సాక్షి, విజయవాడ: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అరెస్టు నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నిరసనలకు వ్యతిరేకంగా విజయవాడలో బీజేపీ కౌంటర్ ఆందోళన చేపట్టింది. ప్రధానమంత్రి నివాసం వద్ద కాంగ్రెస్ చేపట్టిన నిరసన ప్రజాస్వామ్య విరుద్ధమని బీజేపీ నాయకులు విమర్శించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు పార్టీ జెండాల కర్రలతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నట్టు సమాచారం.
వివరాల ప్రకారం.. విజయవాడలో మ్యూజియం రోడ్డులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చేరుకున్న బీజేపీ కార్యకర్తలు "డౌన్ డౌన్ రాహుల్ గాంధీ", "డౌన్ డౌన్ కాంగ్రెస్ పార్టీ" అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్ పార్టీ దేశ ప్రజలను తప్పుదోవ పట్టించే రాజకీయాలు చేస్తోందని వారు ఆరోపించారు. కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ఒకేచోట చేరడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అడ్డుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా కాంగ్రెస్ కార్యాలయం వద్ద భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసుల జోక్యంతో పరిస్థితి అదుపులోకి వచ్చినప్పటికీ, కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కొనసాగింది.
అనంతరం, ఏపీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ మాట్లాడుతూ..‘మోదీ ఇంటి ముట్టడి వెనుక అసలు శక్తులు బయటపడ్డాయి. దాడి వెనుక కాంగ్రెస్ అగ్రనేతల హస్తం ఉంది. జంతర్ మంతర్ నిరసనలకు కాంగ్రెసే సూత్రధారి. సోనమ్ వాంగ్‌చుక్‌ను వెనుక ఉండి నడిపిస్తోంది కాంగ్రెస్ పార్టీనే. నిరసనల్లో ఒక్క నీట్ విద్యార్థి కూడా లేరు, కేవలం లెఫ్ట్ యూనియన్ నాయకులే ఉన్నారు. నిరసనల్లో అర్బన్ నక్సల్స్, 370 రద్దును వ్యతిరేకించే శక్తులు ఉన్నాయి. నీట్ లీకేజీకి సంబంధించి 15 మందిని ఇప్పటికే అరెస్ట్ చేశారు. పేపర్ లీకేజీ అంశంపై పార్లమెంట్‌లో మాట్లాడే ధైర్యం ప్రతిపక్షాలకు లేదు. నేపాల్, బంగ్లాదేశ్ తరహా అలజడులు సృష్టిస్తే ఉపేక్షించం. విద్యార్థులకు భరోసా, నిజమైన నీట్ బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుంది’ అని చెప్పుకొచ్చారు.


