డెహ్రాడూన్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తున్న ప్రశ్నపత్రాల లీకేజీలు ఆగడం లేదు. తాజాగా ఉత్తరాఖండ్‌లోని ‘వీర్ మాధో సింగ్ భండారి ఉత్తరాఖండ్ టెక్నికల్ యూనివర్సిటీ’కి చెందిన రెండు సెమిస్టర్ పరీక్షల ప్రశ్నపత్రాలు పరీక్షకు ముందే లీకయ్యాయి. విశ్వవిద్యాలయానికి చెందిన ఓ ప్రొఫెసర్ వాట్సాప్ గ్రూపుల ద్వారా ప్రశ్నపత్రాలను ముందుగానే షేర్ చేసినట్లు విచారణలో తేలడంతో, వర్సిటీ యంత్రాంగం ఆ రెండు పరీక్షలను రద్దు చేసింది. ఫలితంగా రాష్ట్రంలోని 12 ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన వేలాది మంది విద్యార్థులు మళ్లీ పరీక్షలు రాయాల్సి వస్తున్నది.
డెహ్రాడూన్‌లోని శివాలిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆశిష్ కుమార్ గుప్తా.. విద్యార్థుల వాట్సాప్ గ్రూప్‌లు, ఆన్‌లైన్ పోర్టల్‌లో ప్రశ్నపత్రాలను షేర్ చేసినట్లు వర్సిటీ విచారణలో వెల్లడైంది. ఈ వ్యవహారం వెలుగులోకి రాగానే వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు ఒక హైలెవల్ విచారణ కమిటీని ఏర్పాటు చేశారు. వర్సిటీ కమిటీ, కాలేజ్ ఇంటర్నల్ ఎంక్వైరీలో ఈ ఆరోపణలు ప్రాథమికంగా నిజమని తేలాయి. ఈ ఘటనపై కఠిన చర్యలు తీసుకున్న వర్శిటీ.. ప్రొఫెసర్ డాక్టర్ ఆశిష్ కుమార్ గుప్తాను రాబోయే ఏడేళ్ల పాటు విశ్వవిద్యాలయానికి సంబంధించిన ఎలాంటి పరీక్షల విధుల్లోనూ పాల్గొనకుండా నిషేధించింది.
అదే విధంగా పరీక్షల గోప్యతను కాపాడటంలో విఫలమైనందుకు శివాలిక్ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్‌కు కూడా తీవ్రమైన హెచ్చరిక జారీ చేసింది. ‘మెషిన్ లెర్నింగ్ ఫర్ ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్’, ‘ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్ థియరీ’ సబ్జెక్టుల పరీక్షలను రద్దు చేసినట్లు పరీక్షల కంట్రోలర్ డాక్టర్ వీకే పటేల్ తెలిపారు. రద్దయిన ఈ రెండు పేపర్లకు సంబంధించిన పరీక్షలను ఆగస్టు మూడో వారంలో తిరిగి నిర్వహిస్తామన్నారు. ఈ పేపర్ లీక్ వ్యవహారం బయటపడటానికి రెండు రోజుల ముందు డెహ్రాడూన్‌లో విద్యార్థులు నిరసన చేపట్టారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన నిర్వహించారు.


