిన విపక్షాలు

విద్యార్థులపై దమనకాండకు బాధ్యత వహించాలి.. మోదీ, అమిత్‌ షా రాజీనామా చేయాలని డిమాండ్‌ 

ఖర్గే, రాహుల్, ప్రియాంక, డీకే శివకుమార్, వీడీ సతీశన్‌ బైఠాయింపు 

నాలుగు గంటలపాటు ధర్నా... మోదీకి వ్యతిరేకంగా నినాదాలు 

ప్రభుత్వ దూతగా చర్చలు జరిపిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ 

నీట్‌–యూజీపై పార్లమెంట్‌లో చర్చకు సిద్ధంగా ఉన్నట్లు వెల్లడి

అంగీకరించని ప్రతిపక్ష నేతలు.. రాజీనామా డిమాండ్‌పై పట్టు 

విపక్ష నేతలను బలవంతంగా అరెస్టు చేసిన పోలీసులు  

తోపులాటలో రాహుల్‌ గాంధీకి గాయాలు.. ముక్కు నుంచి రక్తం 

నిర్బంధం నుంచి రాహుల్, ప్రియాంక, అఖిలేష్‌ విడుదల

న్యూఢిల్లీ: నీట్‌–యూజీ పేపర్‌ లీక్‌ అంశంపై ప్రతిపక్షాల ధర్నాతో ఢిల్లీ లోక్‌కల్యాణ్‌ మార్గ్‌లోని ప్రధానమంత్రి నివాస ప్రాంతం అట్టుడికింది. న్యాయం చేయాలని కోరిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జికి నైతిక బాధ్యత వహిస్తూ ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా రాజీనామా చేయాలని విపక్షాలు మంగళవారం గొంతెత్తాయి. కాంగ్రెస్‌ నేతలు మల్లికార్జున ఖర్గే, రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, కర్ణాటక సీఎం డీకే శివకుమార్, కేరళ సీఎం వీడీ సతీశన్‌ సహా పలు పార్టీల ఎంపీలు, నేతలు హైసెక్యూరిటీ జోన్‌ అయిన ప్రధానమంత్రి నివాసాన్ని ముట్టడించారు. అక్కడే బైఠాయించారు. ప్రధాని మోదీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నినాదాల హోరుతో ఆ ప్రాంతం దద్దరిల్లింది. పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో అరుపులు, తోపులాటలతో యుద్ధ రంగాన్ని తలపించింది. 

దాదాపు 20 నిమిషాల తర్వాత కేంద్ర ప్రభుత్వ దూతగా కేంద్ర సహాయ మంత్రి జితేంద్ర సింగ్‌ కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్‌ మోహన్‌తో కలిసి ధర్నా స్థలికి చేరుకున్నారు. నిరసన విరమించాలని రాహుల్‌ గాంధీకి విజ్ఞప్తి చేశారు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో ఫోన్‌లో మాట్లాడారు. నీట్‌–యూజీపై పార్లమెంట్‌లో చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అందుకు కాంగ్రెస్‌ నేతలు అంగీకరించలేదు. మోదీ రాజీనామా చేయాల్సిందేనని, లేకపోతే రాత్రంతా ఇక్కడే ఉంటామని తేల్చి చెప్పారు. చేసేది లేక జితేంద్ర సింగ్‌ వెనుదిరిగారు. ప్రభుత్వం ప్రజల స్వేచ్ఛపై ఆంక్షలు విధించిందని ఆరోపిస్తూ ప్రతిపక్ష నేతలు తమ చేతులను తాళ్లతో కట్టేసుకున్నారు. దాదాపు నాలుగు గంటలపాటు ధర్నా కొనసాగింది. చివరకు పోలీసులు ప్రతిపక్ష నాయకులను బలవంతంగా అదుపులోకి తీసుకొని వేర్వేరు పోలీసు స్టేషన్లకు తరలించారు.  

యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు..
విద్యార్థులపై దాడి అంటే ప్రతి భారతీయ కుటుంబంపై దాడి జరిగినట్లేనని రాహుల్‌ గాంధీ ధ్వజమెత్తారు. ఎలాంటి సమాధానాలు చెప్పకుండా, ఎలాంటి పరిణామాలనైనా ఎదుర్కోకుండా తప్పించుకోగలనని ప్రధాని మోదీ భావిస్తున్నారని.. కానీ, ఈసారి అలా చేయడం కుదరదని తేల్చిచెప్పారు. ధర్నా సందర్భంగా ఆయన మాట్లాడారు. మన విద్యార్థులకు న్యాయం జరగాలని విశ్వసించే దేశభక్తి గల ప్రతి భారతీయుడు ఈ ధర్నాలో తమతో చేరాలని రాహుల్‌ కోరారు. విద్యార్థుల గళాన్ని ఎవరూ విస్మరించలేరని చెప్పారు. ‘‘సోమవారం విద్యార్థులపై జరిగిన అరాచకాలకు సంబంధించి ప్రధాని మోదీ నుంచి సమాధానం కోరేందుకు ఆయన నివాసానికి ర్యాలీగా వెళ్లాం. జరిగిన దానికి బాధ్యత వహించడానికి గానీ, దీనిపై పార్లమెంట్‌లో చర్చ జరపడానికి గానీ ప్రభుత్వం ఇష్టపడటం లేదు. యువత భవిష్యత్తును నాశనం చేసినందుకు ప్రధానమంత్రి, హోం మంత్రి రాజీనామా చేయాలి. 


విద్యార్థుల హక్కులు, వారి న్యాయమైన డిమాండ్లకు కాంగ్రెస్‌ పార్టీ అండగా నిలుస్తుంది’’ అని రాహుల్‌ గాంధీ ‘ఎక్స్‌’లో పోస్టుచేశారు. ‘‘విద్యార్థులపై లాఠీచార్జి, బలప్రయోగం చేసినందుకు ఈ పిరికిపంద, నియంతృత్వ ప్రభుత్వం సమాధానం చెప్పక తప్పదు. మోదీ, అమిత్‌ షా మన యువత పట్ల తప్పు చేశారు. వారు పదవుల నుంచి తప్పుకోవాల్సిందే’’ అని మల్లికార్జున ఖర్గే తేల్చిచెప్పారు. విద్యార్థులకు న్యాయం చేసి, వారి డిమాండ్లను ప్రభుత్వం అంగీకరించే దాకా తమ పోరాటం ఆపబోమని కాంగ్రెస్‌ ఎంపీ పవన్‌ ఖేరా పేర్కొన్నారు. న్యాయం జరిగే వరకూ వెనక్కి తగ్గబోమన్నారు. పోలీసులు తమపై బలప్రయోగం చేశారని కొందరు ఎంపీలు ఆరోపించారు. సోమవారం జరిగిన లాఠీచార్జిలో గాయపడి రామ్‌ మనోహర్‌ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ తదితరులు మంగళవారం పరామర్శించారు. వారి ఆరోగ్య పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు.


అరెస్టు.. విడుదల 
ప్రధానమంత్రి నివాసం ఎదుట బైఠాయించిన రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేష్‌ యాదవ్‌ను పోలీసులు బలవంతంగా అరెస్టుచేశారు. ఈ సందర్భంగా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసులను కాంగ్రెస్‌ శ్రేణులు ప్రతిఘటించేందుకు ప్రయత్నించాయి. పోలీసులను తనను అరెస్టు చేసే సమయంలో రాహుల్‌ గాంధీ నేలపై పడుకొని కనిపించారు. ఈ సందర్భంగా జరిగిన ఘర్షణలో ఆయనకు స్వల్ప గాయమైంది. రాహుల్‌కు, అఖిలేష్‌ యాదవ్‌ను పోలీసులు నిర్బంధించి, ఛత్రసాల్‌ స్టేడియంకు తరలించారు. ‘‘భారతదేశంలో ప్రజాస్వామ్యం ప్రస్తుతం అమలవుతోంది’’ అని రాహుల్‌ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. 

ప్రధాని మోదీ అధికారిక నివాసం వద్ద ధర్నా చేస్తున్న కాంగ్రెస్‌ నేతలు. చిత్రంలో రాహుల్, ప్రియాంక, ఖర్గే, డీకే శివకుమార్, కేసీ వేణుగోపాల్, అనిల్‌కుమార్‌ యాదవ్‌  తదితరులు   

రాహుల్‌ గాంధీ కంటి కింద గాయం కావడంతోపాటు చేతులు, కాళ్లపై కూడా స్వల్ప గాయాలయ్యాయని కాంగ్రెస్‌ నేతలు చెప్పారు. రాహుల్‌ ముక్కు నుంచి రక్తం కారినట్లు తెలుస్తోంది. తనను అరెస్టు చేస్తున్న ఫొటోలను ఆయన ‘ఎక్స్‌’లో షేర్‌చేశారు. ‘‘మోదీజీ, మీరు ఎంత ఒత్తిడి తెచ్చినా, మీ సర్వశక్తులు ఒడ్డినా సరే విద్యార్థుల న్యాయం జరగడం కోసం సాగుతున్న ఈ పోరాటం మాత్రం ఇప్పుడు ఆగదు’’ అని ఉద్ఘాటించారు. మంగళవారం రాత్రి రాహుల్, అఖిలేష్‌ను ఛత్రసాల్‌ స్టేడియం నుంచి పోలీసులు విడుదల చేశారు. ప్రియాంక గాంధీని మందిర్‌మార్గ్‌ స్టేషన్‌కు తరలించారు. ఆమె తల్లి సోనియా గాంధీ స్టేషన్‌కు చేరుకొని ప్రియాంకను పరామర్శించారు. తర్వాత ప్రియాంకను పోలీసులు విడుదల చేశారు.

పార్టీ నేతలను అరెస్టు చేసి తరలించిన మందిర్‌మార్గ్‌ పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన సోనియాగాంధీ 

రాహుల్‌ గాంధీ మాట మార్చారు 
నీట్‌–యూజీకి సంబంధించిన అన్ని అంశాలపై, దానిపై జరుగుతున్న ఉద్యమంపై చర్చించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌ ఒక ప్రకటనలో వెల్లడించారు. దీనిపై చర్చకు అంగీకరించిన రాహుల్‌ గాంధీ కొద్ది నిమిషాల్లోనే వెనక్కి తగ్గారని, ఆ స్థాయి నాయకుడికి ఇది తగదని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో చర్చించడంతోపాటు కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌ కూడా రాజీనామా చేయాలని పట్టబట్టారని చెప్పారు. నీట్‌–యూజీపై పార్లమెంట్‌లో నిబంధనల ప్రకారం అధికారిక చర్చ కోసం కాంగ్రెస్‌ ఇప్పటివరకు ఎటువంటి నోటీసు ఇవ్వలేదని తెలిపారు. రాహుల్‌ గాంధీ వంటి సీనియర్‌ నాయకుడు, ప్రతిపక్ష నేత మాట తప్పడం దురదృష్టకరం, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధం అని జితేంద్ర సింగ్‌ ఆక్షేపించారు. పార్లమెంట్‌లో చర్చకు ఇకనైనా ముందుకు రావాలని ప్రతిపక్షాలకు సూచించారు.    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement